కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్లు పార్టీ చీఫ్ నడ్డా ప్రకటించారు. తెలంగాణ బీజేపీలో జోష్ తెచ్చిన బండి సంజయ్‌ను ఎన్నికల వరకు రాష్ట్ర సారథిగా కొనసాగిస్తారని అందరూ అంచనా వేశారు. కానీ పార్టీ నేతల మధ్య సమన్వయం చేసుకోలేకపోవడం.. హైకమాండ్‌కి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో బండి సంజయ్‌ను రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించారు. ఆయన స్థానంలో కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి తెలంగాణ పగ్గాలు అప్పగించారు.
అయితే, సంజయ్ సేవలను పార్టీ ఎలా వినియోగించుకోవాలనే దానిపై పార్టీ నాయకత్వం విస్తృతంగా చర్చింది. బండి సంజయ్ వర్గీయులు కొంత కాలంగా అసంతృప్తితో రగిలి పోతున్నారు. ఈ నేపథ్యంలోనే జాతీయ నాయకత్వంలో ఆయనకు చోటు కల్పించి అసమ్మతిని తగ్గించే ప్రయత్నం అధిష్టానం చేసినట్లు తెలుస్తోంది.
బీజేపీ రాష్ట్ర సారథి బాధ్యతల నుంచి తప్పించిన తర్వాత కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ను ప్రధాని మోడీ.. తన క్యాబినెట్‌లో తీసుకుంటారని భావించారు. కానీ పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించడంతో బండికి కేంద్ర మంత్రి వర్గంలో ఛాన్స్ లేనట్టేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ బీజేపీలో మళ్ళీ జోష్ తేవడానికి ఆయన సేవలను పార్టీ వినియోగించుకునే అవకాశం ఉంది. అదే విధంగా బీజేపీ ఏపీ ఇంచార్జీ బాధ్యతలు కూడా బండి సంజయ్‌కి అప్పగించే ఛాన్స్ ఉందని ఆయన వర్గీయులు చెబుతున్నారు.
బండి వర్గీయుల అసమ్మతి సెగలను చల్లర్చడంతో పాటు దక్షిణాదిలో పార్టీని బలోపేతం చేయడానికే బండి సంజయ్‌కి జాతీయ నాయకత్వంలో చోటు కల్పించినట్లు తెలుస్తుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..