రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో శాంతిభద్రతలు మెరుగయ్యాయి. గతేడాది తొలి ఆరు నెలలతో ( జనవరి 2023 నుంచి జూన్ 30 వరకు) పోల్చితే ఈ ఏడాది తొలి భాగంలో హత్యలు, హత్యాయత్నాలు, దాడులు తగ్గుముఖం పట్టాయి. రహదారి ప్రమాదాల సంఖ్య గణనీయంగా దిగి వచ్చింది. ఈ మేరకు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ విడుదల చేసిన లెక్కలే చెబుతున్నాయి. అధికారిక గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది.
హైదరాబాద్ మహా నగరంలో గతేడాది తొలి భాగంలో అంటే జనవరి 2023 నుంచి జూన్ 30 వరకు 47 హత్యలు జరిగితే, ఈ ఏడాది తొలి భాగంలో జనవరి 1 నుంచి జూన్ 30 వరకు 45 హత్యలు జరిగాయి. నాటితో పోల్చితే ఆరు నెలల కాలంలో హత్యలు 5 శాతం తగ్గాయి. హత్యాయత్నాల విషయంలో ఈ తేడా ఇంకా ఎక్కువగా ఉంది. గతేడాది తొలి భాగంలో నగరంలో 155 హత్యాయత్నం కేసులు నమోదైతే, ఈ ఏడాది తొలి భాగంలో అవి 145కు పరిమితమయ్యాయి. గతేడాది పోలిస్తే ఈ కేసులు 8 శాతం తక్కువగా నమోదయ్యాయి.
తీవ్రమైన దాడుల కేసుల సంఖ్య గతేడాది తొలి భాగంతో పోల్చితే ఈ ఏడాది తొలి భాగంలో 27 శాతం తగ్గుముఖం పట్టాయి. గతేడాది తొలి ఆరు నెలల కాలంలో తీవ్రమైన దాడుల కేసులు 151గా నమోదైతే, ఈ ఏడాది తొలి భాగంలో అవి కేవలం 103 మాత్రమే. ఈ ఏడాది తొలి ఆరు నెలల కాలంలోనే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నప్పటికీ దాడులను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖ సఫలమయ్యారు.
హైదరాబాద్ మహానగరంలో డ్రగ్స్‌ను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. గతేడాది తొలి ఆరు నెలల కాలంలో డ్రగ్స్‌కు సంబంధించి 103 కేసులు నమోదు చేస్తే, ఈ ఏడాది జనవరి 1 నుంచి జూన్ 30 వరకు ఆరు నెలల కాలంలో 151 కేసులు నమోదు చేశారు. కేసుల నమోదు, నిందితుల అరెస్టులో ప్రభుత్వం కఠినంగా ఉండడమే ఇందుకు కారణం.
ఈ ఏడాది తొలి ఆరు నెలల కాలంతో పోల్చితే గతేడాది తొలి ఆరు నెలల్లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకున్నాయి. గతేడాది తొలి భాగంలో 209 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటే, ఈ ఏడాది తొలి భాగంలో కేవలం 160 కేసులే నమోదయ్యాయి. మొత్తంగా చూస్తే రోడ్డు ప్రమాదాలు 24 శాతం తగ్గడంతో ప్రాణ నష్టం తగ్గుముఖం పట్టింది. గతంలో నేరాల్లో భాగస్వాములైన డ్రైవర్లను వదిలేయడానికి భిన్నంగా వారిపై కఠినంగా వ్యవహరించడం, వారిపై నిఘా ఉంచడంతోనే ప్రమాదాల సంఖ్య తగ్గుముఖం పట్టిందని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..