Telangana: తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. కొన్ని రాజకీయ పార్టీల్లో పెద్ద నేతలు తమ స్థానాలను పదిలంచేసుకున్నారు. మరికొంత మంది తమతో పాటు తమ వారసులను బరిలో దించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. కాషాయపార్టీలో ఒకే జిల్లాకు చెందిన నేతలు.. ఎత్తుకు పైఎత్తు వేస్తూ తమ సీట్లతో పాటు తమ వారసుల సీట్లను కన్ఫర్మ్ చేసుకోవడానికి తెగ తాపత్రాయపడుతున్నారు. ఇంతకీ ఎవరా ఇద్దరు నేతలు ? కమలం పార్టీ వారసత్వ రాజకీయాలను ఎంకరేజ్ చేస్తుందా..?
ఉమ్మడి పాలమూరు రాజకీయాల్లో ఉనికి చాటుకునేందుకు కుస్తీ పడుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో దిగి సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో పాలమూరు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణ పార్టీలో పట్టు పెంచుకున్నారు. కర్ణాటక ఎన్నికల కో– ఇంఛార్జ్ గా పనిచేశారు. తెలంగాణ బీజేపీ రాజకీయాల్లో కీ రోల్ ప్లే చేస్తున్నారు. గత పార్లమెంట్ ఎన్నికలకు కొన్ని రోజుల ముందే చేరిన మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి… పార్టీలో జాతీయ కార్యవర్గ సభ్యుడిగా పనిచేస్తున్నారు. ఈ ఇద్దరు నేతలు భవిష్యత్ కార్యచరణపై దృష్టిపెట్టారు.
ఈ ఇద్దరు నేతల తొలి ప్రాధాన్యత మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేసి ఢిల్లీ వెళ్లడమే. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు వేరు వేరుగా ఉండటంతో… బీజేపీ హైకమాండ్ మాత్రం ఎంత పెద్ద నేతలైనా అసెంబ్లీకి పోటీ చేయాల్సిందేనని స్పష్టం చేసింది. ఎంపీ టికెట్ విషయంలో ఈ ఇద్దరు పోటీ పడుతున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల ఎంపికలోనూ ఈ ఇద్దరి మధ్య పేచీ మొదలైనట్లు పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. మహబూబ్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని డీకే అరుణ, జితేందర్ రెడ్డి ఇద్దరు నేతలు ప్లాన్ చేసుకుంటున్నారు. డీకే అరుణ సొంత అసెంబ్లీ స్థానంలో తన కూతురు స్నిగ్ధను పోటీలోకి దింపి… తాను మహబూబ్ నగర్ లో పోటీ చేయాలని భావిస్తున్నారట. మరోవైపు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అసెంబ్లీకి పోటీచేయాల్సి వస్తే ఖచ్చితంగా మహబూబ్ నగర్ నుంచే పోటీ చేయాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. అంతేకాకుండా తన తనయుడు మిథున్ రెడ్డికి షాద్ నగర్ టికెట్ కన్ఫర్మ్ చేయాలని పార్టీ హైకమాండ్ ను కోరుతున్నారు.
మరి ఆ ఇద్దరు నేతల మన్నికను అధిష్టానం మన్నిస్తుందా ? తమతో పాటు వారసులకు ఛాన్స్ ఇస్తుందా ? ఉమ్మడి పాలమూరులో బీజేపీ వ్యూహం ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..