బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు.. మళ్లీ యాక్టివ్ కానున్నారు. చాలా రోజులుగా సైలెంట్ గా ఉన్న కేసీఆర్ మళ్లీ ప్రజల్లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బస్సు యాత్ర ద్వారా రాష్ట్రమంతా చుట్టేసిన కేసీఆర్.. ఆ తర్వాత మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయలేదు. రుణమాఫీ, రైతు భరోసా, హైడ్రా, జీవో నెంబర్ 46, పెన్షన్లు ఇలా రకరకాల సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ పోరాటాలు చేస్తున్నా.. ఆయన మాత్రం ఎక్కడా ఫ్రంట్ లైన్ లో కనిపించలేదు. కేటీఆర్, హరీష్ నేతృత్వంలో ఎమ్మెల్యేలు పార్టీ ముఖ్య నేతలే ఇప్పటివరకు పలు కీలక విషయాలపై మాట్లాడుతున్నారు. అయితే.. ఇన్ని రోజులు కవిత జైల్లో ఉండడంతో కేసీఆర్ కూడా ఆవేదనతో ఉన్నారని పార్టీ వర్గాలు చెప్పాయి. తన కూతుర్ని ఇన్ని రోజులపాటు రాజకీయ కక్షతో జైల్లో ఉంచడం ఆయన్ను కొద్దిగా కుంగదీసింది. ఇప్పుడు కవిత జైలు నుంచి బెయిల్ పైకి రావడంతో.. పూర్తిగా పార్టీపై దృష్టి పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.. ఇందుకోసం మొదట రైతుల సమస్యలపై జిల్లాల పర్యటనలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
సెప్టెంబర్ మొదటి వారంలో కేసీఆర్ పర్యటన మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బహిరంగ సభల్లా కాకుండా జిల్లాలో ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లో కార్నర్ మీటింగ్ లు, గ్రామాల్లో రైతులతో నేరుగా కేసీఆర్ ముఖాముఖి, జిల్లా కేంద్రాల్లో రైతు నాయకులతో సమావేశాలు, మేధావులతో చర్చలు.. ఇలా వినూత్న కార్యక్రమాలతో కేసీఆర్ ప్రజల ముందుకురానున్నారు. కేసీఆర్ పర్యటనకు సంబంధించి ఒకటి రెండు రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. పార్టీతోపాటు ప్రజల్లోనూ కేసీఆర్ ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారన్న చర్చ జరుతున్న తరుణంలో కేసీఆర్ మరోసారి .. ఫ్రంట్ లైన్ ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
అయితే.. కేసీఆర్ కూడా మొదట్లో ప్రభుత్వానికి కొంత సమయం ఇచ్చిన తర్వాతే ప్రతిపక్ష పార్టీగా ప్రజల తరఫున నిలదీయాలని పలు మార్లు చెప్పారు.. ఇప్పుడు దాదాపుగా ప్రభుత్వం ఏర్పడి పది నెలలు కావొస్తుంది. మరోవైపు ప్రభుత్వం కూడా దూకుడుగా ముందుకెళ్తుంది. దీంతో కేసీఆర్ ప్రతిపక్ష పార్టీ నేతగా కార్యకర్తల్లో జోష్ నింపేందుకు, పనిలో పనిగా పార్టీ ఫిరాయింపుల్ని కూడా అడ్డుకునేందుకు చేస్తున్న ప్రయత్నంగా ఈ పర్యటన ఉంటుందని చెబుతున్నారు. మరోవైపు కొద్ది రోజుల్లో స్థానిక పంచాయతీ ఎన్నికలు రానున్నాయి. గ్రౌండ్ లెవెల్ క్యాడర్ ని మరింత స్ట్రాంగ్ చేయాలంటే ఇప్పుడు కేసీఆర్ టూర్ అవసరమని పార్టీ నేతలు భావిస్తున్నారు.. ఈ తరుణంలో కేసీఆర్ జిల్లాల పర్యటన ఆసక్తికరంగా మారనుంది..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..