CM Revanth Reddy: మరోసారి ఢిల్లీ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి.. కేబినెట్ విస్తరణపై జోరుగా చర్చ!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. అక్టోబర్ 17న ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం రేవంత్. కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యాలయంలో జరిగే పార్టీ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో పాల్గొంటారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. అక్టోబర్ 17న ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం రేవంత్. ఇటీవలె కొత్తగా పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన మహేష్ కుమార్ గౌడ్‌తో కలిసి హస్తిన వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యాలయంలో జరిగే పార్టీ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో పాల్గొంటారు.
సీఎం ఢిల్లీ వెళ్లినప్పుడల్లా కేబినెట్ విస్తరణతో పాటు నామినేటెడ్ పదవులపై రాష్ట్ర నేతల్లో ఆశలు రేగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మరోసారి రేవంత్ ఢిల్లీ బాట పట్టడంతో మళ్లీ కేబినెట్ విస్తరణపై జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ సారి పర్యటనతో కేబినెట్ విస్తరణపై క్లారిటీ రాబోతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అయితే, దసరా కల్లా తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరగవచ్చనే ప్రచారం జోరుగా సాగింది. కానీ అనూహ్యంగా వాయిదా పడింది. ఇప్పటికే హర్యానా, జమ్మూకశ్మీర్ ఎన్నికలు పూర్తవడంతో తెలంగాణ కేబినెట్ విస్తరణపై కాంగ్రెస్ అధిష్ఠానం ఫోకస్ పెట్టినట్టు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇదే అంశంపై మాట్లాడేందుకు పార్టీ పెద్దలు రేవంత్‌ను ఢిల్లీ పిలిపించుకున్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటనతో విస్తరణపై క్లారిటీ వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. బుధవారం సాయంత్రమే సీఎం రేవంత్ ఢిల్లీకి ప్రయాణం కానున్నట్లు తెలుస్తోంది.
ఇదిలావుంటే, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షతన సీడబ్ల్యూసీ సమావేశం జరగనుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలు జరిగిన జమ్మూ కాశ్మీర్, హర్యానాలతోపాటు త్వరలో జరగనున్న మహారాష్ట్ర ఎన్నికలపై చర్చించనున్నారు. హర్యానా ఓటమితోపాటు, కాశ్మీర్ ఎన్నికల ఫలితాలపై ప్రధాన చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..