AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TGSRTC: చేవెళ్ల దుర్ఘటనపై TGSRTC తీవ్ర దిగ్భ్రాంతి.. ప్రమాదానికి గల కారణాల వివరణ!

సోమవారం చేవెళ్ల సమీపంలోని ఇందిరా రెడ్డి నగర్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై టి.జి.సి.ఆర్.టి.సి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఈ సంఘటన దురదృష్టకరమైనదిగా భావిస్తూ, ప్రాణాలు కోల్పోయిన 19 మందికి తమ సంతాపం తెలియజేస్తూ, క్షతగాత్రులైన ప్రయాణికులు త్వరగా కోలుకోవాలని వారి కుటుంబ సభ్యలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది.  

TGSRTC: చేవెళ్ల దుర్ఘటనపై TGSRTC తీవ్ర దిగ్భ్రాంతి.. ప్రమాదానికి గల కారణాల వివరణ!
Chevella Bus Accident
Anand T
|

Updated on: Nov 03, 2025 | 7:17 PM

Share

తెల్లవారుజామున 4.40 ని.లకు తాండూరు నుంచి బయలుదేరిన ప్రైవేట్ హైర్ (పి.హెచ్.బి) ఎక్స్ప్రెస్ బస్సు (TS 34TA 6354) ఇందిరానగర్ సమీపంలో కంకర లోడ్తో ఎదురుగా వచ్చిన టిప్పర్ (TG06T 3879) బస్సు ముందుభాగాన్ని బలంగా ఢీ కొట్టింది. టిప్పర్ అతి వేగంగా ఢీ కొట్టడంతో బస్సు ముందు భాగంతో పాటు ఎడమవైపు భాగం పూర్తిగా ధ్వంసమైంది.  ఢీ కొట్టిన టిప్పర్, బస్సు వైపు ఒరిగి పోయి అందులోని కంకర ప్రయాణికులపై పడటంతో ఊపిరాడక ఎక్కువ మంది ప్రయాణికులతో పాటు బస్సు డ్రైవర్ దస్తగిరి చనిపోయారు.

ఈ దుర్ఘటనలో క్షతగాత్రులైన వారిని హుటాహుటిన అక్కడి సమీపంలో చేవెళ్లలోని పట్నం మహేందర్ రెడ్డి ఆసుపత్రికి, వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఘటన జరిగిన వెంటనే టి.జి.ఎస్.ఆర్టీసీ యాజమాన్యం స్పందించి, సమీపంలోని డిపో మేనేజర్లను అప్రమత్తం చేయడం జరిగింది. ఆ పిమ్మట తాండూరు, వికారాబాద్, పరిగి డిపో మేనేజర్లు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఆ వెంటనే సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వై.నాగిరెడ్డి, హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఖుష్రో షా ఖాన్, ఇంచార్జీ ఇ.డి (ఆపరేషన్స్) శ్రీధర్, రంగారెడ్డి రీజినల్ మేనేజర్ శ్రీలత, తదితర సీనియర్ అధికారులు అక్కడికి విచ్చేసి సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు.

గాయపడిన 25 మందికి మెరుగైన చికిత్స అందించాలని అధికార బృందం, అక్కడి డాక్టర్లను కోరారు. చనిపోయిన 19 మందిలో 5గురు మహిళలు, 14 మంది పురుషుల మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి వారి సంబంధీకులకు అప్పగించారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ , ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, స్థానిక పరిగి, చేవేళ్ల, వికారాబాద్ ఎమ్మేల్యేలు, పోలిస్ ఉన్నాతాధికారులు, వికారాబాద్ జిల్లా కలెక్టర్, రెవెన్యూ, ఎమర్జేన్సీ సర్వీసెస్ శాఖలకు సంబంధించిన అధికారులు, సిబ్బంది తక్షణ సహాయక చర్యలలో పాల్గొన్నారు.

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మృతి చెందిన వారికి ఒక్కొక్కరికి ప్రభుత్వం తరుఫున రూ.5లక్షలు, టి.జి.ఎస్.ఆర్టీసీ నుంచి రూ.2లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అలాగే, గాయపడిన వారికి రూ.2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రభుత్వం ప్రకటించింది. ఇది కాకుండా వాహనం ఇన్సురెన్స్ పాలసీ ద్వారా బాధితులకు తగిన మొత్తంలో పరిహారం చెల్లించడం జరుగుతుంది.

ఈ ఘటనకు సంబంధించిన ప్రాథమిక విచారణ అనుసారం ప్రమాదానికి ఆర్టీసీ బస్సు గాని, బస్సు డ్రైవర్గాని కారణం కాదని తెలుస్తోంది. బస్సు పూర్తి ఫిట్నెస్తో ఉన్నట్లు, డ్రైవర్ సర్వీసు రికార్డు ప్రకారం ఎలాంటి యాక్సిడెంట్ రికార్డు లేనట్టు తేలింది. రోడ్డు మలుపు వద్ద అతి వేగంతో ఉన్న టిప్పర్ డ్రైవర్ నియంత్రణ కోల్పొవడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ దురదృష్టకర సంఘటనలో చనిపోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని టి.జి.ఎస్. ఆర్టీసీ ఆకాంక్షిస్తోందని ఆర్టీసీ యాజమనాన్యం చెప్పుకొచ్చింది.