TSRTC Cancels All RTC Buses : తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే బస్సులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలంగాణ ఆర్టీసీ ప్రకటించింది. ఏపీలో కర్ఫ్యూ కొనసాగుతున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇది తాత్కాలికమేనని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ ప్రకటించారు. ఉదయం నుంచి వెళ్లే బస్సులు మధ్యాహ్నానికి చేరుకునే అవకాశమే లేదని, అందుకే ఈ నిర్ణయమని వివరించారు. అయితే తెలంగాణ, ఏపీ మధ్యలో మెడికల్ ఎమర్జెన్సీ ఉన్న వాహనాలకు మాత్రమే పూర్తి అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.
తెలంగాణ నుంచి ఏపీ మీదుగా ఇతర రాష్ట్రాలకు వెళ్లే మిగితా వాహనాలను కూడా నిలిపేశామని వివరించారు. ఏపీ ప్రభుత్వం నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ ఈ నిబంధనలను వర్తింపజేస్తామని సునీల్ శర్మ స్పష్టం చేశారు. ఏపీలో మధ్యాహ్నం 12 గంటల నుంచి కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. ఏపీలో కర్ఫ్యూకు ముందే బస్సులు అక్కడికి చేరుకోవలసి ఉంటుంది. ఉదయం అక్కడికి చేరుకున్న బస్సులు తిరిగి మధ్యాహ్నం 12 లోపు రాష్ట్ర సరిహద్దులను దాటాల్సి ఉంటుంది.
తెలంగాణలో రాత్రి 9 గంటల నుంచే కర్ఫ్యూ అమలవుతోంది. ఏపీ నుంచి బయల్దేరిన బస్సులు రాత్రి 9 గంటలలోపు డిపోలకు చేరుకోవడం సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు. తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే దాదాపు 250 బస్సులను తెలంగాణ ఆర్టీసీ రద్దు చేసింది. ముఖ్యంగా అంతరాష్ట్ర సరిహద్దుల దగ్గర మాత్రం పరిస్థితి మాత్రం కాస్త గందరగోళంగా మారింది. మధ్యాహ్నం 12 దాటిన తర్వాత ఎలాంటి వాహనాలకు పోలీసులు అనుమతి ఇవ్వడం లేదు.