Watch Video: వాటితో నేలతల్లిని అలంకరించి.. బాల్యాన్ని గుర్తుచేసిన వరుణుడు..

| Edited By: Srikar T

May 22, 2024 | 3:31 PM

మొన్నటివరకు భానుడు తన ప్రతాపం చూపించాడు. వేసవి తాపంతో ప్రజలు అల్లాడిపోయారు. మొన్నటి నుంచే వర్షాలు కురవడం మొదలైంది. ఇక తాజాగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో వాతావరణం చల్లచల్లగా మారుతోంది. ఇలాంటి సమయంలోనే ప్రకృతి తన అందాలను మనుషులకు పరిచయం చేస్తుంది. అందులో ఒకటి ఆరుద్ర పురుగులు.

Watch Video: వాటితో నేలతల్లిని అలంకరించి.. బాల్యాన్ని గుర్తుచేసిన వరుణుడు..
Rain Effect
Follow us on

మొన్నటివరకు భానుడు తన ప్రతాపం చూపించాడు. వేసవి తాపంతో ప్రజలు అల్లాడిపోయారు. మొన్నటి నుంచే వర్షాలు కురవడం మొదలైంది. ఇక తాజాగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో వాతావరణం చల్లచల్లగా మారుతోంది. ఇలాంటి సమయంలోనే ప్రకృతి తన అందాలను మనుషులకు పరిచయం చేస్తుంది. అందులో ఒకటి ఆరుద్ర పురుగులు.

ఈ పేరు చెపితే మీలో చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ, మనం చదువుకునే రోజుల్లో స్కూళ్లకి వెళ్లే సమయంలో ఇలాంటి పురుగులు ఎక్కువగా కనిపించేవి. ఈ ప్రకృతిలో ఎన్నో రకాల పురుగులు మనకు కనిపిస్తాయి. అలాంటి పురుగులలో ఈ ఆరుద్ర పురుగు ఎంతో అందమైంది.. ప్రత్యేకమైనది కూడా. ఇది మన చిన్నతనంలో ప్రతి ఒక్కరికి పరిచయమే. ఎర్రని ఎరుపుతో ఒళ్లంతా ఒత్తుగా సింధూరం పూసుకున్నట్టు కనబడే మెత్తని మేను కలిగిన పురుగు ‘ఆరుద్ర పురుగు’. చూస్తే ఆకారంలో చిటికెన వేలు గోరంతే ఉంటాయి. వీటిని కొన్ని ప్రాంతాల్లో ‘కుంకుమ పురుగులు’ అని కూడా అంటారు.

వర్షాకాలం ప్రారంభమయ్యే సమయాన్ని కాలాన్ని ఆరుద్ర కార్తె అంటారు. ఆరుద్ర కార్తె మొదలవగానే రైతులు వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు. ఈ కార్తెలో మొక్కలపైన, తడిసిన నేలపైన ఈ పురుగులు కనబడతాయి. అందుకే ఈ పురుగులకు ఆరుద్ర పురుగులు అనే పేరు వచ్చింది. చిన్నతనములో మనందరం వీటితో చాలా ఆడుకునేవాళ్లం.. గుర్తుండే ఉంటుంది మీకు కూడా. కానీ ఇవి ప్రస్తుతం అంతరించే పరిస్థితి ఏర్పడింది. ఇవి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. వర్షాలు మొదలవుతున్న ఇలాంటి తరుణంలో తాజాగా హైదరాబాద్ నగరం పాతబస్తీలో ఈ పురుగులు కనిపించాయి. దీంతో స్థానిక ప్రజలు వీటిని నేలపై నుంచి ఏరుకుంటూ అరచేతిలో ఉంచుకుని సంబరపడ్డారు. ఇవి చూడటానికి ఎంతో అందంగా కనిపిస్తున్నాయి. దీంతో చిన్నపిల్లలు వాటిని చూస్తూ ఆడుకోవడం మొదలుపెట్టారు. ఈ పురుగుల జీవితకాలం కూడా చాలా తక్కువే. అందుకే దొరికే ఈ తక్కువ సీజన్ కాలంలోనే వాటిని చూసి మురిసిపోతారు ప్రజలు.

ఇవి కూడా చదవండి

ఈ పురుగులు పొలాల్లో కనిపిస్తే రైతుల్లో ఆనందం వెల్లివిరిస్తుంది. ఆరుద్ర పురుగులు కనిపించాయంటే ఏడాదంతా దండిగా వర్షాలు పడతాయని.. కాలువలు చెరువులు, కుంటలు నీటితో నిండుతాయని నమ్మకం. అలాగే పంట దిగుబడి కూడా బాగా ఉంటుందని చెబుతుంటారు. ఎర్రగా, బొద్దుగా.. చూడటానికి ఎంతో అందంగా ఉండే ఆరుద్ర పురుగు ఆగమనాన్ని అన్నదాతలు శుభసూచకంగా చెబుతుంటారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…