
మోసపోయేవాడు ఉంటే.. మోసం చేసేవాళ్లకు కొదవే లేదు ఈ దునియాలో. కాస్త నమ్మితే చాలు.. ప్రపంచం మొత్తం నాదే.. అమ్ముతా కొంటావా? అని అనేస్తారు. తాజాగా అంతకు మించిన ఘటన వెలుగు చూసింది. దేశంలోనే ది బెస్ట్ పోలిసింగ్‌గా పేరొందిన తెలంగాణ ఖాకీ వనంలోనే.. ఓ నకిలీ ‘కాకి’ హల్‌చల్ చేసింది. ఏకంగా ఐపీఎస్ ఆఫీసర్‌నంటూ పెద్ద పెద్ద సెటిల్‌మెంట్లకు తెరదీశాడు. మరి అసలైన పోలీసులు ఊరుకుంటారా? తాట తీసేయరు! ఈ మాయగాడి విషయంలోనూ అదే జరిగింది. ఐపీఎస్ ఆఫీసర్ అంటూ రోజుకో వేషంలో తిరుగుతున్న ఆ కేటుగాడి బెండు తీశారు పోలీసులు.
అవును, నకిలీ ఐపీఎస్ ఆఫీసర్‌ను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. రామ్ ఐపీఎస్ పేరుతో చలామణి అవుతూ.. ఎంతోమందిని మోసం చేసినట్లు గుర్తించారు. బంజారాహిల్స్‌లో నివాసముంటున్న భీమవరం జిల్లాకు చెందిన కార్తీక్.. నకిలీ ఐపీఎస్ ఆఫీసర్‌గా మారాడు. తాను ఐపీఎస్ అధికారిని అని బిల్డప్ ఇచ్చుకుంటూ తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా మోసాలకు పాల్పడ్డాడు. ఉద్యోగాలు, కేంద్ర ప్రభుత్వంలో పదవులు, సెటిల్మెంట్ల పేర్లతో ఎంతోమంది అమాయక ప్రజలను వలలో వేసుకున్నాడు. అంతేకాదు.. సైబరాబాద్ పరిధిలో ఏకంగా కార్యాలయమే తెరిచాడు. బాధితులని కార్యాలయానికి పిలిపించి సెటిల్మెంట్ చేస్తున్నాడు. బాధితులకు ఇంటరాగేషన్ పేరుతో చుక్కలు చూపెట్టాడు. ప్రత్యేక పోలీస్ అధికారి పేరుతో వ్యవహారం నడుపుతున్న రామ్.. హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళను ట్రాప్ చేశాడు. ఆమెను ఝార్ఖండ్ తీసుకెళ్లాలని ప్లాన్ వేశాడు. ఇక జాగ్వార్ కార్లను అతి తక్కువ ధరకు ఇప్పిస్తానంటూ మోసానికి పాల్పడ్డాడు. అయితే, చివరకు బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో.. నకిలీ ఐపీఎస్ గట్టు బయటపడింది.
నకిలీ ఐపీఎస్ ఆఫీసర్‌గా, ఆర్మీ కల్నల్‌గా, ఫేక్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా అవతారమెత్తిన కార్తిక్‌పై దేశ వ్యాప్తంగా 8 కేసులు నమోదు అయ్యాయి. అతని వద్ద నుంచి ఓ కంట్రీమేడ్ పిస్టల్‌తో పాటు.. 23 వస్తువులు సీజ్ చేశారు. అలాగే, రూ. 2 లక్షలు విలువ చేసే ప్రాపర్టీ స్వాధీనం చేసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..