Munugode ByPoll: ప్రజా తీర్పును శిరసావహిస్తున్నాం.. హామీలను 15 రోజుల్లో అమలు చేయాలి.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ డిమాండ్..

|

Nov 06, 2022 | 8:57 PM

మునుగోడు ప్రజల తీర్పును శిరసావహిస్తున్నామని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నిక ఫలితం తర్వాత హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గెలుపునకు పొంగిపోమని, ఓటమికి క్రుంగిపోమన్నారు. మునుగోడు ప్రజలకు ఉప ఎన్నిక సందర్భంగా..

Munugode ByPoll: ప్రజా తీర్పును శిరసావహిస్తున్నాం.. హామీలను 15 రోజుల్లో అమలు చేయాలి.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ డిమాండ్..
Bandi Sanjay
Follow us on

మునుగోడు ప్రజల తీర్పును శిరసావహిస్తున్నామని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నిక ఫలితం తర్వాత హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గెలుపునకు పొంగిపోమని, ఓటమికి క్రుంగిపోమన్నారు. మునుగోడు ప్రజలకు ఉప ఎన్నిక సందర్భంగా ఇచ్చిన హామీలను సీఏం కేసీఆర్ 15 రోజుల్లో అమలు చేయాలని డిమాండ్ చేశారు. మునుగోడులో ఎన్ని రకాలుగా బెదిరించినా వీరోచితంగా పోరాడిన పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. మునుగోడులో తమ పార్టీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డికి 86,485 ఓట్లు వచ్చయన్నారు. టీఆర్ ఎస్ పార్టీ నాయకులు ఉప ఎన్నికలో గెలిచిన తర్వాత ఎంత విర్రవీగుతున్నారో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. గెలిచిన తర్వాత 15 రోజుల్లో హామీలు నెరవేరుస్తామన్నారు. ఎన్నికల హామీలు సీఎం కేసీఆర్‌ నెరవేర్చాల్సిందేనన్నారు. ఆ విషయం పక్కనపెట్టి అహంకారంతో మాట్లాడుతున్నారని అన్నారు. ఒక ఉప ఎన్నికలో గెలవగానే ఎగిరెగిరి పడుతున్నారని తెలిపారు. ఇతర పార్టీల నాయకులు, ఎమ్మెల్యేలు బీజేపీలో చేరితే పదవులకు రాజీనామా చేయించి ప్రజా తీర్పు కోరుతున్నామని, దేశ వ్యాప్తంగా తమ పార్టీ ఇదే విధానాన్ని పాటిస్తుందన్నారు.

ఇతర పార్టీల నుంచి గెలిచిన 12 మందిని సీఏం కేసీఆర్ టీఆర్ ఎస్ లో చేర్చుకున్నారని, వారితో రాజీనామా చేయించి ప్రజా తీర్పు కోరగలరా అని ప్రశ్నించారు. మునుగోడు గెలుపు కేసీఆర్‌దా.. కేటీఆర్‌దా.. హరీశ్‌రావుదా, సీపీఐదా, సీపీఏందా లేకపోతే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిదా.. ఎవరిదో చెప్పాలని డిమాండ్ చేశారు. రాజగోపాల్‌రెడ్డిని ఎదుర్కోవడానికి 16 మంది మంత్రులు, 86 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పనిచేస్తే వచ్చింది 11వేల లోపు మెజార్టీ మాత్రమేనని తెలిపారు.

ఒక్కో పోలింగ్‌ బూత్‌కు టీఆర్ఎస్ ఎమ్మెల్యే పనిచేస్తే.. బీజేపీ తరఫున ఓ సామాన్య కార్యకర్త పనిచేశారని, ఒక్కో టీఆర్ఎస్ ఎమ్మెల్యే.. తమ పార్టీ కార్యకర్తతో సమానమన్నారు. ఉప ఎన్నిక వస్తేనే అభివృద్ధి జరుగుతుందనే అభిప్రాయంలో ప్రజలు ఉన్నారని తెలిపారు. మునుగోడు ఓటమితో బీజేపీ కార్యకర్తలు నిరుత్సాహపడొద్దని, ఓటమిపై సమీక్ష చేసుకుంటాంమన్నారు. అధికారమే లక్ష్యంగా అభివృద్ధి కోసం పనిచేస్తామని బండి సంజయ్ సృష్టం చేశారు. తమ పార్టీ అభ్యర్థికి ఓట్లు వేసిన వారితో పాటు.. మునుగోడు ఓటర్లందరికీ బండి సంజయ్ ధన్యవాదాలు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..