Revanth Reddy: రిపబ్లిక్‌డే సందర్భంగా అదిరిపోయే న్యూస్.. తెలంగాణలో నాలుగు పథకాలకు శ్రీకారం..
తెలంగాణలో నేడు పథకాల జాతర మొదలుకానుంది. రాష్ట్రంలో గేమ్ ఛేంజర్‌గా భావిస్తోన్న నాలుగు పథకాలకు నారాయణపేట జిల్లాలో శ్రీకారం చుట్టనున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పటికే అన్నిజిల్లాలో ఏర్పాట్లను పూర్తిచేశారు అధికారులు. నేటినుంచి రాష్ట్రంలో కొత్త అధ్యాయం మొదలవుతుందని మంత్రులు పేర్కొంటున్నారు.

తెలంగాణలో ఇప్పటికే మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు, గృహలక్ష్మి, 500రూపాయలకు గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేస్తోన్న కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా మరో నాలుగు పథకాలకు శ్రీకారం చుట్టింది. వీటిలో మొదటిది కొత్త రేషన్ కార్డుల పథకం. తెలంగాణ ప్రజలు పదేళ్లుగా ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డులకు మోక్షం లభించింది. పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో కొత్త రేషన్ కార్డులను జారీ చేయనున్నారు.
రెండో పథకం రైతు భరోసా. సాగుకు అనుకూలమైన భూములకు ఒక్కో ఎకరానికి 12 వేల రూపాయలు అందిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. సాగుకు యోగ్యంకాని భూములకు రైతుభరోసా వర్తించదు. అర్హులైన రైతుల ఖాతాల్లో ప్రభుత్వం డబ్బు జమచేయనుంది.
మూడో పథకం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. రాష్ట్రంలో భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి రెండు విడతల్లో 12 వేల రూపాయల ఆర్థికసాయాన్ని ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద అందించనుంది రేవంత్ ప్రభుత్వం. ఒక్క గుంట కూడా భూమి లేని నిరుపేదలకు ఈ పథకాన్ని వర్తింపజేస్తోంది.
ఇక నాలుగో పథకం ఇందిరమ్మ ఇల్లు. ఇంటి స్థలం ఉన్నవారు ఇల్లు కట్టుకోవడానికి.. ఇంటి స్థలం లేనిపేదలకు ఇల్లు అందించేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చిన తెలంగాణ సర్కార్. రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం మొత్తం 80 లక్షల 54 వేల దరఖాస్తులు వచ్చాయి.
ఈ నాలుగు పథకాలను తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లోని చంద్రవంచ గ్రామంలో లాంఛనంగా ప్రారంభిస్తారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే పథకాల అమలు కోసం ఒక్కో పథకానికి ఒక్కో అధికారి చొప్పున నియమించింది ప్రభుత్వం. గ్రామానికి నలుగురు మండల స్థాయి అధికారులను అపాయింట్ చేసింది.
పథకాల అమలు నిరంతర ప్రక్రియ అని తెలిపింది ప్రభుత్వం. మార్చి 31లోగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లోని లబ్ధిదారులకు పథకాలు వర్తించేలా ప్రణాళికలు రూపొందించామంది. అసలైన లబ్దిదారులకు అన్యాయం జరగొద్దని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. అనర్హులకు పథకాలు వర్తింపజేస్తే ఆయా అధికారులపై చర్యలు తప్పవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
