Etela Rajender: ఈటెల రాజేందర్ తిరిగి బీఆర్ఎస్‌లో చేరతారా.. సీఎం వ్యాఖ్యలతో అసెంబ్లీ లాబీల్లో చర్చ
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఇవాళ సమావేశాలకు చివరి రోజు కాగా సభలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పేరును అధిక సార్లు ప్రస్తావించారు సీఎం కేసీఆర్..

ఈటెల తిరిగి బీఆర్ఎస్‌లో చేరుతారా..? తన ప్రసంగంలో కేసీఆర్ పదే పదే ఈటెల పేరు ప్రస్తావించడం వెనుక కారణమేంటి..? సుమారు 2 గంటల ప్రసంగంలో 10 సార్లుకు పైగా ఈటెల ప్రస్తావన తీశారు సీఎం కేసీఆర్. పదే పదే మిత్రుడు ఈటెల రాజేందర్ చెప్పినట్టు అన్న కేసీఆర్. ఈటెల పేరు ప్రస్తావించే సమయంలో పదే పదే ఘర్ వాపసీ అంటూ నినాదాలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఈటల రాజేందర్ అనేక విషయాలను ప్రస్తావించారన్నారు. వాటిని స్వాగతిస్తామని, వాటిపై చర్చిస్తామని కేసీఆర్ చెప్పారు. ఆయన అడిగిన డిమాండ్లను తీర్చాలంటూ మంత్రులకు కేసీఆర్ ఆదేశించారు. కేసీఆర్ శైలితో ఈటల తిరిగి పార్టీలో చేరుతారంటూ పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ జరిగింది.
ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సమయంలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ పదే పదే ఈటల రాజేందర్ పేరును ప్రస్తావించారు. సంక్షేమ పథకాల రూపకల్పనలో ఈటల రాజేందర్ సహకారాన్ని గుర్తు చేశారు. ఈటల రాజేందర్ అడిగారని చేయకుండా ఉండొద్దన్నారు. అనంతరం విశ్వవిద్యాలయంలో హాస్టల్ డైట్ ఛార్జీలపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను పిలిచి మాట్లాడాలంటూ ఆర్ధిక మంత్రి హరీశ్ రావుకు సూచించారు.
బస్సుల విషయంలోనూ కూడా ఈటల సూచనలు పాటించాలంటూ ఆర్టీసీకి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా గెస్ట్ లెక్చరర్ల విషయంలోనూ ఈటలను కేసీఆర్ సమర్థించారు. తమకు ఎలాంటి భేషజాలు లేవని, మంచి సలహాలు ఇస్తే స్వీకరిస్తామని అన్నారు. మా రాజేందర్ అన్న సందు దొరికితే బద్నాం చేయాలనే ఆలోచనలో ఉన్నారని అన్నారు.
ఇదిలావుంటే, అంతకు ముందు కేసీఆర్ గురించి ఈటల రాజేందర్ కూడా మాట్లాడారు. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై ఈటల రాజేందర్ స్పందించారు. తనపై చేసిన దాడులు, వేధింపుల్ని మర్చిపోలేదన్నారు. ఇదంతా కేసీఆర్ మైండ్ గేమ్ ప్లాన్‌లో భాగమే అని విమర్శించారు. షేక్ హ్యాండ్ ఇచ్చినంత మాత్రాన ఇలాంటి వార్తలు వేస్తే ఎలా అంటూ ప్రశ్నించారు. ఇవన్నీ చిల్లర ప్రచారాలు మాత్రమే అని కొట్టిపారేశారు. ఇప్పటికిప్పుడు నన్ను ఇబ్బంది పెట్టాలనుకునేందుకే ఇలా మాట్లాడి ఉండవచ్చన్నారు. నేను బీజేపీ సైనికుడిని.. నిమిషానికో మాట మాట్లాడను. నాపై ఉన్న నమ్మకంతోనే హుజూరాబాద్ ప్రజలు గెలిపించారు. బీఆర్ఎస్ వెళ్లగొడితేనే నేను పార్టీ మారాను. అంతే కానీ పార్టీ మారే సంస్కృతి నాది కాదంటూ కౌంటర్ ఇచ్చారు. ఒక వేళ బీఆర్ఎస్ నన్ను ఆహ్వానించినా వెళ్లనంటూ కుండ బద్దలు కొట్టారు ఈటల రాజేందర్.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం
