
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్‌కు చెందిన డాక్టర్ సుధా శ్రీపతి క్లినిక్ ను నిర్వహిస్తున్నారు. తన కారుకు ఫాస్టాగ్ రీచార్జ్ చేసేందుకు సుధాశ్రీపతి ఆన్ లైన్‌లో ప్రయత్నించారు. గత నెల 29న గూగుల్ లో కనిపించిన నకిలీ ఫాస్టాగ్ కస్టమర్ కేర్ నంబర్‌కు డయల్ చేశాడు. ఆ తర్వాత సైబర్ నేరగాళ్లు APK ఫైల్స్ ను పంపి డాక్టర్ ఫోన్ ను హ్యాక్ చేశారు. బ్యాంక్ ఖాతాలకు సంబంధించి స్క్రీన్ షాట్స్ పెట్టాలని సైబర్ నేరగాళ్లు కోరారు. డాక్టర్ సుధాశ్రీపతి స్క్రీన్ షాట్స్ పెట్టగానే.. డాక్టర్ చెందిన యూనియన్ బ్యాంక్ లో రూ.73వేలు, HDFC బ్యాంక్ లో రూ.45వేలు, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో రూ.18,500, ఎన్ఎసీసీ బ్యాంక్ రూ.8,500లు మొత్తం రూ.1.46 లక్షలను సైబర్ నేరగాళ్లు ఇతర అకౌంట్లలోకి మళ్లించారు.
కాగా, ఈ సమయంలో గంట పాటు ఫోన్ ను హ్యాక్ చేశారు. ఫోన్ చేస్తే కలవకపోవడం, ఆన్ ఆఫ్ చేసినా స్పందించక పోవడంతో ఫోన్ హ్యాక్ అయినట్లు డాక్టర్ సుధాశ్రీపతి గుర్తించారు. వెంటనే డాక్టర్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైమ్ తోపాటు స్థానిక పోలీసులకు కూడా ఆయన ఫిర్యాదు చేశారు. ఆధారాలు తీసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, బ్యాంక్ ఖాతాల వివరాలను ఎవరికీ చెప్పవద్దని పోలీసులు సూచిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..