Telangana: కారులో షికారుకు సై అంటున్న కామ్రేడ్లు.. బీఆర్‌ఎస్‌తోనే పొత్తు !
తెలంగాణ పొలిటికల్ చౌరాస్తాలో నిలబడ్డ కామ్రేడ్లకు కన్ఫ్యూజన్ తొలగిపోయింది. కారులో షికారుకు సై అంటున్నారు కమ్యూనిస్టులు. ఇప్పటిదాకా అటో ఇటో ఎటోవైపు అన్నట్టున్న ఎర్రన్నలకు పొలిటికల్ పిక్చర్‌పై ఫుల్ క్లారిటీ వచ్చేసింది. చేతికి టాటా చెప్పి గులాబీతో కలిసి సాగుతాం అంటున్నాయి వామపక్షాలు.
థింక్ పింక్…థింక్ బీఆర్‌ఎస్ అంటున్నారు తెలంగాణ కామ్రేడ్లు. మునుగోడు ఉపఎన్నికలో బీఆర్‌ఎస్ అభ్యర్థికి మద్దతు ఇచ్చిన సీపీఐ, సీపీఎం…ఆ తర్వాత గులాబీ పార్టీతో పొత్తు మాట కోసం తెగ వెయిట్ చేశారు. అయితే ఎత్తిపొడుపు మాటలే తప్ప పొత్తుపొడుపు మాటలు వినిపించలేదు. పొత్తుల్లో భాగంగా బీఆర్‌ఎస్ తమకు సీట్లు కేటాయిస్తుందనే సీటు న్యూస్ కోసం కళ్లు కాయలు కాచేలా వేచి చూశారు కామ్రేడ్లు.
అయితే ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ మగ్దూం భవన్‌లో వామపక్షాల నేతలు భేటీ అయ్యారు. ఎన్నికలు, పొత్తులు, సీట్ల కేటాయింపులపై ప్రధానంగా చర్చించారు. పది రోజుల వ్యవధిలో వామపక్షాల నేతలు రెండోసారి భేటీ అయ్యారు. ఎన్నికల్లో సింగిల్‌గా వెళ్లాలా.. అధికార పార్టీతో వెళ్లాలా అన్న దానిపై సమాలోచనలు చేశారు. సమావేశం తర్వాత బీఆర్‌ఎస్‌తోనే కలిసి ప్రయాణం చేయాలని వామపక్షాలు నిర్ణయించాయి. కేసీఆర్‌తో మైత్రి కొనసాగుతుందని స్పష్టం చేశారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. కాంగ్రెస్‌తో ఎలాంటి పొత్తులు ఉండవంటూ క్లారిటీ ఇచ్చారు. దీంతోపాటు వామపక్ష పార్టీలు రెండు కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాయి. బీజేపిని ఓడించగలిగేది బీఆర్‌ఎస్సే అంటున్నాయి వామపక్షాలు.
సమయం వచ్చినప్పుడు బీఆర్‌ఎస్‌తో పొత్తులు, సీట్ల లెక్కలు తేలతాయంటున్నారు తమ్మినేని. బీఆర్‌ఎస్‌తో కలిసి ముందుకు సాగాలని కామ్రేడ్లు నిర్ణయించడంతో తెలంగాణలో పొలిటికల్ ఈక్వేషన్లు మారే సూచనలు కనిపిస్తున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..