
దేశ వ్యాప్తంగా బొగ్గుగనుల వేలానికి కేంద్ర ప్రభుత్వం రెడీ అయింది. శుక్రవారం హైదరాబాద్‌లో ని హోటల్ వెస్టిన్ లో బొగ్గు గనుల వేలం కార్యక్రమం ప్రారంభమైంది. ప్రభుత్వం తరుపున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు. తెలంగాణాలోని నాలుగు బొగ్గు గనులు వేలానికి సిద్దమవగా.. సింగరేణి ఈ వేలంలో పోటీపడాలా వద్దా అన్న డైలామా ఇంకా కొనసాగుతుంది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ ప్రభుత్వం తరుపున డిప్యూటీ సీఎం భట్టి నివేదిక ఇచ్చారు. అందులో తెలంగాణలోని కోల్ బ్లాక్‌లను సింగరేణికి నేరుగా కేటాయించాలని కోరారు.
కాగా వేలంలో మా గనులు మాకే కావాలని సింగరేణి డిమాండ్ చేస్తోంది. మంచిర్యాల జిల్లాలోని మందమర్రి ఏరియాకు చెందిన శ్రావణ్ పల్లి బ్లాక్ ను సైతం ఈరోజు వేలం వేయనున్నారు. ఈ బ్లాక్ ఎలాగైనా దక్కించుకోవాలని సింగరేణి యాజమాన్యం భావిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని చేజారనీయొద్దని, లేక పోతే ఉత్పత్తికి తీవ్ర ఇబ్బందులు కలుగుతాయని ఆందోళన వ్యక్తం
చేస్తోంది.
కేంద్ర ప్రభుత్వం మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ చట్టం తీసుకురావడంతో ఏ సంస్థ అయినా వేలం ద్వారానే కొత్త బొగ్గు గనులను దక్కించుకోవాలని నిర్ణయించింది. దీంతో బొగ్గు బ్లాక్ వేలంలో పాల్గొనేందుకు సింగరేణి సంస్థకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఎట్టి పరిస్థితుల్లో వేలంలో పాల్గొనబోమని కేంద్ర ప్రభుత్వం ఇక్కడి బ్లాక్లను సింగరేణికే కేటాయించాలని ప్రస్తుత సర్కార్ కూడా పట్టుబడుతోంది.
తాజాగా వేలానికి రెడీ అయిన శ్రావణపల్లి బొగ్గు గని లో 11.99 కోట్ల టన్నుల బొగ్గు గనుల నిల్వలు ఉన్నట్లు భూగర్భ సర్వేలో తేలింది. దీంతో ఈ గనిని కోల్పోతే భారీగా నష్టపోతామని సింగరేణి ఆందోళన చెందుతోంది. ప్రైవేట్ కంపెనీలతో పోటీ పడి శ్రావణ పల్లిని దక్కించుకోవడం అంతా ఈజీ కాదని బావిస్తోంది సింగరేణి. గతంలో ఎప్పుడూ వేలంలో పాల్గొనకపోవడంతో బిడ్డింగ్ లో వెనకపడితే మొదటికే మోసం వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. కేంద్ర గనుల శాఖ మంత్రిగాఉన్న కిషన్ రెడ్డి పై ఒత్తిడి తెచ్చి.. కేంద్రాన్ని ఒప్పించి తెలంగాణలో ఉన్న బొగ్గు గనులను వేలంతో సంబంధం లేకుండా డైరెక్టుగా తమకు కేటాయించాలని సింగరేణి డిమాండ్ చేస్తోంది. కాంగ్రెస్ సర్కార్ సైతం కేంద్రంతో తాడోపేడో తేల్చుకోవాలనిభావిస్తున్నా.. కేంద్రం వెనకకి తగ్గే పరిస్థితి లేకపోవడంతో సామరస్యం గా అయినా తెలంగాణా బొగ్గు గనులను సింగరేణికే ఇవ్వాలని కోరుతోంది. ఇప్పటికే సింగరేణి వేలానికి దూరంగా ఉండడం తో సత్తుపల్లి-3, కోయగూడెం బొగ్గు గను లను ప్రైవేటు బొగ్గు కంపెనీలు దక్కించుకోవడంతో శ్రావణపల్లి కూడా చేజారితే ఇక కష్టమే అన్న భావనలోఉంది సింగరేణి. చూడాలి నేటి వేలంలో సింగరేణికి అనుకూలంగా నిర్ణయం ఉంటుందా.. లేక ప్రైవేట్ తో పడి దక్కించుకుంటుందా.. లేక చేతులెత్తుస్తుందా చూడాలి.
తెలంగాణలో గనులు సింగరేణికి ఇవ్వాలి..డిప్యూటీ సీఎం
తెలంగాణలోని గనులను సింగరేణికి కేటాయించేలా చూడాలని డిప్యూటీ సీఎం భట్టి కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వినతిపత్రం ఇచ్చిన ఆయన.. తెలంగాణ బిడ్డగా కిషన్ రెడ్డి ఈ విషయంలో సింగరేణికి న్యాయం చేయాలన్నారు. చొరవ తీసుకొని ప్రధాని తో మాట్లాడి తెలంగాణలోని బొగ్గు గనులను సింగరేణికి అప్పగించేలా చూడాలన్నారు. మీరు అవకాశం ఇస్తే మేము రాష్ట్ర ప్రభుత్వం తరపున వచ్చి ప్రధాని మోడీని కలవడానికి సిద్దంగా ఉన్నామన్నారు. గతంలోనే సింగరేణికి కొత్త గనులు ఇవ్వాలని బొగ్గు శాఖను కోరామని గుర్తుచేశారు. గతంలో వేలంలో సత్తుపల్లి బ్లాక్-3 , కోయిగుడెం బ్లాక్ లను దక్కించుకున్న ప్రైవేటు కంపెనీలు ఉత్పత్తి ప్రారంభించలేదని గుర్తుచేశారు. వాటి లీజును రద్దు చేసి సింగరేణికి ఇవ్వాలని కోరుతున్నామన్నారు. అవసరం అయితే 0.5% అదనంగా చెల్లించి వాటిని తీసుకోవడానికి సిద్దంగా ఉన్నామన్నారు. సింగరేణి, ఉద్యోగులను కాపాడే దిశగా చట్టంలో మార్పులు చేయాలన్నారు.
-నరేష్ గొల్లన, ఉమ్మడి ఆదిలాబాద్