ఇంటర్ నేషనల్ పాఠశాలలకు దీటుగా ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ పాఠశాలల భవనాల నిర్మాణాలు చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు విద్యా శాఖ అధికారులను అదేశించారు. డా. బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలోని డిప్యూటి సీఎం కార్యాలయంలో ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ పాఠశాలల భవన నిర్మాణాలపై విద్యా శాఖ ఉన్నత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందిరమ్మ రాజ్యంలో పాఠశాలల మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తున్నామన్నారు. అందులో భాగంగానే ఈ వార్షిక సంవత్సరంలో రూ. 2500 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా 100 ఎస్సీ, బిసీ, మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలల భవనాల నిర్మాణం చేపడుతున్నట్టు వివరించారు. ఒక్కో రెసిడెన్షియల్ భవనానికి ప్రభుత్వం రూ.25 కోట్లు చొప్పున మంజూరు చేసిందన్నారు. భవన నిర్మాణాలకు గాను బడ్జెట్‌లో నిధుల కేటాయింపు కూడ జరిగినందున భవన నిర్మాణాల పనులు త్వరితగతిన ప్రారంభించడానికి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇప్పటి వరకు రెసిడెన్షియల్ పాఠశాలలు వేర్వేరుగా ఉన్నట్టుగా కాకుండా ఇక ముందు నిర్మించే భవనాలు ఒక చోట ఉండే విధంగా యాక్షన్ ప్లాన్ రూపొందించాలన్నారు. ఎస్సీ, బిసి, మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలల భవనాలు ఇంటిగ్రేటేడ్గా ఒకే చోట నిర్మాణం చేయడం వల్ల స్థల సమస్యను అధిగమించొచ్చని సూచించారు. అదే విధంగా కామన్‌గా అందేటి సౌకర్యాల వల్ల కూడ కొంత అదనపు ప్రయోజనం కల్గుతుందన్నారు. అన్ని సామాజిక వర్గాల విద్యార్థులు ఒకే చోట ఉండటం వల్ల విద్యార్థుల్లో సోదర భావాన్ని పెంపొందించడం వల్ల కుల రహిత సమాజానికి బాటలు వేసిన వారమవుతామన్నారు. అలాగే మిని ఎడ్యుకేషన్ హబ్‌గా అభివృద్ది చేయడానికి బాగుంటుందని వివరించారు.
ఎస్సీ, బిసి, మైనార్టీ బాలుర ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను చింతకాని మండల కేంద్రంలోని ఇండోర్ స్టేడియం సమీపంలో ఉన్న 10 ఎకరాల స్థలంలో నిర్మాణం చేయనున్నట్టు చెప్పారు. ఎస్సీ, బిసి, మైనార్టీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను ఎర్రుపాలెం మండల పరిధిలో నిర్మాణం చేయడానికి స్థల ఎంపిక చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధంగా ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ పాఠశాలల భవనాల నిర్మాణం జరుగడానికి కావాల్సిన స్థల ఎంపికను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. రెసిడెన్షియల్ పాఠశాలల భవనాల నిర్మాణం త్వరగా జరుగడానికి వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని ప్లానింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అబ్ధుల్ నదీంను ఆదేశించారు. అనంతరం బెంగళూర్‌కు చెందిన ఆర్కిటెక్ ప్రతినిధులు దేశంలో వివిధ ప్రాంతాల్లో వారు చేపట్టిన ఇంటర్ నేషనల్ మోడల్ పాఠశాలలకు సంబంధించిన పవర్ పాయింట్ ప్రజేటేంషన్‌ను విద్యాశాఖ అధికారుల సమక్ష్యంలో డిప్యూటి సీఎం తిలకించారు. అన్ని హంగులతో అత్యుత్తమ ప్రమాణాలతో 100 రెసిడెన్షియల్ పాఠశాలల భవనాల నిర్మాణాలు ఒకే మోడల్‌గా చేపట్టాడానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను అదేశించారు.
ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలకు సిద్దమయ్యే నిరుద్యోగులకు కోచింగ్ సౌకర్యం కోసం నాలేడ్జ్ కేంద్రాలను నియోజకవర్గ కేంద్రాల వారీగా ఏర్పాటు చేయనున్నట్టు డిప్యూటి సీఎం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో టీఎస్‌పీఎస్సీ ద్వారా ఉద్యోగాల నోటిఫికేషన్లకు జాబ్ క్యాలెండర్ ప్రకటించునున్న నేపథ్యంలో పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన నిరుద్యోగులకు ఆర్ధిక వెసలుబాటు కల్పించడానికి ఈకేంద్రాలను ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. జ్యోతి భా పూలే ప్రజాభవన్ క్షేత్రంగా నియోజకవర్గాల్లోని నాలెడ్జ్ సెంటర్లకు వచ్చే నిరుద్యోగులకు నేరుగా ఆన్‌లైన్ ద్వారా కోచింగ్ ఇప్పించే ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. ఈ లక్ష్యం సఫలికృతం కావాడానికి కావాల్సిన అన్ని రకాల చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను అదేశించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..