Big News Big Debate: ఎండిన పంట – పండిన రాజకీయం
తెలంగాణ ఎన్నికల సంగ్రామంలో సరికొత్త అజెండా తెరమీదకొచ్చింది. నిన్న మొన్నటిదాకా అవినీతి ఆరోపణలు, కేసులంటూ ఆరోపణలు చేసుకున్న ప్రధాన పార్టీలు ఇప్పుడు జైకిసాన్ అంటున్నాయి. రైతు సమస్యలపై పోరాటాలతో ప్రభుత్వంపై ముప్పేట దాడి చేస్తున్నాయి ప్రతిపక్షాలు. ఇచ్చిన హామీల నుంచి ఎండిన పంటలవరకూ సమస్యలపై గళం విప్పుతూ జనాల్లోకి వస్తున్నాయి. అయితే రైతులకు అన్యాయం చేసిందెవరో చర్చకు సిద్ధమా అంటూ అధికారపార్టీ కాంగ్రెస్ కూడా విపక్షాలకు సవాల్ విసురుతోంది.

ఎండినపంటలను పరిశీలించి భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణకు గులాబీబాస్ సిద్ధమయ్యాయి. ఇటీవలే నల్గొండ జిల్లాలో పర్యటించిన మాజీ సీఎం కేసీఆర్.. ఇవాళ కరీంనగర్ జిల్లాలో రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎండిన పంటలను పరిశీలించి వారికి అన్నదాతకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం తెచ్చిన కరువంటున్న బీఆర్ఎస్.. రైతులను ఆదుకోవాలంటూ ఉద్యమకార్యాచరణకు సిద్ధమవుతోంది.
మరోవైపు రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై నిలదీశారు ఎమ్మెల్యే హరీష్‌రావు.. రుణమాఫీ, రైతుభరోసా ఎక్కడని ప్రశ్నించారు. వందరోజుల్లోనే 200 మంది రైతులు ఆత్మహత్యలకు కారణం ప్రభుత్వమేనన్నారు మాజీమంత్రి.
మరోవైపు అకాలవర్షాలతో నష్టపోయిన అన్నదాతలకు సాయం చేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా సత్యాగ్రహ దీక్షలకు చేపట్టింది బీజేపీ. రైతులకు ఇచ్చిన ప్రతిహామీ నిలబెట్టుకుని పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు బుద్ది చెబుతామంటున్నారు మంత్రులు. ప్రాజెక్టుల వారీగా నీటి లభ్యత నీటి నిల్వలు పై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.
మరోవైపు బీజేపీ దీక్షలు చేయాల్సింది గల్లీలో కాదని.. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలో అంటూ సలహా ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. మొత్తానికి పార్లమెంట్ ఎన్నికల ముంగిట కరువు, కరెంట్, నీళ్లు చుట్టూ తెలంగాణ రాజకీయాలు తిరుగుతున్నాయి. మరి ఈ అజెండాలతో జనాల్లోకి బలంగా వెళ్లి ఓట్లుగా మలుచుకునుదో ఎవరో?
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




