Uttam Kumar Reddy: మాకు ప్రజలే పిల్లలు.. అలా జరిగితే రాజకీయ సన్యాసం తీసుకుంటా.. ఉత్తమ్‌ సంచలన వ్యాఖ్యలు..

కోదాడ, హుజూర్‌నగర్‌ ప్రజలే తన పిల్లలు అంటున్నారు ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. ఈ రెండు నియోజకవర్గాల్లో 50వేల మెజారిటీకి ఒక్క ఓటు తగ్గినా రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ హాట్‌ కామెంట్స్‌ చేశారు.

Uttam Kumar Reddy: మాకు ప్రజలే పిల్లలు.. అలా జరిగితే రాజకీయ సన్యాసం తీసుకుంటా.. ఉత్తమ్‌ సంచలన వ్యాఖ్యలు..
Uttam Kumar Reddy

Updated on: Jan 02, 2023 | 9:40 AM

తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, నల్గొండ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. తన 30ఏళ్ల రాజకీయ జీవితంలో ఎంతో నిస్వార్థంగా పనిచేశానని చెప్పుకొచ్చారు. విలువలు, విశ్వసనీయతతో రాజకీయాలు చేశానన్నారు. 1994 నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్నా ఇప్పటికీ తనకు సొంత ఇల్లు లేదన్నారు ఉత్తమ్‌. కోదాడ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాల అభివృద్ధికి ఎంతో కృషిచేశానని తెలిపారు. తనకు పిల్లలు లేరన్న ఉత్తమ్‌… కోదాడ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గ ప్రజలనే పిల్లలుగా భావిస్తున్నట్టు చెప్పారు. కోదాడ కొమరబండ వద్దనున్న మామిడి తోటలో కాంగ్రెస్‌ కార్యకర్తలతో ఉత్తమ్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో తన భార్య కోదాడ మాజీ ఎమ్మెల్యే పద్మావతితో కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కోదాడ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాల్లో అధికార పార్టీ అరాచకాలు పెరిగిపోయారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో కోదాడ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాల్లో 50వేల మెజారిటీకి ఒక్క ఓటు తగ్గినా రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఉత్తమ్‌ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

దేశంలోనే అత్యున్నతమైన ఉద్యోగాన్ని త్యాగం చేసి రాజకీయాల్లోకి వచ్చానని, పదవిలో ఉన్నా లేకున్నా ప్రజల అభివృద్ధి కోసం పాటుపడుతున్నానని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కోదాడ, హుజూర్ నగర్ లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందన్నారు. ప్రస్తుతం జిల్లాలో అధికారులు సరిగా ప్రవర్తించడం లేదని, పోయేకాలం వచ్చినప్పుడు ఇలాగే ప్రవర్తిస్తారంటూ మండిపడ్డారు.

ప్రజలు నిశ్శబ్దంగా గమనిస్తున్నారని, త్వరలో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటూ హెచ్చరించారు. కొందరు కావాలని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, ఐదుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా, టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశానని వివరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..