AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: సినిమాను మించి.. ఈ కేసును పోలీసులు ఎలా చేధించారో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..

ముఖం కనిపించలేదు.. ఎలాంటి ఆధారాలూ దొరకలేదు.. కానీ కనుబొమ్మపై ఉన్న ఒక్క చిన్న గాయం గుర్తు ఓ కిలాడీ చోరుడి గుట్టు రట్టు చేసింది. బంజారాహిల్స్‌లో మద్యం వ్యాపారి ఇంట్లో పక్కా ప్లాన్‌తో దోపిడీకి పాల్పడ్డ ఓ జూనియర్ ఆర్టిస్ట్‌ను పోలీసులు సినిమాను మించిన ట్విస్ట్‌తో ఎలా కటకటాల్లోకి నెట్టారో ఇప్పుడు తెలుసుకుందాం..

Telangana: సినిమాను మించి.. ఈ కేసును పోలీసులు ఎలా చేధించారో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..
Banjara Hills Theft Case Solved
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Sep 09, 2026 | 5:54 PM

Share

ఓ చిన్న శారీరక గుర్తే నేర పరిశోధనలో తిరుగులేని ఆధారంగా నిలిచింది. ప్రముఖుల నివాస ప్రాంతమైన బంజారాహిల్స్‌లోని ఓ మద్యం వ్యాపారి ఇంట్లో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. సీసీటీవీ ఫుటేజీలో నిందితుడి ముఖం సరిగా కనిపించకపోయినా, అతడి కనుబొమ్మపై ఉన్న పాత గాయం ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్‌లోని ఓ మద్యం వ్యాపారి ఇంట్లోకి ఇటీవల చొరబడిన గుర్తుతెలియని వ్యక్తి, విలువైన వస్తువులను దోచుకుని ఉడాయించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి విస్తృతంగా దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలంతో పాటు పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలించగా, అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తి కదలికలు రికార్డయ్యాయి.

సవాలుగా మారిన గుర్తింపు.. కనుబొమ్మే క్లూ..

ఫుటేజీలో వెలుతురు తక్కువగా ఉండటం, ముఖం స్పష్టంగా రికార్డు కాకపోవడంతో నిందితుడిని పోల్చుకోవడం పోలీసులకు తొలుత పెను సవాలుగా మారింది. అయితే కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దర్యాప్తు బృందం ఫుటేజీని ఫ్రేమ్ టు ఫ్రేమ్ నిశితంగా పరిశీలించింది. ఈ క్రమంలో అనుమానితుడి కుడి కనుబొమ్మ భాగంలో ఉన్న స్పష్టమైన గాయం గుర్తు పోలీసుల కంటపడింది. ఆ ఒక్క ఆధారంతో పాత నేరస్థులు, స్థానికంగా అనుమానితుల వివరాలను జల్లెడ పట్టారు.

నటన ముసుగులో దొంగతనాలు

పోలీసులు చేపట్టిన ముమ్మర గాలింపులో నిందితుడిని గౌరేష్‌గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. గౌరేష్ చలనచిత్ర పరిశ్రమలో జూనియర్ ఆర్టిస్టుగా పనిచేస్తున్నాడని, విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి నటన ముసుగులో చోరీలకు పాల్పడుతున్నాడని పోలీసులు తేల్చారు. నిందితుడి నుంచి చోరీ సొత్తును రికవరీ చేసే పనిలో ఉన్న పోలీసులు, అతడికి గతంలో ఏమైనా నేర చరిత్ర ఉందా అనే కోణంలో దర్యాప్తును ముమ్మరం చేశారు.

Follow Us