Telangana Election: హోరాహోరీగా బీఆర్ఎస్, కాంగ్రెస్.. గట్టి పోటీ ఇస్తున్న బీజేపీ.. మధ్యలో దూసుకొస్తున్న స్వతంత్ర అభ్యర్థి!

| Edited By: Balaraju Goud

Nov 17, 2023 | 1:18 PM

తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల కోలాహలం ఊపందుకుంటోంది. పోలింగ్‌కు సమయం సమీపిస్తున్న కొద్దీ, రాజకీయ సమరం రసవత్తరంగా మారుతోంది. అభ్యర్థులంతా విజయమే లక్ష్యంగా విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఓటర్లలో పట్టు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరికి వారు ప్రచారంలో దూసుకు వెళ్తుండడంతో, విజయం ఎవరిదనే అంశంపై పలుచోట్ల అంతుచిక్కని పరిస్థితి నెలకొంది..

Telangana Election: హోరాహోరీగా బీఆర్ఎస్, కాంగ్రెస్.. గట్టి పోటీ ఇస్తున్న బీజేపీ.. మధ్యలో దూసుకొస్తున్న స్వతంత్ర అభ్యర్థి!
Ramagundam Constituency Politics
Follow us on

తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల కోలాహలం ఊపందుకుంటోంది. పోలింగ్‌కు సమయం సమీపిస్తున్న కొద్దీ, రాజకీయ సమరం రసవత్తరంగా మారుతోంది. అభ్యర్థులంతా విజయమే లక్ష్యంగా విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఓటర్లలో పట్టు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరికి వారు ప్రచారంలో దూసుకు వెళ్తుండడంతో, విజయం ఎవరిదనే అంశంపై పలుచోట్ల అంతుచిక్కని పరిస్థితి నెలకొంది..

గతంలో ఎన్నడు లేని విధంగా పెద్దపెల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో ఈసారి రాజకీయ రణ రంగానికి వేదికగా మారింది. నువ్వా.. నేనా.. అనే రీతిలో అభ్యర్థులు కొనసాగిస్తున్న హోరాహోరీ ప్రచారాలతో ఇక్కడి ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరుసగా మూడు ఎన్నికల్లో పోటీ చేసి, గత ఎన్నికల్లో విజయం సాధించిన సిట్టింగ్ ఎమ్మెల్యే కోరుకంటి చందర్,ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా నాలుగవసారి ఎన్నికల బరిలో నిలిచారు. వరుసగా రెండు పర్యాయాలు పరాజయం పాలైన మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్, కాంగ్రెస్ అభ్యర్థిగా మూడవ సారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. సుదీర్ఘకాలంగా BRS పార్టీలో ఉండి అనూహ్యంగా ఆ పార్టీని వీడిన ZPTC కందుల సంధ్యారాణి బీజేపీ అభ్యర్థిగా ఎన్నికల సమరానికి సై అంటున్నారు.

ప్రధాన పార్టీలకు చెందిన ఈ ముగ్గురు నాయకులు ప్రచారంలో పోటీ పడుతుండగా, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ వీరికి ధీటుగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కేసీఆర్ సంక్షేమ పథకాలు, రామగుండంలో తాను సాధించిన అభివృద్ధి ఎన్నికల్లో తనను మళ్ళీ గెలిపిస్తాయని BRS అభ్యర్థి కోరుకంటి చందర్ బలంగా భావిస్తుండగా, కేసీఆర్ సర్కార్ పట్ల, స్థానిక ఎమ్మెల్యే పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, రెండు మార్లు పరాజయం పాలైన నేపథ్యంలో ప్రజల నుండి లభిస్తున్న సానుభూతి తన విజయానికి దోహదపడతాయని కాంగ్రెస్ అభ్యర్థి మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇక, భారతీయ జనతా పార్టీ అందుకున్న బీసీ నినాదంతో పాటు మహిళా అభ్యర్థిగా స్థానికులంతా తన వైపే నిలిచి గెలిపిస్తారనే అంచనాలతో బీజేపీ అభ్యర్థి కందుల సంధ్యారాణి ముందుకెళ్తున్నారు. ప్రధాన పార్టీలకు చెందిన ఈ ముగ్గురు అభ్యర్థులకు గట్టి పోటీ ఇచ్చేలా, స్వతంత్ర అభ్యర్థి సోమారపు సత్యనారాయణ ముమ్మర ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. గతంలో తాను సాధించిన అభివృద్ధిని చూసి ప్రజలు తనకే పట్టం కడతారని ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు సోమారపు సత్యనారాయణ. ఇలా ఎవరి అంచనాలతో వారు పోటాపోటీ ప్రచారాలతో ప్రజల్లో పట్టు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి రామగుండంలో చతుర్ముఖ పోటీ తప్పదని పరిశీలకులు భావిస్తున్నారు.

ఇదిలావుంటే, ఎన్నికల వేళ అనూహ్యంగా మారిన రాజకీయ సమీకరణాలు ప్రస్తుతం రామగుండంలో హాట్‌టాపిక్‌గా మారాయి. ఎన్నికల నగారా మోగే వరకు BRS పార్టీలో ఉన్న కందుల సంధ్యారాణి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తుండడం, గడిచిన ఐదేళ్లుగా బీజేపీ పార్టీలో కొనసాగిన సోమారపు సత్యనారాయణ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఇద్దరికీ లభించే ఓట్లు రామగుండంలో గెలుపు ఓటములను ప్రభావితం చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. BRS అభ్యర్థి కోరుకంటి చందర్, కాంగ్రెస్ అభ్యర్థి రాజ్ ఠాకూర్ మధ్య ప్రధాన పోటీ కొనసాగుతుందని పలువురు భావిస్తుండగా, ఆ రెండు పార్టీలకు ధీటుగా బీజేపీ అభ్యర్థి కందుల సంధ్యారాణి, స్వతంత్ర అభ్యర్థి సోమారపు సత్యనారాయణ కూడా గట్టి పోటీని ఇవ్వనున్నట్లు మరికొందరు అంచనా వేస్తున్నారు.

అయితే వీరిద్దరూ BRS ఓట్లను చీలుస్తారా..? కాంగ్రెస్ ఓట్లను చీలుస్తారా..? అనే అంశంపై ఆసక్తికరమైన చర్చ కొనసాగుతోంది. అంతుచిక్కకుండా ఉన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అంతిమంగా రామగుండం విజేత ఎవరనే అంశం అందరిని తీవ్ర ఉత్కంఠకు గురిచేస్తోంది. మొత్తంగా, రామగుండంలో ఎవరు గెలిచినా.. స్వల్ప మెజారిటీతోనే విజయం సాధిస్తారనే అభిప్రాయాలు సర్వత్ర వ్యక్తం అవుతున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…