
హుస్నాబాద్‌లో భారతీయ జనతా పార్టీ ప్రజాహిత యాత్ర.. ఎంపీ బండి సంజయ్ వర్సెస్ మంత్రి పొన్నం ప్రభాకర్‌గా మారింది. దాంతో మంగళవారం ఉదయం నుంచి ఉద్రిక్త పరిస్థితుల మధ్య యాత్ర కొనసాగుతోంది. సంజయ్ యాత్రను కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకుంటామన్న ప్రకటనతో.. పోలీస్ పహారాలో బీజేపీ బండి సంజయ్ ప్రజాహిత యాత్ర సాగుతోంది.
నిన్నట్నుంచి హుస్నాబాద్‌లో బీజేపీ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ మలివిడత ప్రజాహిత యాత్ర ప్రారంభించారు. ఆ క్రమంలో పలుచోట్ల కార్నర్ మీటింగ్స్‌లో మాట్లాడిన బండి సంజయ్ అయోధ్య రాముడిపై కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో మంత్రి పొన్నంపై.. ఎంపీ బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ కాంగ్రెస్ నిరసనలకు పిలుపునిచ్చింది. అంతేకాదు బండి సంజయ్ పై కాంగ్రెస్ నాయకులు హుస్నాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇక తాజాగా సంజయ్ యాత్రను అడ్డుకోవాలని పిలుపునివ్వడంతో పాటు.. పలుచోట్ల బీజేపీ ఫ్లెక్సీలను చించేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. దీంతో ఓవైపు కరీంనగర్, మరోవైపు సిద్ధిపేట కమిషనరేట్ పరిధిలోని పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. కొన్ని చోట్ల సంజయ్ యాత్రను నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు రాళ్లు, కోడిగుడ్లు రువ్వగా.. మరికొన్ని చోట్ల కాంగ్రెస్ కార్యకర్తలు, బీజేపీ శ్రేణుల మధ్య పరస్పర ఘర్షణ వాతావరణం నెలకొంది.
మరోవైపు తాను ఎవరిపైనా వ్యక్తిగత వ్యాఖ్యలు చేయలేదని వివరణ ఇచ్చారు ఎంపీ బండి సంజయ్. చిగురుమామిడి మండలం రామన్నపల్లిలో మీడియాతో మాట్లాడిన సంజయ్.. తాను కరీంనగర్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని.. కాంగ్రెస్ ఓడిపోతే పొన్నం అందుకు సిద్ధమా అంటూ మంత్రి పొన్నంకు సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ తాను అన్ని వాటిని వక్రీకరించి, రాజకీయ పబ్బం కోసం ప్రయత్నిస్తోందన్నారు సంజయ్. రాముడిని అంటే బరాబ్బర్ కౌంటర్ అటాక్ చేస్తామని మరోమారు హెచ్చరించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ కార్యకర్తలను రెచ్చగొడుతున్నాడని.. ఇంతకాలం గౌరవంతో మాట్లాడకపోతే చేతగానితనం అనుకుంటున్నాడని పొన్నంపై ఫైర్ అయ్యారు సంజయ్. హుస్నాబాద్ లో ప్రజాహిత యాత్ర స్పందన చూసి తట్టుకోలేక ఈ పనులు చేయిస్తున్నాడంటూ ఆరోపించారు.
ఇక మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా సంజయ్ తీరుపై విరుచుకుపడ్డారు. అభివృద్ధి గురించి మాట్లాడితే.. సంజయ్ దారుణంగా మాట్లాడుతున్నాడన్నారు పొన్నం ప్రభాకర్. గతంలో కేసీఆర్‌కు ఏ గతి పట్టిందో.. సంజయ్‌కూ అదే గతి పడుతుందన్నారు పొన్నం. సంజయ్ కొత్త రాజకీయ డ్రామాలకు మళ్ళీ తెర లేపుతున్నాడని ఆరోపించారు పొన్నం. మొత్తంగా సంజయ్ వ్యాఖ్యల అనంతరం మొదలైన సంజయ్ వర్సెస్ పొన్నం ఫైట్ కాస్తా.. ఇప్పుడు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా మారి.. టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..