CM Revanth Reddy : డేటా సెంటర్లకు భూ కేటాయింపుల విషయంలో అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!
రాష్ట్రంలో డాటా సెంటర్ల ఏర్పాటుకు ముందుకు వచ్చిన సంస్థలు.. వారికి అవసరమైన భూమి, ఇతర వసతులపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. డాటా సెంటర్లకు వివిధ రాష్ట్రాలు ఇస్తున్న రాయితీలపై అధ్యయనం చేయాలని అధికారులకు ఆదేశించారు. అలాగే డేటా సెంటర్లకు కావాల్సిన భూ కేటాయింపులు, భూ పరిహారం నిర్ణయంలో ఉదారంగా వ్యవహరించాలని సూచించారు.

రాష్ట్రంలో డాటా సెంటర్ల ఏర్పాటుకు ముందుకు వచ్చిన సంస్థలు.. వారికి అవసరమైన భూమి, ఇతర వసతులపై రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. డాటా సెంటర్లకు వివిధ రాష్ట్రాలు ఇస్తున్న రాయితీలపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. డాటా సెంటర్లకు భూ కేటాయింపులో హేతుబద్ధత ఉండాలని సీఎం సూచించారు. వివిధ ప్రాంతాల్లో డాటా సెంటర్లు, ఇతర మౌలిక వసతుల కల్పనకు సాగుతున్న భూ సేకరణపైనా అధికారులను సీఎం ఆరా తీశారు.
భూ పరిహారం నిర్ణయం విషయంలో ఉదారంగా ఉండాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. రైతులను పిలిచి మాట్లాడి వారు సంతృప్తి చెందేలా పరిహారం నిర్ణయించాలన్నారు. రూ.వేల కోట్లతో పెట్టుబడులు పెట్టే సంస్థలు భూమిపై పెట్టె పెట్టుబడి చాలా స్వల్పమన్నారు. కంపెనీలకు సకాలంలో భూమి, ఇతర వసతులు అందుబాటులో ఉంచితే త్వరగా పనులు పూర్తి చేసుకుంటారని సీఎం అభిప్రాయపడ్డారు.
బయో ఏషియా సదస్సు-2026
ఇదిలా ఉండగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బయో ఏషియా సదస్సు-2026 జరుగుతున్న సందర్భంగా పలు కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో లైఫ్ సైన్సెస్ రంగాల్లో పెట్టుబడులు, కంపెనీలు పెట్టాలని యోచించే గ్లోబల్ ఇన్వెస్టర్లకు అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం అన్నారు. హైదరాబాద్ మహానగరంలో ఇప్పటికే ఎన్నో లైఫ్ సైన్సెస్ కంపెనీలు హైదరాబాద్‌లో జీసీసీ(గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్)లను ఏర్పాటు చేశాయని గుర్తు చేశారు.
ఇదే విషయమై మరింత లోతుగా దృష్టి సారించడానికి, గ్లోబల్ లైఫ్ సైన్సెస్ కంపెనీలకు ఇన్నోవేషన్ సెంటర్‌లను సులభతరం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఫ్యూచర్ సిటీలో జిసిసిల కోసం ఒక ప్రత్యేక జోన్‌ను నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు.
ప్రకటించిన పెట్టుబడుల వివరాలు:
ఫ్రాన్స్‌లో తన ప్రపంచ ప్రధాన కార్యాలయంతో సనోఫీ నుండి విడిపోయిన గ్లోబల్ కన్స్యూమర్ హెల్త్‌కేర్ కంపెనీ అయిన ఒపెల్లా హెల్త్‌కేర్, దాని జిసిసి కార్యకలాపాలను 42,000 చదరపు అడుగుల సౌకర్యంతో విస్తరిస్తోంది. వచ్చే ఏడాదిలోపు 500 ఉద్యోగాలను ఈ కంపెనీలను సృష్టించనుంది.
జీఏపీఎఫ్ఏ ఇండోనేషియా విభాగమైన వాక్సిండో యానిమల్ హెల్త్ ప్రైవేట్ లిమిటెడ్, జీనోమ్ వ్యాలీలో అత్యాధునిక బీఎస్ఎల్-3 వ్యాక్సిన్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈ కేంద్రం కోళ్లు, పశువులు, స్వైన్. ఆక్వాకల్చర్ కోసం వ్యాక్సిన్‌లను ఉత్పత్తి చేయడంపై దృష్టి పెడుతుంది.
ఏఐ, డేటా సైన్స్ కంపెనీగా పేరొందిన ట్రెడెన్స్ ఐఎన్సీ, ఏఐ-ఆధారిత హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్ పై కీలక సేవలు అందించిన సంస్థ, హైదరాబాద్‌లో తన కార్యకలాపాలను నిర్వహించనున్నట్టు ప్రకటించింది. ఈ కేంద్రం సుమారు 18,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండగా, దీనిలో ప్రపంచ స్థాయి కార్యకలాపాలను నిర్వహించ తలపెడుతున్నట్టు పేర్కొంది. దీంతో ఏఐ ఆధారిత హెల్త్ కేర్ రంగంలో మరింత అత్యాధునికత రానుంది.
భారతదేశ లైఫ్ సైన్సెస్ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఆర్ఎక్స్ ప్రొపెల్లెంట్ హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో భారీ స్థాయిలో ఫార్మాట్ లైఫ్ సైన్సెస్ క్యాంపస్‌ను అభివృద్ధి చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ దాదాపు 12 ఎకరాల స్థలంలో విస్తరించి ఉన్న 1 మిలియన్ చదరపు అడుగుల అడ్వాస్డ్ ల్యాబ్, మౌలిక సదుపాయాలను కలిగి ఉంటుంది. ఇది రాబోయే ఆరు సంవత్సరాలలో మరింత విస్తృతం కానునుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
