AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శతాబ్ధాల చరిత్ర గల చార్మినార్‌కు ఏమైంది..? వర్షం తర్వాత కనిపించిన దృశ్యం!

హైదరాబాద్‌లోని చారిత్రక చార్మినార్‌కు వర్షం కారణంగా స్వల్ప నష్టం వాటిల్లింది. లాడ్‌బజార్‌ వైపు ఉన్న భాగం నుంచి కొంత పూత ఊడిపడింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (ASI) అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, నష్టం పరిధిని, కారణాన్ని నిర్ధారించే పనిలో ఉన్నారు. 1591లో నిర్మించిన ఈ ఐకానిక్ కట్టడం పరిరక్షణపై చర్చ జరుగుతోంది.

శతాబ్ధాల చరిత్ర గల చార్మినార్‌కు ఏమైంది..? వర్షం తర్వాత కనిపించిన దృశ్యం!
Charminar HyderabadImage Credit source: AI Image
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Sep 23, 2026 | 11:57 AM

Share

హైదరాబాద్‌ పాతబస్తీలోని చారిత్రక చార్మినార్‌కు స్వల్ప నష్టం వాటిల్లింది. సుమారు 30 నిమిషాల పాటు కురిసిన వర్షం అనంతరం.. లాడ్‌బజార్‌ వైపు ఉన్న చార్మినార్‌ భాగంలోని పూతకు సంబంధించిన కొంత భాగం ఊడిపడి కింద పడింది. దీంతో అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు.

ప్రత్యక్ష సాక్షులు, అధికారుల వివరాల ప్రకారం.. వర్షం తర్వాత చార్మినార్‌లోని లాడ్‌బజార్‌ వైపు ఉన్న భాగం నుంచి తీగ డిజైన్‌ను పోలిన కొంత నిర్మాణ భాగం ఒక్కసారిగా కిందపడింది. దీంతో అక్కడున్నవారు ఆందోళనకు గురయ్యారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

సమాచారం అందుకున్న చార్మినార్‌ భద్రతా సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. కిందపడిన నిర్మాణ భాగాన్ని సేకరించి భద్రపరిచారు. అనంతరం ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. చార్మినార్‌ నిర్మాణానికి ఎలాంటి నష్టం జరిగిందనే అంశంపై వివరాలు సేకరిస్తున్నారు. అయితే ఈ భాగం కేవలం వర్షం ప్రభావంతోనే ఊడిపోయిందా? లేక ఇప్పటికే పూత లేదా డిజైన్‌ బలహీనపడటంతో కిందపడిందా? అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం వర్షం కారణంగానే నష్టం జరిగిందని నిర్ధారించలేమని అధికారులు భావిస్తున్నారు.

ఈ ఘటనపై ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (ASI) అధికారులు రంగంలోకి దిగారు. చార్మినార్ పరిసరాలను పరిశీలిస్తున్నారు. ఊడిపోయిన భాగంతో పాటు చార్మినార్‌ పరిసరాలను పరిశీలించి.. నిర్మాణానికి ఎలాంటి నష్టం జరిగిందా, లేక కేవలం పైపూతకు సంబంధించిన భాగమే ఊడిపోయిందా అనే విషయాలను అధికారులు నిర్ధారించనున్నారు. ASI పరిశీలన, నివేదిక తర్వాతే అసలు నష్టం, కారణంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

1591లో కుతుబ్‌షాహీ పాలకుడు మహమ్మద్‌ కులీ కుతుబ్‌ షా నిర్మించిన చార్మినార్‌ హైదరాబాద్‌ చారిత్రక గుర్తింపులో కీలకమైన కట్టడం. నాలుగు మినార్లతో ప్రత్యేక నిర్మాణ శైలిలో ఉన్న ఈ కట్టడం శతాబ్దాలుగా అనేక వాతావరణ పరిస్థితులను తట్టుకుని నిలిచింది. ఇప్పుడు వర్షం తర్వాత ఓ భాగం ఊడిపడటంతో నిర్మాణ పరిరక్షణపై చర్చ మొదలైంది. ASI అధికారుల పరిశీలనతో చార్మినార్‌కు జరిగిన నష్టం ఎంత? దానికి అసలు కారణం ఏమిటి? అన్నదానిపై స్పష్టత రానుంది.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us