రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే ఓ నియోజకవర్గంలో వర్గపోరు మాత్రం పార్టీకి తలనొప్పిగా మారినట్లు కనిపిస్తోంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. పార్టీ సీనియర్ నేత జానారెడ్డి అనుచరుడు నల్లమోతు భాస్కర్ రావు 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొంది బీఆర్ఎస్లో చేరారు. దీంతో అప్పటి నుంచి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలహీన పడింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ నేత ఆర్. కృష్ణయ్యను బరిలో దింపినా కాంగ్రెస్ కు ఓటమి తప్పలేదు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా మిర్యాలగూడను చేజిక్కించుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ కు నియోజకవర్గంలోని అంతర్గత విభేదాలు కలవరపెడుతున్నాయి. మిర్యాలగూడ కాంగ్రెస్.. మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి, జానారెడ్డి అనుచరులు మరో వర్గంగా విడిపోయారు. ప్రస్తుతం పార్టీలో రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. రెండు గ్రూపుల మధ్య వర్గ పోరు ముదిరి పాకన పడుతోంది.
గతంలో పార్టీ పిలుపు ఇచ్చిన కార్యక్రమాల్లో వర్గ పోరు భగ్గుమంది. నేతల ముందే రెండు వర్గాలు విమర్శలు చేసుకున్నాయి. అక్కడితో ఆగకుండా పోలీస్ స్టేషన్ వరకు వెళ్లి పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి. మిర్యాలగూడ నియోజకవర్గంపై రాజకీయ దిగ్గజం కుందూరు జానారెడ్డికి సైతం గట్టిపట్టు ఉంది. వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే మిర్యాలగూడలో ఓ ఇంటిని తీసుకుని తన రాజకీయ కార్యకలాపాలను రఘువీర్ రెడ్డి కొనసాగిస్తున్నారు. అలాగే మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి… ఇద్దరు ఎంపీలు ఉత్తమ్, కోమటిరెడ్డిల మద్దతుతో టికెట్ ఆశిస్తున్నారు. మిర్యాలగూడలో బలహీనమైన కాంగ్రెస్ పార్టీ బత్తుల లక్ష్మారెడ్డి రాకతోనే బలపడిందని వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ బీఆరెస్ ఎమ్మెల్యే భాస్కర్ రావుకు లక్ష్మారెడ్డి సరైన అభ్యర్థి అని ఎంపీలు ఉత్తమ్, కోమటిరెడ్డిలు భావిస్తున్నారు. కానీ ఇక్కడ బలమైన అనుచరగణం ఉన్న జానారెడ్డి, బీఎల్ఆర్ కు చెక్ పెట్టె ప్రయత్నం చేస్తున్నారు. దీంతో టికెట్ కోసం బీఎల్ఆర్, సీనియర్ నేత జానారెడ్డి వ్యహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
తాజాగా బీఎల్ఆర్ ఆధ్వర్యంలో ప్రజా ప్రతినిధుల ఆత్మీయ ఐక్యవేదిక సభను నిర్వహించాడు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పని చేయాలంటూ పిలుపునిచ్చారు. ప్రజా ప్రతినిధుల ఆత్మీయ ఐక్యవేదిక సభ రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టింది. పార్టీ గెలుపు కోసమే ప్రజాప్రతినిధుల ఆత్మీయ ఐక్యవేదిక సభను నిర్వహించామని, ఎవరికి టికెట్ వచ్చిన అందరూ కలిసి పనిచేయాలని నిర్ణయించామని బిఎల్ఆర్ చెబుతున్నారు. పార్టీ అనుమతి లేకుండా ప్రజాప్రతినిధుల ఆత్మీయ ఐక్యవేదిక సభను ఎలా నిర్వహిస్తారని డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ ఖండించారు. మిర్యాలగూడ కాంగ్రెస్ వలసవాదులకు అడ్డాగా మారిందని, పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నందుకు క్రమశిక్షణ చర్యలు తప్పవని ఆయన బిఎల్ఆర్ ను ఉద్దేశించి హెచ్చరించారు. మిర్యాలగూడ కాంగ్రెస్ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదని, తామేనంటూ వ్యక్తిగత ఇమేజ్ పెంచుకోవడానికి ప్రత్యేక సభలు, సమావేశాలు నిర్వహిస్తే చర్యలు తప్పవని ఆయన అన్నారు.
వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని పీసీసీ ప్రధాన కార్యదర్శి కుందూరు రఘువీర్ రెడ్డి స్పష్టం చేశారు. ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని ఆయన చెప్పారు. పార్టీ విజయం కోసం అందరూ కలిసి పనిచేయాలని ఆయన అన్నారు. మిర్యాలగూడలో పోటీ చేసే అభ్యర్ధిని వివిధ సర్వేల ద్వారా పార్టీ ఎంపిక చేస్తుందని చెప్పారు. మిర్యాలగూడ కాంగ్రెస్ వలసవాదులకు అడ్డగా మారిందని డిసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో అలజడి రేపుతోంది. దీంతో నేతలు, పార్టీ విజయం శ్రేణులు.. లోకల్, నాన్ లోకల్ వర్గాలుగా విడిపోతున్నారట. ఆధిపత్యం కోసం గ్రూప్ రాజకీయాలు మొదలు కావడం కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఆందోళనకు గురిచేస్తుంది. మిర్యాల గూడలో ఏం జరగబోతోందో మరి.