తెలంగాణలో సంచలనం సృష్టించిన పదో తరగతి ప్రశ్నపత్రాల లీక్ కేసులో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం అర్ధరాత్రి కరీంనగర్‌లోని సంజయ్ నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజేపీ కార్యకర్తలు పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు, బీజేపీ శ్రేణులకు తీవ్ర వాగ్యుద్ధం జరిగింది. కాగా బండి సంజయ్‌ను హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా మంగళవారం హిందీ పేపర్ కాపీయింగ్ కేసులో ముఖ్య నిందితుడు బండి సంజయ్‌కు సన్నిహితుడు అని బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అలాగే హిందీ పేపర్ లీక్ కేసులో నిందితుడిగా భావిస్తోన్న ప్రశాంత్ హిందీ పేపర్ ను బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కు పంపించారని వరంగల్ సీపీ రంగనాథ్ తెలిపారు. ఈక్రమంలో బండి సంజయ్ కు ఎందుకు పేపర్ పంపించాడు?అనే కోణంలోనూ విచారణ చేస్తామన్నారు సీపీ. ఇంతలోనే బుధవారం అర్ధరాత్రి బండి సంజయ్ ను అదుపులోకి తీసుకున్నారు. కాగా బండి అరెస్టుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా బండి సంజయ్ అరెస్టుపై ఆయన సతీమణి అపర్ణ టీవీ9 తో మాట్లాడారు. పోలీసులు తన భర్తను ఎలాంటి అరెస్ట్ వారెంట్ లేకుండా అదుపులోకి తీసుకున్నారన్నారు. కనీసం ట్యాబ్లెట్ వేసుకునే సమయం కూడా ఇవ్వలేదన్నారు. మా ఆయనను ఎక్కడికి తీసుకుళుతున్నారో కూడా ఇప్పటివరకు సమాచారం లేదన్నారామె. మరోవైపు సంజయ్ అరెస్టుపై బీజేపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ మునిగే పోయే పార్టీ అని, సీఎం కేసీఆర్ కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడుతున్నాయి.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..