Telangana: కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య కరెంట్ వార్.. రేవంత్ వర్సెస్ హరీశ్

|

May 15, 2024 | 7:43 PM

తెలంగాణలో మళ్లీ కరెంట్ కోతల పంచాయితీ మొదలైంది. పవర్‌ కట్‌లకు హరీశ్ రావే కారణమని ఆరోపించారు సీఎం రేవంత్‌. ఈ కామెంట్లకు గులాబీ పార్టీ నుంచి గట్టిగానే కౌంటర్లు వచ్చాయి. ఆ డీటేల్స్ తెలుసుకుందాం పదండి...

Telangana: కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య కరెంట్ వార్.. రేవంత్ వర్సెస్ హరీశ్
Harish Rao Vs Revanth Reddy
Follow us on

తెలంగాణలో అధికార, విపక్షాల మధ్య కరెంట్ వార్ నడుస్తోంది. రాష్ట్రంలోని విద్యుత్ కోతలకు బీఆర్ఎస్సే కారణమని సీఎం రేవంత్ మండిపడ్డారు. విద్యుత్ శాఖలో కొందరు కావాలనే పవర్ కట్ చేస్తున్నారని… అందుకే కొన్నిచోట్ల కోతలు తలెత్తున్నాయన్నారు రేవంత్ రెడ్డి. మాజీమంత్రి హరీశ్‌రావు కొందరితో ఇలాంటి పనులు చేయిస్తున్నారని ఆరోపించారు.

ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ గట్టిగా కౌంటర్ ఇచ్చింది. రేవంత్‌ రెడ్డి తన అసమర్థతను, చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు విద్యుత్‌ సంస్థ ఉద్యోగులను నిందిస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్‌ సంస్థ ఉద్యోగుల కష్టం అద్భుతంగా ఉంది కాబట్టే అక్కడి నుంచి ఇక్కడిదాకా వచ్చామన్నారు. పదేళ్లు కేసీఆర్‌ ప్రభుత్వంలో కరెంటు కోతలు లేవన్న కేటీఆర్.. విద్యుత్ ఉద్యోగులను నిందిస్తూ సీఎం రేవంత్ చిల్లర రాజకీయాలకు పాల్పడతున్నారని విమర్శించారు.

మరోవైపు తెలంగాణ విద్యుత్ ఉద్యోగులపై సీఎం రేవంత్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఎక్స్‌ వేదికగా ఖండించారు మాజీమంత్రి హరీశ్ రావు. కరెంట్ కోతల విషయంలో సిఎం రేవంత్ తన ప్రభుత్వ వైఫల్యాలను అంగీకరించకుండా ప్రతిపక్షాలు, విద్యుత్ ఉద్యోగుల మీద అభాండాలు మోపడాన్ని ఖండించారు. విద్యుత్ రంగ వైఫల్యాలకు తానే బాధ్యుడిని అన్నట్టుగా మాట్లాడటం విడ్డూరంగా ఉందని.. రేవంత్ వైఖరి ఆడ రాక పాత గజ్జెలు అనే సామెతను గుర్తు చేస్తోందన్నారు.

కరెంట్ కోతలకు బీఆర్‌ఎస్సే కారణమని సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చేయడం.. దానికి గులాబీ పార్టీ నుంచి కూడా అదే స్థాయిలో రియాక్షన్ రావడంతో.. ఈ అంశంపై రాబోయే రోజుల్లో మరింత రచ్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…