
నకిలీ జామిను పత్రాలకు అడ్డాగా మారింది మెదక్ జిల్లా చెన్నపూర్ గ్రామం. కొద్ది సంవత్సరాలుగా జరుగుతున్న బాగోతం తాజాగా బయట పడింది. గ్రామంలోని పేదలను లక్ష్యంగా చేసుకొని ఓ వ్యక్తి నకిలీ జామిన్‌లను కోర్టులకు పంపిస్తున్నాడు. మాములు నేరాలు చేసిన వారికి కాకుండా ఏకంగా డ్రగ్స్, గంజాయి, హత్య కేసుల్లో నిందితులకు నకిలీ జామీన్లు అందిస్తున్నారు. కొంతమంది అంతరాష్ట్ర నేరస్తులకు కూడా ఇదే గ్రామం నుంచి జామిన్లు అందినట్లు సమాచారం. గ్రామంలో సర్పంచ్, అధికారుల ద్వారా సంచలన విషయాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. గ్రామానికి చెందిన సతీష్ యాదవ్ దీనికి కీలక సూత్రధారిగా అధికారులు గుర్తించారు.
చెన్నపూర్ గ్రామ పంచాయితీ పేరిట దొంగ ముద్రలు, ఇంటి పన్ను రశీదులు, సెక్రటరీ సంతకాలు సృష్టించాడు సతీష్. కొద్దిరోజులుగా ఇది జరుగుతున్నా ఓ కేస్ విషయంలో ష్యురిటీ కోసం ఈ నెల 19న బాలానగర్ కోర్టుకు వెళ్లారు విఠల్, నర్సింహులు. వీరిద్దరి పత్రాలపై అనుమానం వ్యక్తం చేసిన జడ్జి విచారణకు ఆదేశించారు.
వీరు తెచ్చిన కాగితాలు, రశీదులు వాటిపై ఉన్న గ్రామ పంచాయతీ స్టాంప్‌లు డమ్మీవని గుర్తించారు. కోర్టు, పోస్ట్ ఆఫీస్ ఆధ్వర్యంలో విచారణ జరిపి అసలు విషయం బట్ట బయలు చేశారు. ఈ విషయాన్ని గ్రామ పెద్దల ముందు సతీష్ ఒప్పుకున్నాడు. దీనిపై పోలీసులకు పిర్యాదు చేసినా సతీష్ యాదవ్ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్థులు చెప్తున్నారు.
సతీష్ కేవలం హైదరాబాద్ కోర్టులోనే కాదు.. ముంబై కోర్టులకు కూడా జామిన్‌లను పంపేవారని గ్రామస్తులు చర్చించకుంటున్నారు. డ్రగ్స్, గంజాయి స్మగ్లింగ్, హత్యలు చేసిన వారికి నకిలీ జామిన్ పెట్టి వారిని బయటకు తెచ్చినట్లు సమాచారం. దీనిపై ఏడాది క్రితం ముంబై పోలీసులతో పాటు, 2నెలల క్రితం NIA అధికారులు గ్రామానికి వచ్చి విచారణ జరిపినట్లు తెలుస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం