దేశ వ్యాప్తంగా బీజేపీ లోక్ సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది. ఢిల్లీ కేంద్ర కార్యాలయంలో బీజేపీ జనరల్ సెక్రటరీ వినోద్ తావడే 195 మందితో ఫస్ట్ లిస్ట్ విడుదల చేశారు. అందులో తెలంగాణలోని మొత్తం 17 లోక్ సభ స్థానాలకుగాను 9 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. బీజేపీ ఎలాగైనా తెలంగాణలో రెండంకెల స్థానాల్లో విజయం సాధించాలని తీవ్ర కసరత్తు చేస్తోంది. అందులో భాగంగానే విజయ సంకల్ప యాత్రలు పేరుతో నియోజకవర్గాల వారిగా పర్యటనలు చేస్తోంది. మోదీ, అమిత్ షా వంటి అగ్రనేతలు తరచుగా ఈ రాష్ట్రంలో సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు.
తెలంగాణలో సిట్టింగ్ ఎంపీలలో ముగ్గురికి అవకాశం లభించింది. అంతే కాకుండా ఈసారి కొత్త వారికి కూడా ఇందులో చోటు కల్పించారు. ప్రముఖ హిందూ వేత్త, గో సంరక్షకులు, విరించి హాస్పిటల్ అధినేత్రి మాధవి లతకు అవకాశం కల్పించారు. అలాగే ఈ జాబితాలో భరత్ పేరు కొత్తగా వినిపిస్తోంది. ఈయన బీఆర్ఎస్ పార్టీ ఎంపీ పోతుగంటి రాములు కుమారుడు. ఈ మధ్యనే పోతుగంటి రాములు బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరారు. బీజేపీలో చేరే సమయంలోనే జెడ్పీటీసీగా ఉన్న రాములు కుమారుడు భరత్ కు ఎంపీ టికెట్ ఇస్తామన్న హామీతోనే బీజేపీలో చేరినట్లు చర్చ జరుగుతోంది. ఇక మిగిలిన నేతలందరూ రాజకీయంగా ఏదో పార్టీలో పనిచేసిన వారే.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..