Telangana: ఊపందుకున్న ఆపరేషన్‌ ఆకర్ష్‌.. ఎవరు ఎవరితో టచ్‌లో ఉన్నారు?

పార్లమెంటు ఎన్నికల ముంగిట తెలంగాణ రాజకీయం రసపట్టుగా మారింది. అసెంబ్లీ పోరులో అధికారమార్పిడి జరగడంతో... జంపింగ్‌ జపాంగ్స్‌గా మారిపోతున్నారు నేతలు. ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి.. ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి... తమ అడ్రస్‌ని చేంజ్‌ చేసుకుంటున్నారు. వరుసకట్టి జరుగుతున్న ఈ వలసలజోరు.. ఎంపీ ఎన్నికల తర్వాత అనూహ్యమైన పరిణామాలకు దారితీయబోతోందా?

Telangana: ఊపందుకున్న ఆపరేషన్‌ ఆకర్ష్‌.. ఎవరు ఎవరితో టచ్‌లో ఉన్నారు?
Big News Big Debate
Follow us

|

Updated on: Mar 06, 2024 | 7:02 PM

తెలంగాణ రాజకీయాల్లో జంపింగ్‌ జపాంగ్స్‌ జాతర నడుస్తోంది. నేతలు గోడదూకడంలో దూకుడు కనబరుస్తున్నారు. పదేళ్ల తర్వాత అధికారం దక్కించుకున్న కాంగ్రెస్.. ఆపరేషన్‌ ఆకర్ష్‌కు తెరలేపడంతో… ఆ పార్టీలోకి పరుగులు పెడుతున్నారు నాయకులు. అధికారం కోల్పోయి ప్రతిపక్ష స్థానానికి పరిమితమైన బీఆర్‌ఎస్‌ నుంచి వరుసబెట్టి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు హస్తానికి దగ్గరవుతున్నట్టు కనబడుతోంది.

ఇటీవల మాజీ మంత్రి, BRS ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి కుటుంబసమేతంగా కాంగ్రెస్‌లో చేరిపోయారు. మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, కోనేరు కోనప్పలు కూడా హస్తం గూటికి చేరుకున్నారు. ఇటీవల భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కుటుంబసమేతంగా వెళ్లి సీఎంను కలవడం కలకలం రేపుతోంది. ఆ మధ్య రేవంత్‌ను కలిసిన ఉమ్మడిమెదక్‌ జిల్లా నలుగురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఆ తర్వాత కలిసొచ్చిన రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌, చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య… మర్యాదపూర్వక భేటీయేనని చెబుతుండటం అనుమానాలకు తావిస్తోంది. వీళ్ల మీటింగుల్లో ముచ్చటేదైనా.. జంపింగ్‌కు సిద్ధంగా ఉన్నారనే ముద్ర మాత్రం పడిపోయింది. ఎంపీ ఎన్నికల నాటికి ఈ గోడదూకే వ్యవహారాలు మరింత స్పీడందుకోవడం ఖాయంగా అనిపిస్తోంది.

వలసలు, చేరికలు పక్కనపెడితే… తెలంగాణలో ఇప్పుడు టచ్‌ పాలిటిక్స్‌ టముకుటమారా మోగిస్తున్నాయి. పరస్పర విమర్శలతో విరుచుకుపడుతున్న నాయకులు… సెన్సేషనల్‌గా చేస్తున్న కామెంట్స్‌ కాకపుట్టిస్తున్నాయి. పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత సీఎం రేవంత్‌… ఏక్‌నాథ్‌ షిండేలా మారి బీజేపీలోకి వెళ్తారంటూ BRS వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

కేటీఆర్ వ్యాఖ్యలకు అదే స్థాయిలో కౌంటరిచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. బీజేపీతో హరీశ్‌రావు టచ్‌లో ఉన్నారంటూ పెద్ద బాంబే పేల్చారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ వ్యాఖ్యలకు ఆజ్యం పోస్తున్నట్టుగా బీజేపీ నేతల వ్యాఖ్యలు ఉండటం విశేషం. అసలే ఆపరేషన్‌ ఆకర్ష్‌తో రగులుతున్న రాజకీయాలకు ఇప్పుడీ టచ్‌ పాలిటిక్స్‌ మరింత ఫైర్‌ టచ్‌ ఇస్తున్నట్టు కనిపిస్తోంది. మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.