
Mahabubabad News: తెలంగాణలో ఆడపిల్లలపై అఘాయిత్యాలు హడలెత్తిస్తున్నాయి. ప్రేమ పేరుతో ఓ యువతి గొంతుకోశాడు మహబూబాబాద్‌కి చెందిన వినయ్. బీటెక్ విద్యార్థిని పెళ్ళిచేసుకుంటానని నమ్మించి నయవంచన చేశాడు. గత కొంతకాలంగా యువతిని లైంగికంగా ఉపయోగించుకున్నాడు. పెళ్ళి ప్రస్తావన రాగానే మొహం చాటేశాడు. అంతేకాదు. ఐదు లక్షలకు భవ్య శీలానికి వెలకట్టాడు వినయ్. పెద్దమనుషుల ద్వారా పంచాయితీ పెట్టి మరి బేరం పెట్టాడు.. దీంతో తనకు జరిగిన మోసాన్ని భరించలేక, అవమానాన్ని తట్టుకోలేక భవ్య ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. చనిపోయే ముందు వినయ్‌ని ప్రాధేయపడుతోన్న ఫోన్ సంభాషణ ప్రస్తుతం కలకలం రేపుతోంది.
ఈ దారుణ ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నేరడ గ్రామంలో చోటుచేసుకుంది. అయితే, భవ్య ప్రాణాలు తీసిన వినయ్ పై చర్యలు తీసుకోవాలని.. భవ్య కుటుంబసభ్యులు మృతదేహంతో వినయ్ ఇంటి ముందు ఆందోళనకు దిగారు. భవ్య ప్రాణాలు తీసిన వినయ్‌ని శిక్షించాలని డిమాండ్ చేసింది. దీంతో కురవి మండలం నేరడ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
భవ్య ఓ ప్రైవేటు కళాశాలలో బీటెక్ చేస్తోంది. కాగా.. యువతి శీలానికి వెలకట్టి మరి పెద్దలు బలిగొన్నారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..