JP Nadda in Warangal Highlights: కేసీఆర్‌ను సాగనంపడమే ప్రజాసంగ్రామ యాత్ర లక్ష్యం: జేపీ నడ్డా
BJP Praja Sangrama Yatra Live Updates: హనుమకొండలో బీజేపీ సభకు సర్వం సిద్ధమైంది. కాసేపట్లో హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో..

BJP Praja Sangrama Yatra Live Updates: హనుమకొండలో బీజేపీ సభకు సర్వం సిద్ధమైంది. కాసేపట్లో హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో భారీ బహిరంగ సభ ప్రారంభం కాబోతోంది. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరవుతున్నారు. ఈ సభకు భారీగా తరలివస్తున్నారు బీజేపీ శ్రేణులు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర వరంగల్‌కు చేరుకుంది. భద్రకాళి అమ్మవారి సన్నిధిలో తన పాదయాత్రను ముగించారు సంజయ్. పాదయాత్ర ముగింపుసభలో వేలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు. ఉదయం బొల్లికుంటలో మొదలైన ఈ పాదయాత్ర.. భద్రకాళి ఆలయంలో ముగిసింది.
వరంగల్‌కు చేరుకోనున్న జేపీ నడ్డా..
తొలుత శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఆ పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. నోవాటెల్ హోటల్‌లో బీజేపీ నేతలతో పాటు క్రికెటర్ మిథాలీరాజ్‌తో సమావేశం అయ్యారు. ఈ భేటీలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, తరుణ్ చుగ్‌తో పాటు ఎంపీ లక్ష్మణ్ పాల్గొన్నారు. అనంతరం పార్టీ ముఖ్య నేతలతో కాసేపు చర్చలు జరిపారు. అటు నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో వరంగల్‌కు బయల్దేరారు జేపీ నడ్డా. మరికాసేపట్లో భద్రకాళి ఆలయానికి చేరుకుంటారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆ తర్వాత వరంగల్‌లో తెలంగాణ ఉద్యమకారుడు ప్రొఫెసర్ వెంకటనారాయణ నివాసానికి వెళ్తారు. సా.4.10కి వరంగల్ బహిరంగ సభలో పాల్గొంటారు నడ్డా. అయితే, సభా వేదికగా ఆయన బీజేపీ శ్రేణులకి ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు? టీఆర్‌ఎస్ టార్గెట్‌గా ఎలాంటి యాక్షన్ ప్లాన్ ప్రకటించబోతున్నారనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఇక సభ ముగిసిన అనంతరం రాత్రి 7.30 గంటలకు నొవాటెల్ హోటల్‌లో హీరో నితిన్ కలవనున్నారు నడ్డా .
ఇదిలాఉంటే.. వరంగల్లో బీజేపీ సభ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాక సందర్భంగా కాషాయ రంగు పులుముకుంది ఓరుగల్లు మహానగరం. బారీగా స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలు వెలిశాయి. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల గ్రౌండ్ పరిసరాలు పూర్తిగా కాషాయ మయంగా మారిపోయింది. బీజేపీ నేతల ఫ్లెక్సీలతో వరంగల్, కాజీపేట, హన్మకొండ పట్టణాలు కాషాయంగా మారిపోయాయి.
బండి ప్రజా సంగ్రామ యాత్రకు ఏడాది..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు ఏడాది పూర్తయింది. మొత్తం 3 విడతల్లో 1121 కి.మీలు, 18 జిల్లాలు, 41 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేశారు. ఘర్షణలు, కేసులతో సాగిన ఈ యాత్ర నేటితో ముగిసింది. హుస్నాబాద్‌లో మొదటి విడత సంగ్రామ యాత్ర ముగింపు సభలో అమిత్‌షా, సహా పలువురు కీలకనేతలు పాల్గొన్నారు. తుక్కుగూడలో రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు తరుణ్ చుగ్ సహా పలువురు బీజేపీ జాతీయ నాయకులు హాజరుయ్యారు. ఇప్పుడు ఓరుగల్లులో ముగుస్తున్న మూడో విడత ముగింపు సభకు జేపీ నడ్డాతో పాటు కీలక నేతలు, వేలాది మంది కార్యకర్తలు హాజరవుతున్నారు. ఈ 89 రోజుల పాదయాత్రలో అనేక సమస్యలు వెలుగులోకి వచ్చాయి. సమస్యలపై వేలాది దరఖాస్తులను స్వీకరించారు. వాటి పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు. మూడో విడత యాత్రలోనూ వినతులు వెల్లువెత్తాయి. 8,734 వినతి పత్రాలు అందుకున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
LIVE NEWS & UPDATES
-
లిక్కర్ స్కామ్ ఆరోపణలను పక్కదారి పట్టించేందుకే..
ఢిల్లీ లిక్కర్ కేసులో కేసీఆర్ కుటుంబంపై ఆరోపణలు వస్తున్నాయని, ఆ ఆరోపణలను పక్కదారి పట్టించడానికే తనను అరెస్ట్ చేశారని ఆరోపించారు బండి సంజయ్. ఆ కుంభకోణంలో పాత్ర ఉందా? లేదా? చెప్పాలని డిమాండ్ చేశారు. హిందూ దేవతలను అవమానించిన మునావర్‌కి 2 వేల మందితో భద్రత కల్పిస్తారా? అని టీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు బండి సంజయ్. లిక్కర్ స్కామ్‌ను పక్కదారి పట్టించడానికే మతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టాలని చూశారని విమర్శించారు. బీజేపీని బదనాం చేయడానికి హైదరాబాద్‌లో అల్లర్లు సృష్టించాలని చూశారన్నారు. గుంట నక్కలన్నీ ఒక్కటయ్యాయని అన్నారు. బీజేపీ సింహంలా సింగిల్‌గా వస్తుందన్నారు.
-
కేసీఆర్‌ను, ఆయన కుటుంబాన్ని వదిలే ప్రసక్తే లేదు: బండి
సీఎం కేసీఆర్, ఆయన కుటుంబాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని బండి సంజయ్ అన్నారు. ఆంక్షల పేరుతో ప్రభుత్వం ప్రతీసారి అడ్డుకుంటోందన్నారు. తనను అరెస్ట్ చేసినా యాత్ర ఆగలేదన్నారు. యాత్ర పూర్తి చేసి చూపించామన్నారు. మూసీ ప్రక్షాళన ఏమైందని ప్రశ్నించారు. డిండి ప్రాజెక్టు ఏమైందని నిలదీశారు.
-
-
కేసీఆర్ కోసం జిల్లాకో జైలు రెడీ చేశాం: బండి సంజయ్
బీజేపీ కార్యకర్తలకు జైళ్లు కొత్త కాదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ధర్మ రక్షకులు పీడీ యాక్ట్‌లకు భయపడరని అన్నారు. వరంగల్ సభావేదికపై మాట్లాడిన ఆయన.. సీఎం కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. ‘జైలుకెళ్లి వచ్చా.. కేసీఆర్‌కు రూమ్ రెడీ చేసి వచ్చా’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు బండి సంజయ్. ఆంక్షల పేరుతో ప్రభుత్వం ప్రతిసారీ అడ్డుకుంటోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ జిల్లాల్లో బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారని, కేసీఆర్ కోసం ప్రతి జిల్లాకో జైలు రూమ్ రెడీ చేశామన్నారు సంజయ్.
-
కాళేశ్వరం ప్రాజెక్టుకు వేల కోట్లు కేంద్రం ఇచ్చింది: కిషన్ రెడ్డి
కేసీఆర్ కుటుంబ పాలన నుంచి తెలంగాణకు విముక్తిని కల్పిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ అవినీతి పాలన నుంచి విముక్తి కల్పిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఎప్పటికప్పుడు నిధులు ఇస్తూ ఉందన్నారు. కాళేశ్వరానికి కేంద్రం వేల కోట్లు ఇచ్చిందన్నారు కిషన్ రెడ్డి. రాష్ట్రంలో రోడ్ల నిర్మాణానికి కేంద్రం భారీగా నిధులు ఖర్చు చేసిందన్నారు. వేయి స్తంభాల గుడి అభివృద్ధికి కూడా కేంద్రం చర్యలు తీసుకుంటోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రామప్ప దేవాలయం అభివృద్ధికి రూ. 60 కోట్లు ఖర్చు చేయబోతున్నామన్నారు. కేంద్రం నిధులు ఇచ్చింది నిజం కాదా? అని ప్రశ్నించారు.
-
ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధిలో దూసుకుపోతోంది..
ప్రధాని నరేంద్ర నాయకత్వంలో దేశం అభివృద్ధిలో దూసుకుపోతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ అభివృద్ధిలో వెనుకబడి ఉందన్నారు. వరంగల్ మున్సిపల్ ఎన్నికల సమయంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తానని అన్నారని, ఏళ్లు గడుస్తున్నా ఎందుకు కట్టించలేదని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కిషన్ రెడ్డి. హైదరాబాద్-యాదాద్రి-వరంగల్ వరకు హైవే వేశామని చెప్పారు కిషన్ రెడ్డి. వరంగల్‌లో రూ. 500 కోట్లతో బైపాస్ రోడ్డు వేశామన్నారు. జగిత్యాల-వరంగల్ రోడ్డు కోసం రూ. 4,300 కోట్లు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. ఇవన్నీ తప్పని చెప్పే దమ్ము టీఆర్ఎస్ నేతలకు ఉందా? అని ప్రశ్నించారు కిషన్ రెడ్డి.
-
-
ఢిల్లీకి పాకిన కేసీఆర్ అవినీతి: జేపీ నడ్డా
కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు జేపీ నడ్డా. రూ. 40వేల కోట్లతో పూర్తి కావాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ. లక్షా 40వేల కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించారు. మజ్లిస్ భయంతోనే సీఎం కేసీఆర్ సెప్టెంబర్ 17న విమోచనం దినోత్సవం నిర్వహించడం లేదని నడ్డా విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామన్నారు. తెలంగాణ లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందన్నారు. కేసీఆర్ అవినీతి ఢిల్లీ వరకు కూడా పాకిందన్నారు. జల్ జీవన్ మిషన్ కింద రూ. 3,098 కోట్లను ప్రకటించామని, తెలంగాణ మాత్రం రూ. 200 కోట్లే తీసుకుందని నడ్డా ఆరోపించారు. కేంద్రం ఇచ్చే నిధులను కేసీఆర్ సర్కార్ దుర్వినియోగం చేస్తుందన్నారు.
-
తెలంగాణకు మొదట మద్దతు పలికింది బీజేపీనే..
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మొదట మద్దతు ఇచ్చింది బీజేపీనే అని ఆ పార్టీ చీఫ్ జేపీ నడ్డా అన్నారు. తెలంగాణ ఏర్పాటుకై గల్లీలోనూ, ఢిల్లీలోనూ బీజేపీ ఫైట్ చేసిందన్నారు. బీజేపీ మద్ధతు తోనే పార్లమెంట్‌లో తెలంగాణ పాస్ అయిందని గుర్తు చేశారు నడ్డా.
-
మీర్ ఉస్మాన్ అలీఖాన్ దారిలోనే కేసీఆర్ పయనం..
త్వరలోనే కేసీఆర్‌ను తెలంగాణ ప్రజలు ఇంట్లో కూర్చోబెడతారుని బీజేపీ చీఫ్ నడ్డా అన్నారు. చివరి నిజాం కూడా ఇలాంటి ఆంక్షలే పెట్టారని నాటి ఆంక్షలను గుర్తు చేశారు నడ్డా. మీర్ ఉస్మాన్ అలీఖాన్ దారిలోనే కేసీఆర్ పయనిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. నిజాం తరహాలోనే కేసీఆర్‌ను ప్రజలు ఇంట్లో కూర్చోబెడతారని అన్నారు.
-
సభను అడ్డుకోవడానికి కుట్ర..
బీజేపీ సభను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ సర్కార్ కుట్రలు చేసిందని జేపీ నడ్డా ఆరోపించారు. కానీ, హైకోర్టు అనుమతితో సభ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అడుగడుగునా ఆంక్షలు పెట్టారని విమర్శించారు నడ్డా. 144 సెక్షన్ ఉందని జనాన్ని రాకుండా అడ్డుకున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ బందీ చేశారని అన్నారు.
-
టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సాగనంపడమే ప్రజాసంగ్రామ యాత్ర..
టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సాగనంపడమే ప్రజాసంగ్రామ యాత్ర సంకల్పం అని జేపీ నడ్డా అన్నారు. ఆర్ట్స్ కాలేజీలో బీజేపీ సభకు అనుమతి ఇవ్వకపోవడంపై ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అంధకారంలో ఉందన్నారు. అంధకారమైన తెలంగాణలో వెలుగులు నింపడానికే బండి సంజయ్ పాదయాత్ర చేపట్టారని అన్నారు.
-
ఓరుగల్లు గడ్డకు నా నమస్కారం అంటూ ప్రసంగం ప్రారంభించిన జేపీ నడ్డా..
ఓరుగల్లు గడ్డకు నా నమస్కారం అంటూ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. ఇదిలాఉంటే.. బీజేపీ బహిరంగ సభకు భారీ స్థాయిలో కార్యకర్తలు హాజరయ్యారు.
-
బాలసముద్రం చేరుకున్న జేపీ నడ్డా..
వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న బీజేపీ చీఫ్ జేపీ నడ్డా.. అక్కడి నుంచి బాలసముద్రం చేరుకున్నారు. ప్రొఫెసర్ వెంకట నారాయణ ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. ప్రొఫెసర్ వెంకట నారాయణతోపాటు మరికొందరు ప్రొఫెసర్లతో చర్చలు జరుపుతున్నారు నడ్డా. వెంకట నారాయణ ఇంటి నుంచి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్‌కు చేరుకోనున్నారు నడ్డా.
-
వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న జేపీ నడ్డా..
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ఆయనలకు అరచ్చకు శాస్త్రోక్తంగా స్వాగతం పలికారు. ప్రత్యేకలు నిర్వహించి, ప్రసాదం అందజేశారు. జేపీ నడ్డా వెంట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్షణ్ తదితర ముఖ్య నేతలు ఉన్నారు.
-
వరంగల్‌కు చేరుకున్న జేపీ నడ్డా..
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వరంగల్‌కు చేరుకున్నారు. నడ్డా వెంట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఉన్నారు. వరంగల్‌కు చేరుకున్న ఆయన నేరుగా భద్రకాళి అమ్మవారి దర్శనానికి బయలుదేరారు. కాగా, వరంగల్‌కు చేరుకున్న జేపీ నడ్డాకు బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.
-
మరికాసేపట్లో వరంగల్‌కు జేపీ నడ్డా..
మరికాసేపట్లో వరంగల్‌కు చేరుకోనున్నారు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా. వరంగల్‌లో ఆయన మొదటగా భద్రకాళి అమ్మవారిని దర్శించుకోనున్నారు. అక్కడ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తరువాత కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ వెంకట్ నారాయణ నివాసానికి వెళ్తారు. తెలంగాణ రాకముందు, వచ్చాక పరిస్థితులపై ఆయనను అడిగి తెలుసుకోనున్నారు. అక్కడినుంచి ఆర్ట్స్ కాలేజీలోని సభ వేదికకు చేరుకుంటారు.
-
బీజేపీ మీటింగ్‌కు భారీగా తరలి వస్తున్న పార్టీ శ్రేణులు..
తెలంగాణలో దూకుడుమీదున్న కమలం పార్టీ.. మరో భారీ బహిరంగసభ నిర్వహిస్తోంది. ఇప్పటికే, హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్.. బీజేపీ మీటింగ్‌కోసం సిద్ధమైంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరవుతున్న ఈ మీటింగ్‌కు ఇప్పటికే.. తెలంగాణ నలుమూలల నుంచి బీజేపీ శ్రేణులు తరలివస్తున్నాయి. ఎన్నో అడ్డంకుల తర్వాత సభకు అనుమతి లభించడంతో.. మీటింగ్‌ను గ్రాండ్ సక్సెస్ చేయాలని భావిస్తున్న బీజేపీ, అదే స్థాయిలో ఏర్పాట్లు చేసింది.
Published On - Aug 27,2022 3:16 PM




