
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేపథ్యంలో తెలంగాణలో రాబోయే మూడు రోజుల వాతావరణం పరిస్థితులను హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. బుధవారం, గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలోని ఎలాంటి వర్షాలు కురిసే అవకాశం లేదని.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలో పొడి వాతావరణం ఉండనున్నట్టు పేర్కొంది. అయితే నిన్న మలక్కా స్ట్రైట్, దాని సమీపంలోని దక్షిణ అండమాన్ సముద్రం ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్న తీవ్ర వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశలో కదిలి మరింత బలపడి బుధవారం ఉదయం 05:30 గంటలకు స్ట్రైట్ ఆఫ్ మలక్కా, దాని సమీపంలోని ఈశాన్య ఇండోనేషియా ప్రాంతంలో తుఫాన్‌గా మారింది. ఈ తుఫానుకు “సనియార్” అనే పేరు పెట్టినట్టు వాతావరణ శాఖ పేర్కొంది.
అయితే వాయువ్య దిశలో కదుతూ ఈ తుఫాను బుధవారం ఉదయం 07:30 నుండి 08:30 గంటల మధ్యలో ఇండోనేషియా తీరాన్ని దాటింది. అలాగే రాగల 24 గంటల్లో ఈ తుఫాను పశ్చిమ వాయువ్య దిశలో కదిలి ఆ తర్వాత మలుపు తిరిగి తూర్పు దిక్కులో కదులుతూ బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అయితే తెలంగాణ రాష్ట్రంపై మాత్రం ఈ ప్రభావం లేదని వాతావరణ శాఖ తెలిపింది.
ఇదిలా ఉండగా ఆగ్నేయ బంగాళాఖాతంలోని శ్రీలంక తీరం సమీపంలో కొనసాగుతున్న అల్పపీడనం బుధవారం తీవ్ర అల్పపీడనంగా మారింది. రాగల 24 గంటలలో ఈ తీవ్ర అల్పపీడనం ఉత్తర వాయువ్య దిశలో కదిలి వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. ఆ తర్వాత ఈ వాయుగుండం మరింత బలపడి ఉత్తర వాయువ్య దిశలో కదులుతూ నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి తీర ప్రాంతానికి రాగల 48 గంటల్లో చేరుకునే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తమిళనాడు రాష్ట్రంలోని పలు జిల్లాలో వర్షాలు కురువనున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.