DK Aruna: చరిత్రలో తొలిసారి పాలమూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్న మహిళా ఎంపీ..!

| Edited By: Balaraju Goud

Jun 12, 2024 | 9:12 PM

ఒక్క గెలుపు ఉమ్మడి జిల్లాలో చరిత్రే సృష్టించింది. ఇప్పటివరకు పాలమూరు ఉమ్మడి జిల్లా నుంచి మహిళా ఎంపీ పార్లమెంట్ మెట్లు ఎక్కలేదు. సుదీర్ఘ కాలంగా మహిళా నేతలు బరిలో ఉంటున్న రెండు స్థానాల్లో ఒక్కసారి కూడా మహిళా ఎంపీని లోక్‌సభకు కు పంపలేదు పాలమూరు ప్రజలు.

DK Aruna: చరిత్రలో తొలిసారి పాలమూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్న మహిళా ఎంపీ..!
Dk Aruna
Follow us on

ఒక్క గెలుపు ఉమ్మడి జిల్లాలో చరిత్రే సృష్టించింది. ఇప్పటివరకు పాలమూరు ఉమ్మడి జిల్లా నుంచి మహిళా ఎంపీ పార్లమెంట్ మెట్లు ఎక్కలేదు. సుదీర్ఘ కాలంగా మహిళా నేతలు బరిలో ఉంటున్న రెండు స్థానాల్లో ఒక్కసారి కూడా మహిళా ఎంపీని లోక్‌సభకు కు పంపలేదు పాలమూరు ప్రజలు. మహిళలే ఎక్కువగా ఓటర్లు ఉన్నప్పటికీ మహిళా నాయకురాలిని గెలిపించుకోలేక పోతున్నారన్న వాదనకు ఈ దఫా చెక్ పడింది. తాజా ఎంపీ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ ఎంపీ స్థానం నుంచి డీకే అరుణ గెలుపొంది తొలిసారిగా పార్లమెంట్ మెట్లు ఎక్కనుంది.

ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ఎట్టకేలకు లోక్‌సభలో మహిళకు ప్రాతినిథ్యం లభించింది. ఇప్పటివరకు జిల్లాలో ఉన్న రెండు పార్లమెంట్ స్థానాల నుంచి ఒక్కసారి కూడా మహిళలు ఎంపీగా గెలుపొందలేదు. దశాబ్దాలుగా జరుగుతున్న ఎన్నికల్లో అనేక రకాల ఈక్వేషన్స్ తో అభ్యర్థులు ఎన్నికల్లో విజయం సాధిస్తూ వస్తున్నారు. అయితే సుదీర్ఘ కాలంగా నెరవేరని మహిళా ఎంపీ కల ఈసారైనా నెరవేరుతుందా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. పాలమూరు జిల్లాలోని రెండు స్థానాల్లో మహబూబ్ నగర్ జనరల్ కాగా, నాగర్ కర్నూల్ ఎస్సీ రిజర్వుడ్ స్థానం. ఈ రెండు స్థానాల నుంచి ఎన్నికల ప్రతిసారీ పురుషులతో పాటు మహిళలు బరిలో నిలుస్తున్నారు. ఎన్నికలు ఎన్ని వచ్చి వెళ్తున్న మహిళలు మాత్రం ఎన్నడూ గెలిచింది లేదు. లోక్‌సభలో ప్రాతినిథ్యం వహించింది లేదు. దీంతో ఈ ఉమ్మడి జిల్లా నుంచి మహిళ ఎంపీ గెలవడం అనేది ఒక కలలా మారింది. అయితే ఈసారి అందరి అంచనాలు తారుమారు చేస్తూ పాలమూరు ప్రజలు తొలిసారి ఎంపీగా మహిళా నేతను ఎన్నుకున్నారు.

ముచ్చటగా మూడోసారికి అరుణ ను వరించిన విజయం

మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం నుంచి ఈ దఫా విజయం సాధించి లోక్‌సభలో అడుగుపెట్టబోతోంది డీకే అరుణ. బీజేపీ అభ్యర్థిగా వరుసగా రెండోసారి బరిలో దిగి ఉత్కంఠ పోరులో ఎంపీగా గట్టెక్కారు. తొలిసారి టీడీపీ అభ్యర్థిగా 1996లో బరిలో దిగిన డికే అరుణ ఓటమి పాలయ్యారు. అనంతరం 2019 ఎంపీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి రెండోస్థానంలో నిలిచారు. ఇక ఇప్పుడు మూడోసారి పోటీలో నిలిచి సర్వశక్తులు ఒడ్డి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. ఇక నాగర్ కర్నూల్ నియోజకవర్గం నుంచి అనేక సార్లు మహిళలు పోటీ చేసినప్పటికీ ఎన్నడూ విజయం వరించలేదు. 1996 నుంచి టిడిపి అభ్యర్థిగా ఇందిర పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2004లో బీఎస్పీ తరుపున రాణి రత్నమాల పోటీ చేసి గెలవలేదు. ఇక, 2019 ఎంపీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బంగారు శృతి పోటీ చేసి మూడో స్థానానికే పరిమితమయ్యారు. ఈసారి ప్రధాన పార్టీలు కాకపోయినా స్వతంత్ర అభ్యర్థిగా శిరీష(బర్రెలక్క), మరో ఇద్దరు మహిళలు బరిలో నిలిచి ఓటమిని తప్పించుకోలేకపోయారు.

గత సంప్రదాయాలకు భిన్నంగా పాలమూరు ప్రజలు ఈ దఫా పార్లమెంట్ ఎన్నికల్లో తీర్పునిచ్చారు. సుధీర్ఘ కాలంగా పోటీకే పరిమితమవుతున్న మహిళలకు డీకే అరుణ విజయంతో ఎట్టకేలకు లోక్‌సభలో ప్రాతినిథ్యం లభించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…