Telangana Politics: గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు ప్రారంభించవచ్చా.. గత చరిత్ర ఏం చెబుతోంది..?
Telangana Politics: గవర్నర్‌ను పట్టించుకోవడం లేదు. అవమానిస్తున్నారు. ప్రొటోకాల్ పాటించడం లేదు. వారికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడం లేదు..
Telangana Politics: గవర్నర్‌ను పట్టించుకోవడం లేదు. అవమానిస్తున్నారు. ప్రొటోకాల్ పాటించడం లేదు. వారికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడం లేదు అనేది తెలంగాణ బీజేపీ మాట. కాదు కాదు. అసలు గవర్నర్‌ను ఇప్పుడే కాదు ఎప్పూడూ గౌరవిస్తాం. అగౌరవంగా చూడటం మా బ్లడ్ లోనే లేదు. గవర్నర్ ప్రసంగం లేకుండా సమావేశాల జరిపే నిర్ణయం రాజకీయ ఉల్లంఘనే తప్ప రాజ్యంగ ఉల్లంఘన కాదు అంటోంది మరోవైపు టీఆర్ఎస్. ఎవరి వాదన వారిదే. సాంకేతికంగా గులాబీ పార్టీ చేస్తోంది కరెక్ట్. కానీ ఆనవాయితీని తోసిరాజని చేస్తున్న తీరు ఆసక్తికరం. ఈ నేపధ్యంలో అసలు గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు ప్రారంభించవచ్చా.. గత చరిత్ర ఏం చెబుతోంది. ఎప్పుడెప్పుడు.. ఎక్కడెక్కడ ఇలా జరిగాయో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
తెలంగాణలో.. మార్చి 7, 2022 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి. ఆనవాయితీ ప్రకారం అయితే గవర్నర్ తమిళ్ సై ఉభయ సభలను ఉద్దేశించి ప్రసగిస్తారు. ఇందుకు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది. కానీ ఈ సారి గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు జరుగుతాయని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పిన తీరు వివాదాల తెనెతుట్టెను కదిలించింది.
భారతదేశ రాజ్యాంగంలోని ఆర్టికల్ 176(1) ప్రకారం సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగే మొదటి అసెంబ్లీ సమావేశాల ప్రారంభమప్పుడు గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించాలి. ప్రతి ఏటా ఏప్రిల్ 1 లోపు బడ్జెట్ ను ప్రవేశ పెట్టాలి. దానికి ముందే సభలో బడ్జెట్ ను ప్రవేశ పెట్టి ఆమోదించాలి. జనవరి తర్వాత జరిగే సభ కాబట్టి తొలి సభ దాదాపు బడ్జెట్ సమావేశాలే అవుతాయి. కొన్ని సార్లు దాని కంటే ముందే సభలు జరిగిన ఉదంతాలూ చాలానే ఉన్నాయి. బడ్జెట్ ప్రవేశ పెట్టే ముందు కచ్చితంగా గవర్నర్ ప్రసంగం ఉండాలనే నియమం రాజ్యాగంలో లేదు. కానీ అదే సమయంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 176(2) గవర్నర్ ప్రసంగానికి చర్చ చేపట్టాలి. ఇందుకు సమయం కేటాయించాల్సి ఉంటోంది.
అసలు పోయిన అసెంబ్లీ సమావేశాలే ప్రోరోగ్ కాలేదు. కాబట్టి ఇంకా సభ లైవ్ లోనే ఉంది. ఇలాంటప్పుడు కొత్తగా సమావేశాలు అనలేము. అందుకే బడ్జెట్ సమావేశాలను గవర్నర్ ప్రారంభించలేరు అంటోంది టీఆర్ఎస్. వారు చెప్పిన అంశం సాంకేతికంగా నిజమే. ఎవరూ దాన్ని కాదనలేని పరిస్థితి.
తేడా ఎక్కడొచ్చింది.. గవర్నర్-టీఆర్ఎస్ సర్కార్ మధ్య సంబంధాలు కొన్నాళ్లుగా బెడిసి కొడుతున్నాయి. జులై20, 2020లో కరోనాపై అధికారులతో ప్రత్యేకంగా సమావేశం పెడుతున్నట్లు గవర్నర్ తమిళ్ సై ప్రకటించారు. మాకు కుదరదని చెప్పేశారు సిఎస్, హెల్త్ సెక్రటరీ. చెప్పడమే కాదు.. అధికారులు ఎవరూ వెళ్లలేదు. కరోనాపై సలహాలకు ఎవరూ స్పందించలేదంటూ 2020 ఆగస్టులో గవర్నర్ తమిళ్ సై బాహాటంగానే చెప్పడం హాట్ టాపికైంది. పరిపాలన వ్యవహారంలో గవర్నర్ వేలు పెడుతున్నారు. గవర్నర్ బీజేపీ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు టీఆర్ఎస్ నేతలు. పాడి కౌషిక్ రెడ్డిని శాసనమండలికి ఎన్నిక చేయాలని సిఎం కేసీఆర్ సిఫార్సు చేశారు. పరిశీలించాలనే కారణంతో ఆ సిఫార్సును పెండింగ్‌లో పెట్టారు తమిళ్ సై. అది గులాబీ బాస్ కు మరింత కోపం తెప్పించింది. హూజూరాబాద్ ఎన్నికల సమయంలో తీసుకున్న నిర్ణయం రాజకీయంగా తమకు పనికివస్తుందని టీఆర్ఎస్ అంచనా వేసింది. అందుకే కాంగ్రెస్ నుంచి వలస వచ్చిన నేతను తీసుకుని ఎమ్మెల్సీ ఇచ్చే ప్లాన్ చేసింది. ఇందుకు గవర్నర్ ససేమిరా అనడం ఆశ్చర్యమే. గవర్నర్‌కు ఉన్న అధికారాల ప్రకారం సిఫార్సును పెండింగ్‌లో పెట్టవచ్చు. లేకపోతే తిరిగి వెనక్కు పంపవచ్చు. టెక్నికల్‌గా గవర్నర్ వ్యవహరించిన తీరు వివాదస్పదం ఏమి కాదు.
గణతంత్ర వేడుకలకు దూరం.. రాజ్ భవన్‌లో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యమంత్రితో పాటు.. మంత్రులు, అధికారులు వెళ్లడం ఆనవాయితీ. కానీ 2022 జనవరి26న సిఎంగానీ మిగతా మంత్రులుగానీ వెళ్లలేదు. అది దూరాన్ని మరింతగా పెంచింది. ఎంఐఎం సభ్యుడు జాఫ్రీని శాసన మండలి ప్రొటెం చైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది. దీని గురించి ప్రభుత్వాన్ని వివరణ అడిగారు గవర్నర్. మా నియామకాన్ని గవర్నర్ అడగడం ఏంటనే వాదన ప్రారంభమైంది. ఇటీవల సమ్మక్క సారక్క జాతర సందర్భంగా వరంగల్ జిల్లాకు వెళ్లిన గవర్నర్ కు ప్రోటోకాల్ పాటించలేదనే ప్రచారం సాగింది. గవర్నర్ జిల్లాకు వచ్చిన సందర్భంలో కచ్చితంగా కలెక్టర్ లేక ఉన్నతాధికారులు స్వాగతం పలకాలి. ఆ పనిచేయక పోవడంతో ఇటు ప్రభుత్వం-అటు గవర్నర్ మధ్య సంబంధాల అంతరం పెరుగుతూ వస్తోంది.
చరిత్రలోకి తొంగి చూస్తే.. 1970లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ఖండూబాయ్ దేశాయ్ ప్రసంగం లేకుండానే ప్రారంభమయ్యాయి. అప్పటికే అసెంబ్లీ ప్రొరోగ్ కాకపోవడమే ఇందుకు కారణం. అంటే లైవ్ లో ఉన్నట్లు లెక్క. 1971 మార్చిలో జరిగిన అసెంబ్లీ సమావేశాలు, 2013 ఫిబ్రవరిలో జరిగిన ఏపీ బడ్జెట్ సమావేశాలు, 2019 డిసెంబర్ లో బడ్జెట్ సమావేశాలు, 2020 జనవరిలో జరిగిన బడ్జెట్ సమావేశాలు, వెస్ట్ బెంగాల్ లో ఫిబ్రవరి5, 2021న గవర్నర్ ప్రసంగం లేకుండానే మమతా బెనర్జీ బడ్జెట్ ప్రవేశ పెట్టారు. సాంకేతికంగా చూస్తే అప్పటి ముఖ్యమంత్రులు వ్యవహరించిన తీరు సబబునే. కానీ రాజకీయంగా గవర్నర్ కు సిఎంకు మధ్య పొసగకనే ఇలా జరిగిందనేది నిజం.
పార్లమెంటులోనూ.. రాష్ట్రపతి ప్రసంగం లేకుండానే 2004లో పార్లమెంటు సమావేశాలు జరిగాయి. దీనిపై అప్పుడే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ విషయంపై చర్చించిన ధర్మాసనం అలా సభ జరపడం రాజ్యాంగ విరుద్దం కాదని కొట్టేసింది.
గవర్నర్‌తో గొడవలు పడ్డ ఉదంతాలు చాలానే.. ముఖ్యమంత్రులు-గవర్నర్ ల మధ్య వివాదాలు కొత్తేమి కాదు. జమానా కాలం నుంచి జరుతూనే వస్తున్నాయి. ఇక మీదట కూడా జరిగే వీలుంది. కేంద్రంలో ఒకరు.. రాష్ట్రంలో మరొకరు అధికారంలో ఉన్నప్పుడు కచ్చితంగా తేడాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటోంది. కేంద్రంలో పరిపాలనలో ఉన్న సర్కార్‌కు.. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధాలు ఉంటే పర్వాలేదు. లేకపోతే ఏదో ఒక సందర్భంలో వివాదాలు రావడం ఆశ్చర్యమేమి కాదు.
పశ్చిమ బెంగాల్‌లో.. గవర్నర్ జగదీప్ ధాన్ ఖర్ ప్రసంగం లేకుండానే ఫిబ్రవరి5, 2021లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. బడ్జెట్ సమావేశాలపై గవర్నర్‌కు ప్రభుత్వం ఆహ్వానం పంపలేదని కేంద్ర బీజేపీ సర్కార్ ధ్వజమెత్తింది. గవర్నర్ లేకపోవడం ఏంటి అంటూ బీజేపీ ఎమ్మెల్యేల నిరసన వ్యక్తం చేశారు. ఆ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు కాంగ్రెస్, వామపక్షాలు ప్రకటించేంత వరకు వెళ్లాయి. ఫలితంగా గవర్నర్ జగదీప్ ధాన్ ఖర్ సిఎం మమతా బెనర్జీ ప్రభుత్వానికి మధ్య తీవ్రమైన విబేధాలు పొడచూపాయి.
పుదుచ్చేరిలో.. పుదుచ్చేరిలో జులై20, 2020న జరిగిన 2020-21 బడ్జెట్ సమావేశాలకు లెఫ్ట్‌నెంట్ గవర్నర్ కిరణ్‌బేడి హాజరు కాలేదు. బడ్జెట్ పూర్తి వివరాలు తనకు తెలుపలేదని గవర్నర్ చెప్పడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గవర్నర్ కోసం కొద్ది సేపు వేచి చూసిన తర్వాత బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు సిఎం నారాయణ స్వామి.
మహారాష్ట్ర గవర్నర్ కోషియారి-సిఎం ఉద్దవ్ థాక్రే మధ్య వివాదాలు చాలానే వచ్చాయి. కొవిడ్ సమయంలో ప్రార్థనాలయాలను తెరవాలని గవర్నర్ ఇచ్చిన సూచనను కాదన్నారు సిఎం ఉద్దవ్ థాక్రే. చివరకు గవర్నర్ ను తప్పించాలని కేంద్రానికి సిఎం లేఖ రాసేంత వరకు వివాదం వెళ్లింది. తప్పు చేసిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే విషయంలోనూ ఇద్దరి మధ్య గొడవలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఏపీలో.. 1970లో కాసు బ్రహ్మానందరెడ్డి సిఎంగా ఉన్నప్పుడు కూడా గవర్నర్ ఖండూభాయ్ కసన్‌జీ దేశాయ్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 1984 ఆగస్టు16న అప్పటి గవర్నర్ రాం లాల్ కు సిఎం ఎన్టీఆర్ మధ్య వివాదాలొచ్చాయి. ఎన్టీఆర్ కు మెజార్టీ ఎమ్మెల్యేలు ఉన్నా బలనిరూపణకు అవకాశం ఇవ్వకుండా నాదెండ్ల భాస్కర్ రావు వైపు మొగ్గు చూపడం వివాదానికి తావిచ్చింది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఆదేశాలతోనే గవర్నర్ రామ్ లాల్ ఇలా వ్యవహరించారనే చర్చ నడిచింది. చివరకు బల నిరూపణ చేసుకోలేక నాదెండ్ల భాస్కర్ రావు తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత సిఎంగా ఎన్టీఆర్ కుర్చీ ఎక్కిన సంగతి తెలిసిందే. ఇక ఏప్రిల్25, 2018న ఏపీ గవర్నర్ నరసింహన్ పై సిఎం చంద్రబాబు మాటల దాడి చేశారు. టీడీపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలను గవర్నరే కలుపుతున్నారని, గవర్నర్ వ్యవస్థ ఒక పద్ధతి ప్రకారం.. రాజ్యాంగానికి లోబడి నడుచుకోవాలని హితవు పలకడం వివాదాన్ని రేపింది. అక్కడే కాదు.. కర్నాటకలో బస్వరాజ్ బొమ్మై ప్రభుత్వానికి గవర్నర్ భరద్వాజకు పడటం లేదు. చాలా చోట్ల గవర్నర్ వర్సెస్ సిఎంలా వ్యవహారం ముదిరిపాకాన పడుతోంది.
గవర్నర్ పాత్ర ఏంటి.. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 159 ప్రకారం గవర్నర్ కు అధికారాలు, విధులు ఉన్నాయి. రాష్ట్ర పరిపాలనలో రాజ్యాంగాన్ని, చట్టాన్ని పరిరక్షించడం గవర్నర్ విధి. కార్యనిర్వాహక, శాసన సంస్థలపై చర్యలు, సిఫార్సులు, పర్యవేక్షక అధికారాలు గవర్నర్ కు ఉంటాయి. (ఆర్టికల్ 167 సి, ఆర్టికల్ 200, ఆర్టికల్ 213, ఆర్టికల్ 355). గవర్నర్ రాష్ట్ర ఆర్థిక కమిషన్ ను ఏర్పాటు చేయవచ్చు. రాష్ట్ర బడ్జెట్ నివేదికను శాసనసభ ముందు ఉంచడానికి గవర్నర్ కు అధికారం ఉంది. గవర్నర్ సిఫారసు లేకుండా నిధుల మంజూరు కోరరాదు. ఏదైనా ఊహించని ఖర్చుల కోసం రాష్ట్ర ఆకస్మిక నిధి నుండి అడ్వాన్స్ పొందవచ్చు.
శాసన అధికారాలు.. రాష్ట్ర అధిపతిగా రాష్ట్ర శాసనసభ ఉభయ సభల సమావేశాలను జరపమని ఆదేశించడానికి, నిలిపివేయడానికి గవర్నర్ కు అధికారాలున్నాయి. గవర్నర్ రాష్ట్ర శాసనసభను రద్దు చేయవచ్చు. గవర్నర్ ఈ అధికారాలను ఉపయోగించడం ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రిమండలి సలహాకు అనుగుణంగా ఉండాలి. శాసనసభ ఆమోదించిన బిల్లు, గవర్నర్ సమ్మతి ఇచ్చిన తర్వాతే చట్టంగా మారుతుంది. గవర్నర్ ఒక బిల్లును రాష్ట్ర శాసనసభకు తిరిగి పంపవచ్చు. అది ద్రవ్య బిల్లు కాకపోతే, పునఃపరిశీలన కోసం శాసనసభ రెండో సారి గవర్నర్‌కు తిరిగి పంపించవచ్చు. గవర్నర్ దానికి అంగీకరించాలి. రాష్ట్రపతికి కొన్ని బిల్లులను పంపే అధికారం గవర్నర్‌కు ఉంది
శాసనసభ సమావేశాలు మధ్యకాలంలో గవర్నర్ ఆర్డినెన్స్‌లను ప్రకటించవచ్చు. శాసనసభ తదుపరి సమావేశంలో చట్టంగా మారుటకు రాష్ట్ర శాసనసభకు ఇస్తారు. రాష్ట్ర శాసనసభ పునర్నిర్మించబడిన తేదీ నుండి ఆరు వారాల కాలం వరకు అవి చెల్లుబాటులో ఉంటాయి. రాజ్యాంగంలోని 175వ అధికరణ కింద శాసన సభకు ఆదేశం పంపే అధికారం గవర్నర్‌కు ఉంది. దానిపై వీలయినంత త్వరగా చర్య తీసుకోవలసిన బాధ్యత సభపై ఉంది. గవర్నర్ శాసన సభలో భాగమేనని రాజ్యాంగంలోని 168వ అధికరణ స్పష్టం చేస్తోంది. సభలో ఏదైనా బిల్లు పెండింగులో ఉన్నప్పుడు దానిపై నిర్ణయం తీసుకోవాలని గవర్నర్ సభకు సూచించవచ్చని 175వ అధికరణ చెబుతోంది. రాజ్యాంగం ప్రకారం పెండింగు బిల్లులకు సంబంధించి మాత్రమే గవర్నర్ శాసన సభకు ఆదేశాలివ్వవచ్చు.
ఇన్ని అధికారాలు ఉన్న గవర్నర్ పాత్రను తక్కువ చూడలేము. కానీ అదే సమయంలో ముఖ్యమంత్రి పాలనా వ్యవహారంలో జోక్యం చేసుకోవడం సరికాదు. ఎవరి పాలనా అధికారాలను వారు సక్రమంగా నిర్వహిస్తే గొడవలు వచ్చే చాన్స్ తగ్గుతోంది. కాబట్టి వాస్తవాన్ని తెలుసుకుని మసలుకోవడమే ఉత్తముడి లక్షణం అంటున్నారు మేధావులు.
కొండవీటి శివనాగరాజు, సీనియర్ జర్నలిస్టు, రీసెర్చ్ ప్రొడ్యూసర్, టీవీ9 తెలుగు.
Also read:
ICC Women World Cup 2022: పదకొండు సార్లు టోర్ని జరిగితే కేవలం 3 జట్లు మాత్రమే గెలుపొందాయి..!
యుద్ధ పరిస్థితులకు బెదరకుండా.. విద్యార్థులను స్వదేశానికి చేర్చి.. తెగువ చూపిన మహిళా పైలట్