Vijaya Shanthi: కేసీఆర్‌ చెప్పింది చేయడానికి 165 ఏళ్లు పడుతుంది.. దళిత బంధు పథకంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విజయశాంతి.

|

Jul 19, 2021 | 10:54 PM

Vijaya Shanthi: మాజీ ఎంపీ, బీజేపీ నాయకురాలు విజయశాంతి సీఎం కేసీఆర్‌పై తనదైన శైలిలో సెటైర్లు విసిరారు. తెలంగాణ ప్రభుత్వం దళితుల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన 'తెలంగాణ దళిత బంధు పథకం'పై తూర్పారబట్టారు. ఈ పథకాన్ని...

Vijaya Shanthi: కేసీఆర్‌ చెప్పింది చేయడానికి 165 ఏళ్లు పడుతుంది.. దళిత బంధు పథకంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విజయశాంతి.
Vijaya Shanthi Kcr
Follow us on

Vijaya Shanthi: మాజీ ఎంపీ, బీజేపీ నాయకురాలు విజయశాంతి సీఎం కేసీఆర్‌పై తనదైన శైలిలో సెటైర్లు విసిరారు. తెలంగాణ ప్రభుత్వం దళితుల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన ‘తెలంగాణ దళిత బంధు పథకం’పై తూర్పారబట్టారు. ఈ పథకాన్ని పైలట్‌ ప్రాజెక్టుగా హుజురాబాద్‌ నుంచి ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ పథకంపై విజయశాంతి మాట్లాడుతూ.. కేసీఆర్ గారికి ఒక్కసారిగా హుజురాబాద్ నియోజకవర్గంపై ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొచ్చిందని వ్యాఖ్యానించారు. తెలంగాణ దళిత బంధు పథకం’ ప్రకటించి, దీని అమలుకు పైలెట్ ప్రాజెక్ట్‌గా త్వరలో ఉపఎన్నికలు జరుగనున్న హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని.. ఈ నిర్ణయం వెనుక లోగుట్టు ఏమిటో ప్రజలకు ఆమాత్రం తెలియదనుకుంటే అంతకంటే వెర్రితనం మరొకటుండదని ఆమె అన్నారు.

ఇక హుజురాబాద్‌ నియోజకవర్గంలోని 20 వేల పైచిలుకు కుటుంబాల కోసం రూ.2 వేల కోట్ల మేర ఖర్చుచేస్తామని ప్రకటించారు.ఇలా తెలంగాణలోని సుమారు 20 లక్షల దళిత కుటుంబాల కోసం 2 లక్షల కోట్ల నిధులు అవసరమవుతాయి. అసలు అంత బడ్జెట్ కేటాయించే పరిస్థితి ఉందా?… సీఎంగారి లెక్క ప్రకారం ఇదంతా కార్యరూపం దాల్చడానికి 165 సంవత్సరాలు పడుతుందని విజయశాంతి అన్నారు. ఇంకా ఆమె మాట్లాడుతూ.. ‘ ఇదంతా చూస్తుంటే దళిత సీఎం… దళితులకు 3 ఎకరాల భూమి… అంటూ కేసీఆర్ గారు మరచిన వాగ్దానాలు… దళిత ఉపముఖ్యమంత్రులకు దక్కిన మర్యాద లాగే ఈ దళిత బంధు కూడా ప్రకటనలకే పరిమితమయ్యే వ్యవహారం అనిపిస్తోంది. ఒకవేళ ఉపఎన్నికల నేపథ్యంలో విపక్షాలు కోర్టుకెక్కి ఆపితే… దళితులకు వచ్చే సొమ్మును అడ్డుకున్నారంటూ ప్రతిపక్షాలపై నింద మోపి, దీనిని ప్రచారాస్త్రం చేసుకుని ఓట్లు రాబట్టుకునే ప్రయత్నం చేస్తారు. హుజూరాబాద్‌పై సీఎం గారి అంతులేని ప్రేమకు బీజాలు ఎప్పుడో పడ్డాయి. ప్రభుత్వ యంత్రాంగం, అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులంతా ఈ నియోజకవర్గంలోనే దర్శనమిస్తూ రోడ్లు, ఫంక్షన్ / కమ్యూనిటీ హాళ్లు అంటూ జనంపై వరాల జల్లు కురిపిస్తున్నారు. మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ సహా హుజూరాబాద్ పట్టణం… ఇంకా నియోజకవర్గం వ్యాప్తంగా అభివృద్ధి అంటూ వందల కోట్ల నిధులు కేటాయిస్తున్నారు. నియోజకవర్గంలో మరిన్ని పింఛన్లు, రేషన్ కార్డుల మంజూరుకు దరఖాస్తులు తీసుకుంటున్నారు. తెలంగాణ అంటే హుజూరాబాద్ మాత్రమే అన్నట్టుగా సర్కారు పోకడ కనిపిస్తోంది. ఎన్నికల ముందు ముఖ్యమంత్రిగారు చేసే వాగ్దానాల అమలు గురించి హుజూర్‌నగర్, నాగార్జునసాగర్ నియోజకవర్గాల ప్రజల్ని అడిగితే బాగా చెబుతారు’ అంటూ తనదైన శైలిలో కేసీఆర్‌పై మండిపడ్డారు విజయశాంతి.

Also Read: Banana : అరటి సాగుతో బోలెడు లాభాలు..! ఈ 10 ప్రయోజనాలు కూడా.. తెలుసుకోండి..

Anemia: రక్తహీనతను పరీక్షించడానికి కొత్త విధానం.. కంటి కింది రెప్ప ఫోటోతో..

RS Praveen Kumar: ఇక ప్రజాసేవలో.. రాజీనామాపై క్లారిటీ ఇచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్‌ కుమార్..