AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: దసరాకు ఎగిరిన జాతీయ పతాకం.. దేశభక్తిని చాటుతున్న ఆ పల్లెకు సెల్యూట్..

పల్లెల్లో దసరా పండుగను ఘనంగా జరుపుకుంటారు. సాధారణంగా దసరా పండుగను సుక్క, ముక్కతో ఎంజాయ్ చేస్తుంటారు. కానీ ఈ గ్రామస్తులు మాత్రం జాతీయ పతాకాన్ని ఎగురవేసి దేశభక్తిని చాటుకున్నారు.

Telangana: దసరాకు ఎగిరిన జాతీయ పతాకం.. దేశభక్తిని చాటుతున్న ఆ పల్లెకు సెల్యూట్..
National Flag Hoisting
M Revan Reddy
| Edited By: Balaraju Goud|

Updated on: Oct 14, 2024 | 1:25 PM

Share

పల్లెల్లో దసరా పండుగను ఘనంగా జరుపుకుంటారు. సాధారణంగా దసరా పండుగను సుక్క, ముక్కతో ఎంజాయ్ చేస్తుంటారు. కానీ ఈ గ్రామస్తులు మాత్రం జాతీయ పతాకాన్ని ఎగురవేసి దేశభక్తిని చాటుకున్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన తర్వాతే గ్రామస్థులు ఊరి బయట ఉన్న జమ్మిచెట్టు వద్దకు వెళ్లి పూజల్లో పాల్గొని పాలపిట్టను దర్శించుకున్నారు. దసరా పండుగ వినూత్నంగా జరుపుకున్న ఆ గ్రామమేదో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే..

బ్రిటిష్ బానిస సంకెళ్ళ నుంచి దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చింది. అదే రోజున యాదాద్రి జిల్లా రాజపేట మండలం బేగంపేటకు చెందిన స్వాతంత్య్ర సమరయోధులు బద్దం నర్సిరెడ్డి, బల్జె వీరయ్య, చీగుళ్ల మల్లయ్యలు గ్రామ చౌరస్తాలో మువ్వన్నెల జాతీయ జెండాను ఎగురవేసి, తమ దేశభక్తిని చాటుకున్నారు. అప్పటి నుంచి 78 ఏళ్లుగా మువ్వన్నెల పతాకాన్ని అవనతం చేయకుండా నిరంతరాయంగా రెపరెపలాడుతూనే ఉంది. నిరంతరాయంగా మువ్వన్నెల జాతీయ జెండాను ఎగరవేసే ఆనవాయితీని ఇక్కడ గ్రామస్తులు కొనసాగిస్తున్నారు. ప్రతిఏటా పంద్రాగస్టు, గణతంత్ర దినోత్సవం, దసరా పండుగ రోజున కూడా ఈ ఆనవాయితీని కొనసాగించడం విశేషం.

ఈ దసరాకు గ్రామానికి చెందిన నేత కార్మికుడు బోగ హనుమంతు మూడు రంగుల జెండాను నేయగా, జాతీయ పతాకాన్ని, అందులో ధర్మ చక్రాన్ని మేర కిష్టయ్య కుట్టారు. అనంతరం డప్పుచప్పుళ్ల నడుమ గ్రామ నడిబొడ్డున ఉన్న గాంధీ విగ్రహం వద్దకు చేరుకొని అక్కడి గద్దెపై జాతీయపతాకాన్ని ఎగురవేశారు. ఇక్కడ నిరంతరంగా జాతీయపతాకం ఎగురుతూ ఉంటుంది. పతాకావిష్కరణ అనంతరం గ్రామస్థులు ఊరి బయట ఉన్న జమ్మిచెట్టు వద్దకు వెళ్లి పూజల్లో పాల్గొని పాలపిట్టను దర్శించుకున్నారు. దసరా రోజున కూడా జాతీయ జెండాను ఎగురవేస్తూ దేశభక్తిని చాటుతున్న ఆ గ్రామస్తులకు సెల్యూట్ చేయాల్సిందే..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..