AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేరగాళ్లకు ఇక చుక్కలే.. సైబర్ మోసాలను అరికట్టేందుకు కేంద్రం కీలక నిర్ణయం!

సైబర్ మోసాలపై కేంద్రం ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా సైబర్ క్రైంపై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకు తెలంగాణ పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. సైబర్ నేరగాళ్ల సిమ్ కార్డులను తక్షణమే బ్లాక్ చేసేలా అన్ని రాష్ట్రాల్లోని జిల్లా ఎస్పీలకు వెసులుబాటు కల్పించాలని నిర్ణయించింది. అనుమానితుల లోకేషన్లు, బ్యాంకింగ్, టెలికాం వివరాలను తక్షణమే అన్ని పోలీస్ స్టేషన్లకు పంపేలా చర్యలు చేపట్టింది.

నేరగాళ్లకు ఇక చుక్కలే.. సైబర్ మోసాలను అరికట్టేందుకు కేంద్రం కీలక నిర్ణయం!
Cyber Crime Crackdown
Gopikrishna Meka
| Edited By: |

Updated on: Aug 11, 2025 | 9:51 PM

Share

సైబర్ నేరాలకు పాల్పడే నిందితుల సిమ్ కార్డులను తక్షణమే బ్లాక్ చేసే సదుపాయాలను జిల్లా ఎస్పీలకు కల్పించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. దీంతోపాటు నేర అనుమానితుల ఖచ్చితమైన లొకేషన్లను, బ్యాంకింగ్, టెలికాం సోర్స్ ల వివరాలను దేశంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు అందించేందుకు తగిన చర్యలు తీసుకోనుంది. దీంతోపాటు సైబర్ మోసాలు రోజురోజుకూ ఎక్కువైతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా సైబర్ నేరాలపై గ్రామ గ్రామాన ప్రజలకు విస్త్రత అవగాహన కల్పించాలని నిర్ణయించింది. అందులో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదేశాలతో తెలంగాణ రాష్ట్రాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయాలని ఆ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నిర్ణయించారు. అతి త్వరలోనే తెలంగాణలో ఒకరోజు ఈ అంశంపై సెమినార్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. సోమవారం న్యూఢిల్లీలోని తన కార్యాలయంలో బండి సంజయ్ కుమార్ హోంశాఖ ఉన్నతాధికారులతో I4C (ఇండియన్ సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్) ఆధ్వర్యంలో అమలులోకి తెచ్చిన సమన్వయ్ ప్లాట్‌ఫాం, సైబర్ కమాండో ప్రోగ్రామ్ పై సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా హోంశాఖ అధికారులు సమన్వయ ప్లాట్ ఫాం, సైబర్ కమాండో ప్రోగ్రామ్ అమలు తీరు, ప్రయోజనాలను వివరించారు. వివిధ రాష్ట్రాల పోలీసు విభాగాల మధ్య సమన్వయం కోసం ‘సమన్వయ్ ప్లాట్‌ఫాం’ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. సైబర్ నేర అనుమానితుల ఖచ్చితమైన లొకేషన్లతోపాటు వారు ఉపయోగించే బ్యాంకింగ్, టెలికాం వివరాలను దేశంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు వెంటనే పంపించేందుకు ‘ప్రతిబింబ్ మాడ్యూల్’ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ‘సైబర్ క్రైమ్ ఇంటర్‌స్టేట్ అసిస్టెన్స్ రిక్వెస్ట్ మాడ్యూల్’ ద్వారా ఒక పోలీస్ స్టేషన్ నుండి మరొక పోలీస్ స్టేషన్‌కు సైబర్ క్రైమ్ కేసుల్లో పరస్పర సహాయం అందించవచ్చనని వివరించారు. ఆయా నేరాలకు ఉపయోగించిన సిమ్ కార్డులను, వాడిన ఎలక్ట్రానిక్ పరికరాలను తక్షణమే బ్లాక్ చేసేలా ఎస్పీలకు సదుపాయం కల్పిస్తుందని వివరించారు. బ్యాంకింగ్ మాడ్యూల్ ద్వారా దర్యాప్తు అధికారులు బ్యాంక్ సీసీటీవీ వీడియోలు, బ్యాంక్ స్టేట్‌మెంట్లు వేగంగా కోరుకుని పొందవచ్చని తెలిపారు. క్లిష్టమైన కేసుల్లో దర్యాప్తు అధికారులకు సహాయం చేయడానికి, అలాగే విచారణలకు అవసరమైన టూల్స్ ను అందుబాటులో ఉంచడానికి ప్రత్యేకంగా టెక్నో-లీగల్ సపోర్ట్ సర్వీ స్ ను రూపొందించబడిందని తెలిపారు.

అత్యంత నైపుణ్యం కలిగిన పోలీసు అధికారుల కోర్ టీమ్‌ను తయారు చేయడమే సైబర్ కమాండో ప్రోగ్రాం లక్ష్యమని, ప్రధానమంత్రి నరేంద్రమోదీ దూరదృష్టితో రూపుదిద్దుకున్న కార్యక్రమమని తెలిపారు. IT ఇన్ఫ్రా-స్ట్రక్చర్ రక్షణకు, సైబర్ సంఘటనలకు స్పందనకై (Incident Response) డిజిటల్ ఫోరెన్సిక్స్‌లో వీరంతా నిష్ణాతులై ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. తొలి బ్యాచ్‌లో 407 మంది కమాండోలు NFSU, IITs, IIITs, DIAT, RRUలలో శిక్షణ పొంది ఇప్పటికే వారు వివిధ విభాగాల్లో సేవలందిస్తున్నారని వివరించారు. ఈ సంవత్సరం చివర్లో ఇంకో బ్యాచ్ శిక్షణ ప్రారంభించనున్నట్లు తెలిపారు.

ఐ4సీ (I4C) చేసిన కృషిని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రత్యేకంగా అభినందించారు. ప్రజలకు ఉపయోగపడటమే కేంద్రబిందువుగా ఐ4సీ సేవలు అందించాలని సూచించారు. అమిత్ షా నాయకత్వంలో సైబర్ మోసాలపట్ల స్థానిక భాషల్లో పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. అందులో భాగంగా తెలంగాణ పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశామని, అతి త్వరలోనే రాష్ట్రస్థాయి సెమినార్ నిర్వహిస్తున్నట్లు బండి సంజయ్ తెలిపారు. సైబర్ టెక్నాలజీపట్ల ఆసక్తి ఉన్న హోంగార్డు మొదలు ఎస్పీదాకా ఒక్కో జిల్లా నుండి 10 మంది చొప్పున 33 జిల్లాల నుండి ఎంపిక చేసి వారికి నిష్ణాతులతో సైబర్ మోసాలపై ఒక రోజంతా అవగాహన కల్పిస్తామని చెప్పారు. ఆ సెమినార్ అనంతరం శిక్షణ పొందిన పోలీసులు తమ తమ జిల్లాల్లో టీచర్లు, న్యాయవాదులు, ఇంజనీర్లు, డాక్టర్లు, జర్నలిస్టులు, ప్రొఫెసర్లుసహా సమాజాన్ని ప్రభావితం చేసే వారిని ఎంపిక చేసి ప్రత్యేకంగా సెమినార్లు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం వారంతా గ్రామ గ్రామానికి వెళ్లి సైబర్ మోసాలపై అవగాహన కల్పించేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందిస్తామన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us