దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు ఏర్పాటైన బీఆర్ఎస్.. కేంద్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఈ నెల 14న ఢిల్లీలోని సర్దార్ పటేల్ రోడ్డులో బీఆర్‌ఎస్ సెంట్రల్ ఆఫీస్ ప్రారంభం కానుంది. ఫలితంగా ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికే హస్తినకు చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి అధికారిక నివాసానికి చేరుకున్న సీఎం.. పార్టీ కార్యాలయ భవన పనులపై ఎంపీలతో మాట్లాడారు. మరోవైపు.. సీఎం సతీమణి శోభ, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితలు మంగళవారం ఉదయం ఢిల్లీకి చేరుకోనున్నారు. ఈ క్రమంలో పార్టీ కార్యకలాపాల్లో కేసీఆర్ దంపతులు కలిసి పాల్గొంటారు. రాజశ్యామల, నవచండీ యాగాలు చేస్తారు. హోమాల్లో పాల్గొనేందుకు శృంగేరీ పీఠం నుంచి 12 మంది రుత్వికులు రానున్నారు. యాగానికి సంబంధించిన ఏర్పాట్లను వేముల, సంతోష్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు పరిశీలించారు. అంతే కాకుండా వాస్తుకు అనుగుణంగా కార్యాలయ భవన నిర్మాణం చేస్తున్నారు. అవసరమైన మార్పులు, చేర్పులు చేపట్టారు. కాగా.. నాలుగు రోజుల పాటు కేసీఆర్ ఢిల్లీలో ఉండే అవకాశం ఉంది.
మరోవైపు.. బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం దృష్ట్యా ఢిల్లీలో ఫ్లెక్సీలు, బ్యానర్లు వెలిశాయి. ఇప్పటికే ఢిల్లీ వీధుల్లో.. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్, ‘కేసీఆర్ ఫర్ ఇండియా, దేశ్ కీ నేత.. కిసాన్ కీ భరోసా, అనే నినాదాలతో హోర్లిండ్ లు ఏర్పాటయ్యాయి. పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవాన్ని ఘనంగా ప్రారంభించేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమయ్యాయి. రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు తదితరులను కేసీఆర్ ఇప్పటికే ఆహ్వానించారు. కేసీఆర్ ఆదేశాల మేరకు సోమవారం పలువురు నాయకులు సొంత ఏర్పాట్లు చేసుకుని ఢిల్లీకి బయలుదేరారు. వీరితో పాటు జేడీఎస్ అధ్యక్షుడు కుమారస్వామి, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ సైతం హాజరయ్యే అవకాశం ఉంది.
ఈ నెల 14న జరిగే పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ సమావేశంలో పార్టీ ఎజెండా, కార్యకలాపాలకు సంబంధించిన రోడ్‌మ్యాప్‌ను విడుదల చేస్తారు. జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఆవశ్యకతను వెల్లడించనున్నారు. బీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్న నేతలు, వివిధ రంగాలకు చెందిన వారితోనూ కేసీఆర్ వరస భేటీలు ఉండే అవకాశం ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..