Dharmapuri: ధర్మపురి రీ కౌంటింగ్‌లో కొత్త ట్విస్ట్.. కనిపించని స్ట్రాంగ్‌ రూమ్‌ తాళాలు.. తాళాలు పగుల కొట్టేందుకు నో చెప్పిన కాంగ్రెస్‌ అభ్యర్థి

|

Apr 10, 2023 | 8:43 PM

తెలంగాణలో పొలిటికల్ అటెన్షన్‌ క్రియేట్‌ చేసిన ధర్మపురి ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పీటముడి పడింది. హైకోర్టు ఆదేశాలతో స్ట్రాంగ్‌ రూమ్‌ తలుపులు తెరిచేందుకు అధికారులు ప్రయత్నించినా.. తాళాలు కనిపించలేదు. తాళాలు పగులకొట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తే.. కాంగ్రెస్‌ అభ్యర్థి అభ్యంతరం తెలియజేయడంతో.. సమస్య మళ్లీ హైకోర్టుకు నివేదించే పనిలో పడ్డారు అధికారులు.

Dharmapuri: ధర్మపురి రీ కౌంటింగ్‌లో కొత్త ట్విస్ట్.. కనిపించని స్ట్రాంగ్‌ రూమ్‌ తాళాలు.. తాళాలు పగుల కొట్టేందుకు నో చెప్పిన కాంగ్రెస్‌ అభ్యర్థి
Dharmapuri Evm Strong Room
Follow us on

2018లోనే జగిత్యాల జిల్లా ధర్మపురి అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు వెల్లడైనా.. రిజల్ట్స్‌పై అభ్యంతరాలు తెలియజేస్తూ ఎలక్షన్‌లో ఓడిన కాంగ్రెస్‌ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణకుమార్ అప్పట్లోనే హైకోర్టు తలుపు తట్టారు. కేవలం 441 ఓట్ల ఆధిక్యంతో నాడు TRS అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ గెలిచినట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఆ నిర్ణయాన్ని సవాల్‌ చేశారు అడ్లూరి. ఎన్నికలై దాదాపు ఐదేళ్లు గడుస్తున్న సమయంలో ధర్మపురి EVMలు భద్రపర్చిన స్ట్రాంగ్‌ రూమ్‌లు తెరిచేందుకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాలతో కాంగ్రెస్‌ అభ్యర్థి అడ్లూరి.. జిల్లా అధికారులు జగిత్యాలలోని స్ట్రాంగ్‌ రూమ్‌ దగ్గరకు చేరుకున్నారు. మొత్తం మూడు స్ట్రాంగ్‌ రూమ్‌లు ఉండగా.. వాటిల్లో ఒకటే తెరుచుకుంది. అందులో EVMలు మాత్రమే ఉన్నాయి. హైకోర్టుకు సమర్పించాల్సిన 17A, 17C, 17C పార్ట్‌ టు డాక్యుమెంట్లు మరో స్ట్రాంగ్‌ రూమ్‌లో ఉండటం.. వాటి తాళాలు కనిపించకపోవడంతో కాసేపు ఉత్కంఠకు దారితీసింది. ఒకానొక సమయంలో తాళాలు పగుల కొట్టాలని అధికారులు నిర్ణయించినా.. కాంగ్రెస్‌ అభ్యర్థి అడ్లూరి ఒప్పుకోలేదు. మరిన్ని అనుమానాలు వ్యక్తం చేశారు.

తాళాలు పగుల కొట్టే విషయంలో అధికారులు సైతం వెనక్కి తగ్గారు. సమస్యను హైకోర్టుకు నివేదించి.. అక్కడ నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ తెలిపారు.

2018 ఎన్నికల్లో ధర్మపురిలో ఒక లక్షా 65 వేల 341 ఓట్లు పోలవగా.. వాటిలో కొప్పుల ఈశ్వర్‌కు 79 వేల 579, అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌కు 79 వేల 138 ఓట్లు పోలయ్యాయి. కౌంటింగ్‌లో అక్రమాలు జరిగాయన్నది కాంగ్రెస్‌ అభ్యర్థి ఆరోపణ. ఇక హైకోర్టు కోరిన 17Aలో రిజిస్టర్‌ ఓటర్లు.. 17Cలో పోలైన ఓట్లు.. 17C పార్ట్‌ టులో EVM డేటా ఉంటుంది. ఈ డాక్యుమెంట్లను హైకోర్టుకు నివేదించిన తర్వాత.. కోర్టు ఆదేశాల మేరకు EVMలోని ఓట్లు లెక్కించాలో లేదో తెలుస్తుంది. దాదాపు ఐదేళ్లపాటు సాగిన ఈ సమస్య… కొలిక్కి వస్తుందని అనుకున్న తరుణంలో అనూహ్య మలుపు తిరిగింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం