Bairi Naresh: హేతువాది భైరి నరేష్‌పై మరోసారి దాడి.. పోలీసుల ప్రొటెక్షన్‌లో ఉండగానే
భైరి నరేష్‌పై వరంగల్‌లో మరోసారి దాడి జరిగింది. బీజేపీ, భజరంగ్‌దళ్, ఆరెస్సెస్ వాళ్లు దాడి చేసినట్లు భైరి నరేష్ తెలిపాడు.

వరంగల్‌లో హేతువాది భైరినరేష్‌పై దాడి జరిగింది. ఆదర్శ లాకాలేజ్‌లో ఫ్రెషర్స్ పార్టీకి హాజరై వెళ్తుండగా హిందూ సంఘాల ప్రతినిధులు వెంబడించి కాకతీయక్రాస్ రోడ్డు సమీపంలోని గోపాల్‌పూర్ దగ్గర వాహనాన్ని ఆపి దాడి చేశారు. పోలీసు వాహనంలో ఉన్న నరేష్‌ను పట్టుకొని హిందూసంఘాల ప్రతినిధులు దాడికి పాల్పడ్డారు. అయ్యప్పతోపాటు హిందూ దేవుళ్లను కించ పరిచేలా గతంలో భైరి నరేష్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.
టీవీ9తో ఫోన్‌లైవ్‌లో మాట్లాడిన భైరినరేష్…తనపై బీజేపీ, భజరంగ్‌దళ్,ఆరెస్సెస్ వాళ్లు దాడి చేశారని ఆరోపించారు. పోలీసుల సమక్షంలోనే దాడిచేయడంతో తనకు ప్రభుత్వం రక్షణ కల్పించి, లైసెన్స్ గన్ ఇవ్వాలని కోరాడు. అయ్యప్పస్వామిపై తానూ చేసిన వ్యాఖ్యలకు గతంలోనే క్షమాపణలు చెప్పానన్నారు. తన వల్ల ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే, వారికి మరోసారి టీవీ9 వేదిక క్షమాపణ చెప్పారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు భైరి నరేష్ ప్రకటించాడు.
గతేడాది డిసెంబర్ నెలలో కోస్గిలో జరిగిన ఓ కార్యక్రమంలో భైరి నరేష్ అయ్యప్పస్వామిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు భగ్గుమన్నాయి. పలుచోట్ల పోలీస్‌స్టేషన్‌లో అతనిపై కేసు నమోదైంది. ఈ కేసులో జైలుకెళ్లి, 40 రోజులు శిక్ష అనుభవించాడు. ఆ తర్వాత బెయిల్‌పై బయటకొచ్చిన ఆయన, సత్యం కోసం పోరాడుతానని చెప్పాడు భైరి నరేష్. హిందూ దేవీదేవతలను అవమానకరంగా మాట్లాడిన భైరి నరేష్‌ను బయట తిరగనివ్వబోమని హిందూ సంఘాల నేతలు ప్రకటించారు. తాజాగా వరంగల్‌లో అతనిపై దాడి జరిగింది. తనపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశాడు భైరి నరేష్.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..