AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: అక్కా.! నువ్వు చల్లగుండాలె.. ఎండలో వీరు చేసే పని చూస్తే సలాం కొట్టాల్సిందే

రోజురోజుకు పెరుగుతున్న వేసవి తాపానికి జనం అల్లాడిపోతున్నారు. వేసవిలో ఎండలకు గొంతు తడారిపోతుంటుంది. రహదారిపై ప్రయాణంతో మరింతగా దాహంతో అల్లాడుతుంటారు. చల్లని నీరు దొరికితే చాలనుకుంటాం.. కానీ ఈ రహదారిపై ప్రయాణించే వాహనదారులకు ఉచితంగా వేసవి తాపాన్ని తగ్గించే పానీయాలు అందుతున్నాయి. చల్లని పానీయాలు ఉచితంగా అందుతున్న రహదారి ఏది..?

Telangana: అక్కా.! నువ్వు చల్లగుండాలె.. ఎండలో వీరు చేసే పని చూస్తే సలాం కొట్టాల్సిందే
Telugu News
M Revan Reddy
| Edited By: |

Updated on: Apr 24, 2025 | 11:15 AM

Share

మండుతున్న ఎండలతో ప్రయాణం చేయాలంటేనే వనికి పోతుంటాం. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణం చేస్తే వేసవి తాపానికి తట్టుకోలేకపోతాం. చల్లని పానీయం గ్లాసు చేతికందితే అప్పటిదాకా అనుభవించిన వేసవితాపం క్షణంలో చల్లార్చవచ్చు. గ్లాసుపైన గ్లాసు కడుపునిండేంత చల్లటి పానీయం దొరికితే అంతటి మహాభాగ్యం ఉంటుందా.? కానీ ఈ రహదారిపై ప్రయాణించే వాహనదారులకు చల్లటి మహాభాగ్యం అందుతోంది. నల్లగొండ జిల్లా మీదుగా అద్దంకి మార్కెట్ పల్లి రహదారి వెళ్తోంది. ఈ రహదారిపై నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. మిర్యాలగూడ మండలం శెట్టి పాలెం వద్ద ఈ హైవేపై గత 30 ఏళ్లుగా వాహనదారులకు ఓ ఫిల్లింగ్ స్టేషన్ సేవలందిస్తోంది. మనం బతుకుతూ ఇతరులకు కొంత సేవ చేయాలి అనే సూత్రాన్ని ఈ స్టేషన్ నిర్వాహకులు అమలు చేస్తున్నారు. ఎండల్లో ప్రయాణికులు వడదెబ్బకు గురికాకుండా అల్లం, జీలకర్ర వేసిన చల్లని మజ్జిగ ఉచితంగా అందిస్తున్నారు. ఈ పెట్రోల్‌బంక్‌లో వాహన దారులకు, ప్రయాణికులకు ఉచితంగా మజ్జిగ పంపిణీ చేస్తున్నారు.

మొక్కుబడిగా కాకుండా రోజుకు 30 కిలోల పెరుగులో జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర, పూదీనా కలిపి మజ్జిగ చేసి పెట్రోల్‌బంకులోకి వచ్చిన ప్రతి ఒక్కరికీ పంపిణీ చేస్తున్నారు. ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పంపిణీ చేస్తూ అందరి కడుపులను చల్ల బరుస్తున్నారు. ఇందుకోసం అదనంగా ముగ్గురు సిబ్బందిని కూడా నియమించారు. ఈ రహదారిపై ప్రయాణించే వాహనదారులు ఈ ఫిల్లింగ్ స్టేషన్ కు రాగానే నిర్వాహకులు అందించే చల్లటి మజ్జిగను తాగి వేసవి తాపం నుంచి ఉపశమనం పొందుతున్నారు. ఈ బంక్ నిర్వాహకులు చల్లటి మజ్జిగతో అందరి కడుపులను చల్లబరుస్తున్నారు. ఈ చల్లటి మజ్జిగను వాహనదారులకు కొన్నేళ్లుగా పంపిణీ చేస్తున్నడంతో బంకు నిర్వాకుడికి చల్ల వెంకటేశ్వర్లు అనే పేరు కూడా వచ్చింది. ఈ బంకులో చల్లటి మజ్జిగను తాగిన వాహనదారులు మాత్రం నిర్వాహకులకు ధన్యవాదాలు చెబుతున్నారు. వడదెబ్బ నుండి కాపాడే ప్రయత్నం చేస్తున్నందుకు చేతులెత్తి నమస్కరిస్తున్నారు.

సేవా కార్యక్రమంగా భావిస్తున్నా..

వ్యాపారంలో లాభార్జనే కాకుండా దేవుళ్ళుగా భావించే వినియోగదారులకు కూడా కొంత సేవ చేయాలని సూత్రాన్ని మా తాత, తండ్రుల నుంచి మాకు అలవడిందని బంకు నిర్వాహకుడు వెంకటేశ్వర్లు చెబుతున్నాడు. కరోనా రెండేళ్ల సమయంలో తప్ప 15 ఏళ్లుగా బంక్‌లో మజ్జిగ పంపిణీ చేస్తున్నామని, ముగ్గురు అదనపు సిబ్బందిని నియమించి మజ్జిగను పంపిణీ చేయిస్తున్నామని చెప్పారు. రోజుకు రూ.5 వేల వరకు ఖర్చు వస్తోందని, తోటివారికి సేవ చేస్తునన్న సంతృప్తి మిగులుతోందని వెంకటేశ్వర్లు చెబుతున్నారు.