Telangana: ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు దొరికితే ఆంధ్రాలో బట్టబయలైంది

నంద్యాల జిల్లా నందికొట్కూరులో డ్రగ్స్ తయారీ కేంద్రంపై ఎన్సీబీ అధికారులు జరిపిన తనిఖీలు అలజడి రేపాయి. నిషేధిత డ్రగ్స్ తయారీ వెనుక పెద్ద ముఠా ఉన్నట్లు తెలంగాణలో లభించిన చిన్న క్లూ ఆధారంగా ఈ దాడులు జరిగాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Telangana: ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు దొరికితే ఆంధ్రాలో బట్టబయలైంది
Telangana

Edited By:

Updated on: Dec 17, 2025 | 11:30 AM

తెలంగాణలోని గద్వాలలో కల్లులో అల్ఫ్రాజోలం అనే నిషేధిత మందును కలిపి విక్రయిస్తున్నట్లు.. జనం ఆ కల్లును సేవిస్తున్నట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులకు సమాచారం అందింది. అక్కడ జరిపిన విచారణలో.. ఈ నిషేధిత డ్రగ్ అల్ఫ్రజూలం.. నంద్యాల జిల్లా నందికొట్కూరులోని ఓ ప్రైవేటు దుకాణ సముదాయంపై తయారవుతున్నట్లు సమాచారం అందింది. ఆ వెంటనే వెళ్లిన అధికారులు.. డ్రగ్స్ తయారు చేస్తున్న ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరు స్థానికంగా మంచి విద్యావంతుడు కాగా, మరొకరు గుంటూరుకు చెందిన యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు కంటిన్యూగా విచారించారు.

నిషేధిత అల్ఫ్రాజూలం డ్రగ్ రెండు కిలోల పౌడర్ని ,తయారీ వస్తువులను, నిందితులైన ఇద్దరు యువకులను తీసుకొని వెళ్ళిపోయారు. స్వాధీనం చేసుకున్న పౌడర్ విలువ ఆరు లక్షల ఉంటుందని సమాచారం. పట్టుబడిన ఇద్దరు యువకులు ఆన్లైన్లో రసాయనాలు తెప్పించుకొని ఈ నిషేధిత డ్రగ్ తయారు చేస్తున్నట్లు తేలింది. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలలో సుమారు పదివేల కిలోల వరకు ఈ డ్రగ్ విక్రయించినట్లు నార్కోటిక్స్ అధికారుల విచారణలో వెల్లడయింది.

వీటితో చాక్లెట్లు సైతం తయారుచేసి పరిచయమైన వారికి అమ్ముతున్నట్టు కూడా తేలింది. కొందరు విద్యార్థులకు సైతం ఈ డ్రగ్స్ తయారీని నేర్పించి ఉండవచ్చని నార్కోటిక్స్ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నిషేధిత డ్రగ్స్ ఎక్కడెక్కడ విక్రయించారు, ఎవరు సేవిస్తున్నారు, వారి ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇంకా ఎక్కడెక్కడ ఈ డ్రగ్ తయారవుతోంది, ఏ ఆన్లైన్ సంస్థ ఈ రసాయనాలను విక్రయిస్తోంది.. అనేదానిపై నార్కోటిక్స్ కంట్రోల్ అధికారులు దర్యాప్తు చేయనున్నారు. ఈ నిషేధిత అల్ఫ్రజూలం అనే డ్రగ్ కల్లు తయారీ, విక్రయాలలో పెద్ద ఎత్తున కలుపుతున్నట్లు సమాచారం. దీనిని బట్టి చూస్తే రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడెక్కడ కళ్ళు విక్రయాలు జరుగుతున్నాయో వాటిపై నిఘా పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి.

 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..