
ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశ రాజధాని నుంచి తెలుగు రాష్ట్రాల వరకు ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. రోజుకో మలుపు తిరుగుతోన్న ఈ కేసులో సీబీఐ, ఈడీ దూకుడు పెంచింది. ఇప్పటికే ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో తర్వాత అరెస్ట్ చేసేది ఎమ్మెల్సీ కవితననే అంటూ పలువురు బీజేపీ నాయకులు బహిరంగంగానే కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కవితకు మీడియా నుంచి ఇదే ప్రశ్న ఎదురైంది. దీంతో కవిత బీజేపీ అటాక్ చేశారు.
తనను అరెస్ట్ చేయనున్నారన్న వార్తలపై స్పందించిన కవిత మాట్లాడుతూ..’విపక్షనేతలనే దర్యాప్తు సంస్థలు టార్గెట్ చేస్తున్నాయి. అదానీపై ఈడీ, సీబీఐ ఎందుకు దర్యాప్తు చేయడం లేదు. సుప్రీం ఆదేశాలతోనే అదానీపై దర్యాప్తు ప్రారంభమైంది. మోదీ వైఫల్యాలపై నిలదీస్తే ఏజెన్సీలతో భయపెడుతున్నారు. బీజేపీ నాయకులు చెబితే అరెస్ట్ చేస్తే ఎలా? చూద్దాం ఏం జరుగుతుందో. అది ఎవరు చెప్పాలో..ఎవరు చేయాలో. ఏ ఏజెన్సీలు చెప్పాలో వాళ్లే చెప్పాలి. వీళ్లు చెప్పి వాళ్లు చెప్పి చేస్తే మ్యాచ్ ఫిక్సింగ్ అవుతుంది. ఇది ప్రజాస్వామ్యం. అది బీజేపీ నాయకులకు చెప్పండి అంటూ కవిత స్పందించారు.
ఇదిలా ఉంటే ఢిల్లీలో తాను ఒక్కరోజు నిరాహార దీక్ష చేయనున్నట్లు ఎమ్మల్సీ కవిత తెలిపారు. బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకురావాలని ఆమె డిమాండ్ చేశారు. దేశ వ్యాప్తంగా పని చేయాలని తెలంగాణ జాగృతి భారత జగృతిగా మార్చినట్లు తెలిపారు. భారత జాగృతి మొదటి కార్యక్రమం ఈ నెల 10న జంతర్ మంతర్ వద్ద ఒక్కరోజు నిరాహార దీక్ష అని చెప్పారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే మహిళా బిల్లు తేవాలని డిమాండ్ చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..