
ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్‌లో వాట్‌నెక్స్ట్? ఇప్పటికే 3 సార్లు సుదీర్ఘంగా ప్రశ్నించిన ఈడీ..మళ్లీ ఎప్పుడు రావాలన్నది చెప్పలేదు. అటు సుప్రీంలో కవిత వేసిన పిటిషన్ 24న విచారణకు రానుంది. మరి కోర్టు ఏం చెబుతుంది?ఆ తర్వాత ఏం జరుగుతుందన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. ఇక ఢిల్లీ నుంచి నేరుగా ప్రగతిభవన్ వచ్చిన కవిత.. సీఎం కేసీఆర్‌తో సమావేశం అయ్యారు.
లిక్కర్ స్కామ్‌లో వరుసుగా రెండు రోజుల పాటు ఈడీ విచారణను ఎదుర్కొన్న కవిత హైదరాబాద్ వచ్చారు. ఆమె వెంట మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు ఉన్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ముగ్గురు నేరుగా ప్రగతిభవన్ వచ్చారు. గత 3 రోజులుగా ఢిల్లీలో జరిగిన పరిణామాలపై సీఎం కేసీఆర్‌తో చర్చించారు.ఈడీ విచారణ అంశాలను సీఎంకు వివరించారు. ఇకపై విచారణ తీరు ఎలా ఉండబోతుంది? 24న సుప్రీం ఇచ్చే తీర్పు, వాదనలు ఎలా ఉండాలన్నదానిపై చర్చించినట్లు తెలుస్తోంది.. బీజేపీని రాజకీయంగా, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలను న్యాయపరంగా.. ఎలా ఎదుర్కోవాలనే విషయాలపై సమాలోచనలు చేసినట్లు సమాచారం.
ఇక కవితను ఈడీ మళ్లీ ఎప్పుడు విచారిస్తుందన్నది క్లారిటీ లేదు. ఇప్పటికే 3 సార్లు ప్రశ్నించింది. ఈనెల 11న 8 గంటలు.. 20న 11 గంటలు, 21న 10 గంటలపాటు విచారించింది. అంటే ఇప్పటికే 29 గంటలపాటు ప్రశ్నించింది. మళ్లీ ఎప్పుడు రావాలన్నది మెయిల్ చేస్తామని చెప్పింది ఈడీ . కానీ ఇంత వరకు ఎలాంటి సమాచారం పంపలేదు. అటు కవిత వేసిన పిటిషన్ 24న సుప్రీం ముందుకు రానుంది. ఈడీ విచారణ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. అలాగేఈడీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని పిటిషన్‌లో పేర్కొన్నారు కవిత. మరి దీనిపై సుప్రీం ఎలా స్పందిస్తుంది.? విచారణపై స్టే విధిస్తుందా? లేక దర్యాప్తులో జోక్యం చేసుకోవడానికి నో చెబుతుందా ? లేక మహిళ అన్న కోణంలో ఏమైనా వెసులుబాట్లు కల్పిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి సుప్రీం తీర్పు తర్వాతే ఈడీ దర్యాప్తుపై ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.
అటు లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం సిసోడియా ఈడీ కస్టడీ ముగిసింది. కోర్టు ఏప్రిల్ 5 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో తీహార్ జైలుకు తరలించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..