Huzurabad By Election: ఒక్క ఉపఎన్నిక.. 2 లక్షలకుపైగా ఓటర్లు.. 20 కంపెనీల కేంద్ర బలగాలు.. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి..

తెలంగాణ అంతా ఇప్పుడు హుజురాబాద్ వైపు చూస్తోంది. అక్కడ ఎవరు గెలుస్తారో అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఉపఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలు గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి...

Huzurabad By Election: ఒక్క ఉపఎన్నిక.. 2 లక్షలకుపైగా ఓటర్లు.. 20 కంపెనీల కేంద్ర బలగాలు.. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి..
Crpf

Updated on: Oct 23, 2021 | 3:17 PM

తెలంగాణ అంతా ఇప్పుడు హుజురాబాద్ వైపు చూస్తోంది. అక్కడ ఎవరు గెలుస్తారో అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఉపఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలు గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన నుంచి అక్కడే ఉండి ప్రచారం చేస్తున్నారు. ఇటు టీఆర్ఎస్ పార్టీ కూడా ప్రచారంలో దూసుకెళ్తోంది. ఆ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ గెలుపు కోసం ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ కూడా ప్రచార జోరును పెంచారు. అయితే పోటీ ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఉండే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గెలుపు కోసం ఎవరికి వారు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ ఉపఎన్నికకు భారీ ఎత్తున భద్రత బలగాలు పనిచేయనున్నాయి.

హుజూరాబాద్‌ ఉపఎన్నిక కోసం 20 కంపెనీల కేంద్ర బలగాలు వస్తున్నాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్‌ గోయల్‌ చెప్పారు. ఇప్పటికే మూడు బలగాలు హుజురాబాద్‌ నియోజకవర్గానికి చేరుకున్నాయని వెల్లడించారు. ఒకట్రెండు రోజుల్లో మిగతా బలగాలన్నీ చేరుకుంటాయని పేర్కొన్నారు. హుజరాబాద్‌లో ఇప్పటివరకు రూ.1.80 కోట్ల నగదు, రూ.6.11 లక్షల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నట్టు ఆయన తెలిపారు. హుజురాబాద్ ఉపఎన్నికకు మరో వ్యయ పరిశీలకుడిని ఈసీ నియమించిందని ఆయన చెప్పారు. నియోజకవర్గంలో 97.6 శాతం ఓటర్లు ఇప్పటివరకు మొదటి డోస్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్నారని, 59.9 శాతం ఓటర్లు రెండో డోస్‌ తీసుకున్నారని వెల్లడించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి దాదాపు వంద శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి అయిందని శశాంక్ గోయల్ వెల్లడించారు.

హుజూరాబాద్‌ నియోజకవర్గంలో రెండు లక్షలకు పైగా ఓటర్లున్నారు. అంటే ఇక్కడ ప్రతి 83 మందికి ఒక సీఆర్పీఎఫ్‌ జవాన్‌ను భద్రత కల్పించనున్నారు. ఒక ఉప ఎన్నిక కోసం 20 కంపెనీల కేంద్ర బలగాలు రావడం రాష్ట్ర చరిత్రలో మొట్ట మొదటిసారి అని రాజకీయా విశ్లేషకులు చెబుతున్నారు. కాగా అక్టోబర్ 30న హుజురాబాద్ ఉపఎన్నిక పోలింగ్ జరగనుంది. నవంబర్ 2న ఫలితాలు రానున్నాయి. అక్టోబర్ 2న ఎన్నిక జరగనున్న ప్రాంతాల్లో ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

Read Also.. Huzurabad By Election: రేవంత్‌రెడ్డిని కలిసింది వాస్తవమే.. కానీ ఇప్పుడు కలవలేదు.. ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు..