Telangana: గేమ్స్ ఆడోద్దని మందలించిన తల్లి.. కోపంలో కొడుకు ఏం చేశాడో తెలిస్తే..
ప్రస్తుత జనరేషన్ పిల్లలు రోజురోజుకూ ఆన్‌లైన్ గేమ్స్ బానిసలై పోతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు వాటిలోనే మునిగితేలుతున్నారు. వాటి జోలికి వెళ్లొద్దని తల్లిదండ్రులు వారిస్తే.. మనస్తాపానికి గురై ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే జగిత్యాల జిల్లాలో వెలుగు చూసింది. ఆన్ లైన్ గేమ్స్ ఆడొద్దని తల్లి మందలించినందుకు ఒక కుర్రాడు ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

ఆన్‌లైన్ గేమ్స్ ఆడోద్దని తల్లి మందలించిందన్న మనస్తాపంలో బాలుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాల జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల పట్టణంలోని లింగంపేటకు చెందిన విష్ణువర్ధన్ అనే బాలుడు స్థానికంగా ఉన్న స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. అయితే విష్ణు గత కొన్ని రోజులుగా ఆన్ లైన్ గేమ్స్ కి అలవాటు పడ్డాడు. ఈ అలవాటు కాస్తా ఆ బాలుడిని ఆన్ లైన్ గేమ్స్‌కు బానిసను చేసింది. దీంతో విష్ణు కొన్ని సార్లు స్కూల్ ఎగ్గొట్టిమరీ ఆన్‌లైన్ గేమ్స్ ఆడేవాడు. ఇది గమనించిన అతని తల్లి.. గేమ్స్ ఆడొద్దని మందలించింది. దీంతో ఆగ్రహానికి గురైన విష్ణు మొదట తన తల్లికే ఎదురుతిరిగాడు. ఆ తర్వాత మనస్తాపానికి గురై ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అయితే విష్ణు కనిపించకపోయేసరికి కంగారు పడిపోయిన తల్లి అతని కోసం ఇంటి పరిసర ప్రాంతాల్లో మొత్తం వెతికింది. చివరకు ఇంట్లో వచ్చి చూడగా విష్ణు వేలాడుతూ కనిపించాడు. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన తల్లి స్థానికుల సహాయంతో బాలుడిని కిందకు దించి హాస్పిటల్‌కు తరలించింది. విష్ణును పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మృతి చెందినట్టు నిర్ధారించడంతో.. ఆ తల్లి కన్నీరు మున్నీరుగా విలపించింది.
ఇక ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేమాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు పిల్లలను ఆన్‌లైన్ గేమ్స్ కు దూరంగా ఉంచాలని పోలీసులు సూచిస్తున్నారు. పిల్లలు మొబైల్స్‌కు అడెక్ట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని పోలీసులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




