కారు రిపేర్ కోసం కక్కుర్తి.. ఈజీ మనీ కోసం దారితప్పిన డ్రైవర్.. చివరకు కటకటాల్లోకి..!
నేటి కాలంలో కొందరు యువత విలాసాలకు అలవాటు పడి, కష్టపడకుండా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో నేరాల బాట పడుతున్నారు. మరికొందరు తమ అవసరాల కోసం అడ్డదారులు తొక్కి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా మిర్యాలగూడలో చోటుచేసుకున్న ఓ ఘటన ఇందుకు నిదర్శనంగా నిలిచింది.

నేటి కాలంలో కొందరు యువత విలాసాలకు అలవాటు పడి, కష్టపడకుండా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో నేరాల బాట పడుతున్నారు. మరికొందరు తమ అవసరాల కోసం అడ్డదారులు తొక్కి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా మిర్యాలగూడలో చోటుచేసుకున్న ఓ ఘటన ఇందుకు నిదర్శనంగా నిలిచింది.
సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం రేవూరు గ్రామానికి చెందిన జాజం గోపీచంద్ ఉపాధి కోసం మూడేళ్ల క్రితం మిర్యాలగూడకు వచ్చాడు. అక్కడ ఒక వాటర్ ప్లాంట్‌లో ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే, గోపీచంద్ కాలక్రమేణా చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. ఆటో ద్వారా వచ్చే ఆదాయం తన జల్సాలకు సరిపోకపోవడంతో, అదనపు సంపాదన కోసం ఒక కారును అద్దెకు తీసుకుని నడపడం ప్రారంభించాడు.
దురదృష్టవశాత్తు, ఆ కారు ప్రమాదానికి గురైంది. దానిని రిపేర్ చేయించడానికి సుమారు రూ. 2 లక్షలు ఖర్చు అవుతుందని మెకానిక్ చెప్పారు. అంత పెద్ద మొత్తాన్ని తక్కువ సమయంలో ఎలా సంపాదించాలో తెలియక గోపీచంద్ అడ్డదారిని ఎంచుకున్నాడు. చైన్ స్నాచింగ్ ద్వారా డబ్బు సంపాదించాలని పథకం వేశాడు.
డబ్బు కోసం గోపీచంద్ రెడ్డి కాలనీలో రెక్కీ నిర్వహించాడు. ఏప్రిల్ 27వ తేదీన కాలనీలో వాకింగ్ చేస్తున్న ఇద్దరు మహిళలను గమనించి వారిని వెంబడించాడు. అదను చూసి గౌరు వజ్రమ్మ అనే మహిళ మెడలోని నాలుగు తులాల పుస్తెలతాడు, పగడాల గొలుసును కత్తిరించుకుని తన బైక్‌పై వేగంగా పారిపోయాడు. బాధితురాలు వెంటనే పోలీసులను ఆశ్రయించడంతో రంగంలోకి దిగిన పోలీసులు కాలనీలోని సీసీటీవీ (CCTV) ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో దొంగతనం చేసింది గోపీచందేనని నిర్ధారించుకుని అతడిని అరెస్టు చేశారు.
నిందితుడి నుంచి నాలుగు తులాల బంగారు ఆభరణాలు, దొంగతనానికి వాడిన బైక్ మరియు సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు. “క్షణికావేశంలో చేసే తప్పులు, ఈజీ మనీ కోసం చేసే నేరాలు జీవితాంతం చీకటి గదుల్లో మగ్గేలా చేస్తాయి. కష్టపడి సంపాదించే మార్గాలను ఎంచుకోవాలే తప్ప, నేరాల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలనుకోవడం మూర్ఖత్వం” అని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
