మరో భారతీయురాలి కలలు కల్లలు.. అమెరికాలో తెలుగు విద్యార్థిని మృత్యువాత..!

కన్నవారి కలలను సహకారం చేసేందుకు ఎందరో భారతీయ విద్యార్థులు అమెరికా వెళ్లి చదువుకుంటున్నారు. ఉన్నత విద్యను పూర్తి చేసిన ఓ విద్యార్థిని ఉద్యోగం కోసం ప్రయత్నిస్తోంది. త్వరలోనే తమ కూతురు ప్రయోజకురాలు అవుతుందని తల్లిదండ్రులు సంతోషపడ్డారు. కానీ ఉద్యోగ కల సాకారమయ్యే వేళ అనారోగ్యంతో కన్ను మూసింది ఆ విద్యార్థిని.

మరో భారతీయురాలి కలలు కల్లలు.. అమెరికాలో తెలుగు విద్యార్థిని మృత్యువాత..!
Telugu Student Priyanka

Edited By: Balaraju Goud

Updated on: May 14, 2025 | 10:10 AM

కన్నవారి కలలను సహకారం చేసేందుకు ఎందరో భారతీయ విద్యార్థులు అమెరికా వెళ్లి చదువుకుంటున్నారు. ఉన్నత విద్యను పూర్తి చేసిన ఓ విద్యార్థిని ఉద్యోగం కోసం ప్రయత్నిస్తోంది. త్వరలోనే తమ కూతురు ప్రయోజకురాలు అవుతుందని తల్లిదండ్రులు సంతోషపడ్డారు. కానీ ఉద్యోగ కల సాకారమయ్యే వేళ అనారోగ్యంతో కన్ను మూసింది ఆ విద్యార్థిని. దీంతో కూతురి భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం పందెనపల్లికి చెందిన కొండి వెంకట్‌రెడ్డి, శోభారాణి దంపతులకు కుమారుడు, కుమార్తె ప్రియాంక(26) ఉన్నారు. ఉన్నంతలో తమ ఇద్దరి పిల్లలను కష్టపడి చదివించారు. చదువుల్లో తమ ఇద్దరు పిల్లలు ప్రతిభ కనబరుస్తుండడంతో ప్రయోజకులు అవుతారని తల్లిదండ్రులు ఎంతో సంతోషపడ్డారు. కూతురు ప్రియాంక ఢిల్లీలో అగ్రికల్చర్‌ బీఎస్సీ పూర్తి చేసి, 2023 జనవరిలో అమెరికాలోని అలబామా యూనివర్సిటీలో ఎమ్మెస్సీలో చేరింది.

పీజీ పూర్తి చేసిన ప్రియాంక.. పార్ట్‌ టైం వర్క్‌ చేస్తూ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంది. ప్రతిరోజు తల్లిదండ్రులతో మాట్లాడే ప్రియాంక.. రెండు రోజులుగా ఫోన్ చేయలేదు. దీంతో ఈ నెల 4న తండ్రి వెంకట్‌రెడ్డి ప్రియాంకకు ఫోన్‌ చేయగా, దంత సంబంధిత అనారోగ్యంతో 3 రోజులుగా అస్వస్థతగా ఉందని తెలిపింది. హాస్పిటల్ కి వెళ్లి ట్రీట్‌మెంట్ కూడా తీసుకుంటున్నానని చెప్పింది. అయితే ఇన్సూరెన్స్‌ లేకపోవడంతో చికిత్స కోసం ఎక్కువ వ్యయం అయిందని, ఇన్సూరెన్స్‌కు దరఖాస్తు చేశానని తండ్రికి ఫోన్ లో చెప్పింది. రెండు రోజులకు ఇన్సూరెన్స్‌ అప్రూవల్‌ రావడంతో సంబంధిత ఇన్సూరెన్స్ పేపర్లను తీసుకొని ప్రియాంక స్థానిక ఆసుపత్రికి వెళ్ళింది.

ప్రియాంకను పరీక్షించిన డాక్టర్లు బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉందని, వెంటనే ఆస్పత్రిలో చేరాలని సూచించారు. ఆసుపత్రిలో చేరేందుకు తాను ప్రిపేర్ కాలేదని, రెండు రోజుల తర్వాత ఆస్పత్రిలో చేరుతాననే వెళ్లిపోయింది. కానీ ఈ నెల 6న స్నానం చేసేందుకు వెళ్లిన ప్రియాంక బాత్‌రూంలో పడిపోయింది. అపస్మారక స్థితికి చేరుకున్న ప్రియాంకను ఫ్రెండ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి హెలికాప్టర్‌ ద్వారా సమీపంలోని సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు.

అప్పటికే పరిస్థితి విషమించడంతో ప్రియాంకకు వెంటిలేటర్‌ అమర్చి చికిత్స అందించారు. బ్లడ్ ఇన్ఫెక్షన్ తీవ్రం కావడంతో ప్రియాంక బ్రెయిన్ డెడ్ అయిందని డాక్టర్లు నిర్ధారించారు. తల్లిదండ్రులు, ప్రియాంక బంధువులతో ఫోన్‌లో మాట్లాడిన అనంతరం వెంటిలేటర్‌ తీసివేయడంతో ప్రియాంక మే 8వ తేదీన మృతిచెందింది. మరో రెండు రోజుల్లో ప్రియాంక మృతదేహం హైదరాబాద్ కు చేరుకోనుంది. కూతురు ప్రియాంక ఉద్యోగం రాగానే పెళ్లి చేయాలని భావించిన తల్లిదండ్రులు.. ఈ ఘటనతో గుండెల అవిసెలా రోదిస్తున్నారు. దీంతో ప్రియాంక గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..