
హైదరాబాద్, మార్చి 1: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం తీవ్ర కలకలం రేపింది. తెలుపు రంగు బెంజ్ కారు (TS 07 EX 5556) విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీస్‌ను ఢీ కొట్టి కారుతోపాటు ఈడ్చు కెళ్లింది. ఈ ఘటనకు సంబంధించి రెండు వేర్వేరు ఫిర్యాదులు అందడంతో పోలీసులు కేసులు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. మొదటి ఫిర్యాదు ప్రకారం ఈ రోజు ఉదయం సుమారు 10:30 గంటల సమయంలో నానక్‌రామ్‌గూడ వద్ద కారు నెం. TS 07 JM 6696ను నడుపుకుంటూ వెళ్తున్న శ్రీ రాహుల్ కమరాజు వాహనాన్ని, బెంజ్ కారు డ్రైవర్ వెనుక నుంచి నిర్లక్ష్యంగా ఢీకొట్టాడు. దీంతో వాహనం అదుపు తప్పి ఫుట్‌పాత్ డివైడర్‌ను ఢీకొట్టింది. అనంతరం ప్రమాదానికి కారణమైన వాహనం అక్కడి నుంచి ORR గచ్చిబౌలి వైపు దూసుకెళ్లింది. ఈ ఘటనపై ఫిర్యాదు అందడంతో పోలీసులు BNS సెక్షన్లు 125, 281 కింద కేసు నమోదు చేశారు.
ఇక రెండో ఫిర్యాదు.. గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ట్రాఫిక్ కానిస్టేబుల్ నర్సింహులు ఇచ్చింది. IIIT జంక్షన్ వద్ద ఆయన ట్రాఫిక్ విధుల్లో ఉన్న సమయంలో ప్రమాదం సృష్టించి వస్తున్న బెంజ్ కారును ఆపేందుకు ట్రాఫిక్ కానిస్టేబుల్ నర్సింహులు సంకేతం ఇచ్చాడు. అయితే కారు ఆపకపోగా డ్రైవర్ అకస్మాత్తుగా వేగం పెంచి కానిస్టేబుల్‌పైకి దూసుకెళ్లాడు. దీంతో కానిస్టేబుల్ కారు బోనెట్‌పై పడిపోయాడు. అయినా డ్రైవర్ వాహనాన్ని జిగ్-జాగ్‌లో నడుపుతూ బోనెట్‌పై ఉన్న కానిస్టేబుల్‌కు ప్రాణాపాయం కలిగించాడు. రోడ్డుపై వెళ్తున్న ఇతర వాహనదారుల సహాయంతో కారును అడ్డుకోవడంతో డ్రైవర్ వాహనాన్ని ఆపు చేశాడు. నిందితుడికి డ్రంకెన్ డ్రైవింగ్ పరీక్ష నిర్వహించగా.. అతడి రక్తంలో ఆల్కహాల్ శాతం 160 mg/100 ml గా నమోదైంది. ఇది చట్టపరంగా అనుమతించిన పరిమితిని మించి ఉన్నట్లు తేలింది. BNS 109, 121(1), 125, మోటారు వాహనాల చట్టం సెక్షన్లు 180, 184, 185 కింద కేసు నమోదు చేశారు.
దర్యాప్తులో భాగంగా బెంజ్ కారు స్వాధీనం చేసుకుని, నిందితుడు గుర్రంపాటి తరుణ్ (24)ని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. కోర్డు నిందితుడికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించగా.. పోలీసులు అతడిని సంగారెడ్డి జిల్లా కంది జైలుకు తరలించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.