BRS: బీఆర్ఎస్ సభకు ముస్తాబైన నాందేడ్.. రేపే మీటింగ్.. రెండు లక్షల మంది పాల్గొనేలా ఏర్పాట్లు..
దేశ రాజకీయాల్లో ప్రభావం చూపించేందుకు బీఆర్ఎస్ పార్టీ వేగంగా అడుగులు వేస్తోంది. ఖమ్మం సభతో దేశం చూపును తన వైపు తిప్పుకున్న బీఆర్ఎస్.. ఇప్పుడు మరో సభకు సిద్ధమైంది. ఈ సారి స్వరాష్ట్రంలో కాకుండా..
దేశ రాజకీయాల్లో ప్రభావం చూపించేందుకు బీఆర్ఎస్ పార్టీ వేగంగా అడుగులు వేస్తోంది. ఖమ్మం సభతో దేశం చూపును తన వైపు తిప్పుకున్న బీఆర్ఎస్.. ఇప్పుడు మరో సభకు సిద్ధమైంది. ఈ సారి స్వరాష్ట్రంలో కాకుండా.. పొరుగునే ఉన్న మహారాష్ట్రలో మీటింగ్ పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు. నాందేడ్ లో రేపు జరగనున్న సభకు పార్టీ శ్రేణులు సర్వం సిద్దం చేశారు. భారీ హోర్డింగులు, బెలూన్లు, బీఆర్ఎస్ గులాబీ జెండాలతో నాందేడ్ గులాబీ మయమైంది. వారం రోజులుగా నాందేడ్ లోనే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు జోగు రామన్న, షకీల్ మకాం వేశారు. నాందేడ్ జిల్లాలోని నాందేడ్ సౌత్ & నార్త్, బోకర్, నాయిగాం, ముఖేడ్, డెగ్లూర్, లోహ నియోజకవర్గాలు, కిన్వట్, ధర్మాబాద్ మండలాల నుంచి భారీ జనసమీకరణకు ఏర్పాట్లు చేస్తున్నారు. మహారాష్ట్ర నాందేడ్ జిల్లా సరిహద్దు తెలంగాణ నియోజకవర్గాలైన ఆదిలాబాద్, బోథ్, ముధోల్, నిర్మల్, నిజామాబాద్, బోధన్ నియోజక వర్గాల నుంచి నాందేడ్ సభకు గులాబీ నేతలు తరలి వస్తున్నారు. రెండు లక్షల మంది పాల్గొనేలా సభకు ఏర్పాట్లు చేశారు.
కాగా.. ఇవాళ (శనివారం) ప్రగతి భవన్ లో బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ తో మహారాష్ట్రకు చెందిన పలువురు మాజీ ఎంపీలు, జిల్లా చైర్మన్లు, సీనియర్ నాయకులు భేటీ అయ్యారు. కేసీఆర్ సారథ్యంలో తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు, దళిత బంధు, ఉచిత విద్యుత్తు, ఆసరా పింఛన్లు తదితర పథకాలు, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, వ్యవసాయాభివృద్ధి, పారిశ్రామికాభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాలు ముఖ్యమంత్రిని అడిగి తెలుసుకున్నారు. బీఆర్ఎస్ జాతీయ పార్టీగా పరిణామం చెందడాన్ని మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎంపీలు, సీనియర్ నేతలు ఆహ్వానించారు.
బీఆర్ఎస్ పార్టీ విధి విధానాల గురించి సుదీర్ఘంగా చర్చించారు. తాము పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. సీఎం కేసీఆర్ తో భేటీ అయిన వారిలో.. ఛత్తీస్ఘడ్ కు చెందిన నేషనల్ యునైటెడ్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు గోపాల్ రిషికార్ భారతి, మధ్యప్రదేశ్ బాలాఘాట్ మాజీ ఎంపీ బోధ్ సింగ్ భగత్, మహారాష్ట్ర బండారా మాజీ ఎంపీ కుషాల్ భోప్చే, చత్తీస్ఘర్ సారంగద్ మాజీ మంత్రి డాక్టర్ చబ్బీలాల్ రాత్రే, రిపబ్లికన్ పార్టీ గడ్చిరోలి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ శంకర్, సిద్ధిపేట జిల్లా బీఆర్ఎస్ నాయకుడు అంబటి బాలచంద్ర గౌడ్ తదితరులు ఉన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..